వచ్చింది ఎందరు?... అందుబాటులో ఎందరు?

ABN , First Publish Date - 2020-12-30T06:40:40+05:30 IST

ఇంతకీ యూకే నుంచీ జిల్లాకు వచ్చింది ఎందరు?... వారిలో అధికార యంత్రాంగానికి అందుబాటులో వున్నది ఎందరు?... ఇపుడీ ప్రశ్నలే అందరినీ కలవరపెడుతున్నాయి.

వచ్చింది ఎందరు?... అందుబాటులో ఎందరు?

యూకే నుంచీ వచ్చిన వారిపై యంత్రాంగంలో అస్పష్టత

కరోనా అనుభవంతో స్ర్టెయిన్‌ వైరస్‌ పట్ల ప్రజల్లో ఆందోళన


 ఇంతకీ యూకే నుంచీ జిల్లాకు వచ్చింది ఎందరు?... వారిలో అధికార యంత్రాంగానికి అందుబాటులో వున్నది ఎందరు?... ఇపుడీ ప్రశ్నలే అందరినీ కలవరపెడుతున్నాయి. ఎందుకంటే వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్న వివరాలకు, తిరుపతి అర్బన్‌ పోలీస్‌ జిల్లా విభాగం నుంచీ అందిన సమాచారానికీ పొంతన కుదరడం లేదు. కరోనా వైరస్‌ అనుభవంతో కొత్తగా ముంచుకొస్తున్న స్ర్టెయిన్‌ వైరస్‌ పట్ల ప్రజల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. 


తిరుపతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు.... నవంబరు, డిసెంబరు నెలల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచీ 69మంది జిల్లాకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచీ అందిన సమాచారం మేరకు అన్ని రకాల వడపోతల తర్వాత ఈ సంఖ్య తేల్చారు.వీరిలో ఇప్పటి వరకూ 67మంది ఆచూకీని కనుక్కుని హోమ్‌ ఐసొలేషన్‌లో వుంచారు. వీరి నుంచీ కరోనా నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్ళు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటిదాకా 51మందికి సంబంధించిన ఫలితాలు వెలువడగా అన్నీ కూడా నెగటివ్‌ అని తేలాయి.లండన్‌ నుంచీ వచ్చిన ఈ 67మంది ఇక్కడికి వచ్చాక 248 మందిని కలిసినట్టు గుర్తించారు.ఈ ప్రైమరీ కాంటాక్టులను కూడా అధికారులు ఐసొలేషన్‌లో వుండాలని సూచించారు. వీరిలో 213 నుంచీ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపగా 86మందికి నెగటివ్‌ ఫలితాలు వచ్చాయి. లండన్‌ నుంచీ వచ్చిన 67మందికి కూడా ప్రస్తుతానికి కరోనా లక్షణాలేవీ లేవని అధికారులు గుర్తించారు. గల్లంతైన ఇద్దరి చిరునామాలూ బోగస్‌విగా గుర్తించారు. వారి మొబైల్‌ నంబర్లు స్విచ్‌ ఆఫ్‌లో వున్నాయి.


వచ్చిన వారిలో సగం మంది తిరుపతి, చిత్తూరు వారే!

 నవంబరు, డిసెంబరు నెలల్లో లండన్‌ నుంచీ జిల్లాకు వచ్చిన 67మందిలో తిరుపతి నగరానికి చెందిన వారు 17 మంది, తిరుపతి రూరల్‌ మండలవాసులు 13 మంది వున్నారు.చిత్తూరు నగరానికి చెందిన వారు 8 మంది, మదనపల్లె, యాదమరి, పాకాల మండలాల వారు నలుగురు చొప్పున, పుంగనూరు, సదుం, శ్రీకాళహస్తి మండలాల వారు ముగ్గురు చొప్పున, పీలేరు మండలానికి చెందిన వారు ఇద్దరు, ఎస్‌ఆర్‌పురం, చౌడేపల్లె, నిమ్మనపల్లె, వి.కోట, నగరి, పలమనేరు మండలాల వారు ఒక్కొక్కరు చొప్పున వున్నారు. యూకేలో స్ట్రెయిన్‌ వైరస్‌ కలకలం ప్రారంభం కావడానికి ముందే ఐరాల, పాకాల, తిరుపతి నగరం, పుత్తూరుల నుంచీ ఒక్కొక్కరు వంతున నలుగురు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్ళినట్టు కూడా అధికారులు గుర్తించారు.


తిరుపతి అర్బన్‌ జిల్లాలో 8మంది కోసం గాలింపు

జిల్లా వైద్యారోగ్య శాఖ చెబుతున్న వివరాలకు భిన్నంగా తిరుపతి అర్బన్‌ పోలీస్‌ జిల్లా పరిధిలో లండన్‌ నుంచీ వచ్చిన 8మంది ఆచూకీ కోసం పోలీసు అధికారులు గాలిస్తున్నారు. పోలీస్‌ విభాగం నుంచీ అందిన సమాచారం మేరకు లండన్‌ నుంచీ వచ్చిన వారిలో తిరుపతి అర్బన్‌ జిల్లాకు చెందిన వారు 36 మంది వున్నారు. ఇందులో ఒకరు తిరిగి లండన్‌ వెళ్ళిపోగా మరొకరు సిక్కిం రాష్ట్రానికి వెళ్ళారు. మిగిలిన 34 మందిలో 26 మంది ఆచూకీ దొరికింది. వారిని హోమ్‌ ఐసొలేషన్‌లో వుంచి కరోనా టెస్టులు చేయించారు. 19 మందికి సంబంధించిన ఫలితాలు రాగా అన్నీ నెగటివ్‌గానే తేలాయి. ఆచూకీ తెలియని  8 మంది కోసం  గాలిస్తున్నారు.


విభాగాల లెక్కల నడుమ కుదరని పొంతన

జిల్లాలో వైద్యారోగ్య శాఖ, తిరుపతి అర్బన్‌ పోలీస్‌ జిల్లా విభాగాల నడుమ లండన్‌ నుంచీ వచ్చిన వారి వివరాలు, లెక్కల విషయంలో పొంతన కుదరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్‌ వ్యాప్తితో జిల్లా ఎంత దెబ్బతిన్నదీ అందరి అనుభవంలోకీ వచ్చిందే. ఇప్పటి వరకూ జిల్లాలో 88 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 840 కరోనా మరణాలతో ఏపీలో జిల్లాయే తొలిస్థానంలో వున్న సంగతి కూడా మరువరాదు. దేశం నలుమూలల నుంచీ తిరుమలకు యాత్రికులు వస్తున్న కారణంగా తొలి నుంచీ కరోనా వైరస్‌ వ్యాప్తికి తిరుపతి హాట్‌స్పాట్‌గా మారిన విషయం అధికార యంత్రాంగానికి తెలియంది కాదు. కరోనా సెకండ్‌ వేవ్‌, స్ర్టెయిన్‌ వైరస్‌ల పరంగా మరోసారి జిల్లాకు ముప్పు ముంచుకురాకూడదంటే ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించి సంక్షోభాలను అధిగమించాల్సి వుంది. 

Updated Date - 2020-12-30T06:40:40+05:30 IST