పొట్ట దగ్గర కొవ్వు కరిగించుకోవాలంటే వెంటనే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-05-31T18:01:49+05:30 IST

పొట్ట దగ్గర కొవ్వు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ కొవ్వును కరగించుకోవడం కోసం వీలైన మార్గాలన్నీ అనుసరించాలి. అవేంటంటే...

పొట్ట దగ్గర కొవ్వు కరిగించుకోవాలంటే వెంటనే ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(31-05-2022)

పొట్ట దగ్గర కొవ్వు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ కొవ్వును కరగించుకోవడం కోసం వీలైన మార్గాలన్నీ అనుసరించాలి. అవేంటంటే...


కళ్ల కింద నల్లని వలయాలు, పొట్ట దగ్గర పేరుకునే కొవ్వు... ఇవి అస్తవ్యస్థ జీవనశైలికి సంకేతాలు. అయితే బెల్లీ ఫ్యాట్‌ గురించి అవగాహన పెంచుకుని, దాన్ని వదిలించే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.


జన్యువులు చెప్పే నిజాలు: శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకోవాలో మన జన్యువులు నిర్ణయిస్తాయి. అరుదుగా కొందరికి మాత్రమే అవసరమైన చోట, అవసరమైనంత కొవ్వే చేరుకుంటుంది. కానీ ఎక్కువమందికి ప్రధాన అంతర్గత అవయవాలు చుట్టూరా కొవ్వు పేరుకుంటుంది.


కొవ్వుల గురించి తెలుసుకోవాలి: విసెరల్‌ ఫ్యాట్‌ (అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు) ఊబకాయుల్లా కనిపించేలా చేస్తుంది. ఇది ఛాతీ మొదలు నడుము కింది వరకూ విస్తరించి ఉంటుంది. ఈ కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటే, మధుమేహం, ఇతరత్రా ఊబకాయ సంబంధ వ్యాధులకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కొవ్వును ఆరోగ్యకరమైన పద్ధతిలో, చాకచక్యంగా కరిగించాలి.


డైటింగ్‌: తెలిసిన డైట్‌ ప్లాన్స్‌ అన్నీ ప్రయత్నించేస్తూ ఉంటాం! వాటిలో ఉండేవన్నీ ఆరోగ్యకరమైన, పోషకభరితమైన డైట్‌ పద్ధతులే! కానీ వాటి ద్వారా కొవ్వును కరిగించాలనుకోవడం అత్యాశే అవుతుంది. కాబట్టి ఈ డైట్‌ ప్లాన్స్‌ అన్నీ పక్కన పెట్టి ‘లైఫ్‌స్టైల్‌ డైట్‌’ను అనుసరించాలి.


జీవనశైలి ఎలా ఉంది?: జీవనశైలి (ఎన్ని గంటలు నిద్రపోతున్నాం?, హార్మోన్ల మీద ఒత్తిడి ప్రభావం ఎంత ఉంటోంది? ఫలితంగా ఎంత కొవ్వు పేరుకుంటోంది?)తో పాటు, ఆలోచనా విధానంలో కూడా మార్పు రావాలి. తక్కువ చక్కెరలుండే ఆహారపుటలవాట్లతోపాటు, ఉత్సాహభరితమైన పనులు మన జీవితంలో భాగం కావాలి.


ఈ చిట్కాలతో...

చక్కెర: ఏ పదార్ధంలో చక్కెర దాగి ఉందో కనిపెట్టి, వాటికి దూరంగా ఉండాలి. ఇలా లక్ష్యాన్ని చేరుకునే వరకూ కొనసాగించాలి.


తక్కువ పరిమాణాల్లో, ఎక్కువసార్లు: రోజులో 3 భోజనాలు, 2 అల్పాహారాలు ఉండేలా చూసుకోవాలి. వాటిలో మాంసకృత్తులు, పీచు ఎక్కువగా, కొవ్వులు, పిండిపదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.


గుండెను పరిగెత్తించాలి: గుండె వేగం పెరిగే వ్యాయామాలు ప్రతి రోజూ చేయాలి. రోజుకు అరగంట నుంచి 45 నిమిషాలపాటు, వారంలో కనీసం మూడు నుంచి ఐదు రోజుల పాటు వ్యాయామం చేస్తూ ఉండాలి. 


ఇవి కూడదు

చూయింగ్‌గమ్‌ నమలడం, ఎక్కువగా మాట్లాడడం ద్వారా ఎక్కువ గాలిని మింగుతూ ఉంటాం. దాంతో పొట్ట లావుగా కనిపిస్తుంది.

నవ్వితే పొట్టలోని కండరాలకు వ్యాయామం అందుతుంది. కాబట్టి నవ్వించే వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడపాలి.

ఉపవాసాలతో మెటబాలిజం చతికిలబడుతుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.

నీళ్లు తగ్గించకూడదు. రోజుకి కనీసం రెండు లీటర్ల నీళ్లైనా తాగాలి. 

డీహై డ్రేషన్‌తో ఏర్పడే లావు పొట్ట తగ్గించాలంటే నీళ్లు తాగాలి. 

నీళ్లు ఒంట్లోని విషాలను బయటకు నెట్టేస్తాయి.


ఇవి చేయాలి

నడిచేటప్పుడు పొట్టను లోపలికి లాక్కోవాలి.

తక్కువ కొవ్వులుండే పెరుగు, పాలు తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.

నిటారుగా నిలబడాలి, నడవాలి. భుజాలు వంచి, ముందుకు కుంగి నడవకూడదు.

ఇంట్లో సైతం చేయగలిగే వ్యాయామం... ప్లాంక్‌.  

ఈ ఒక్క వ్యాయామంతో పొట్ట దగ్గరి కొవ్వును తరిమికొట్టచ్చు.

Updated Date - 2022-05-31T18:01:49+05:30 IST