అయినా.. రక్తం కొరతే!

ABN , First Publish Date - 2022-10-01T06:04:29+05:30 IST

రోడ్డు ప్రమాదాలు, కేన్సర్‌ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఎక్కువ. దశాబ్దకాలంగా రక్తదానంపై అవగాహన పెరిగినప్పటికీ సరిపడా రక్త నిల్వలు లేవు.

అయినా.. రక్తం కొరతే!
కుప్పం ప్రభుత్వ కళాశాలలో రక్తదానం చేస్తున్న విద్యార్థులు (ఫైల్‌ ఫొటో)

అపోహలువీడి.. దాతల సంఖ్య పెరగాలి 

నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 30: రోడ్డు ప్రమాదాలు, కేన్సర్‌ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఎక్కువ. దశాబ్దకాలంగా రక్తదానంపై అవగాహన పెరిగినప్పటికీ సరిపడా రక్త నిల్వలు లేవు. దేశంలో మూడు సెకన్లకు ఒక వ్యక్తి రక్త కొరతతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నెలకు 2 వేల యూనిట్ల రక్త నిల్వలు అవసరం కాగా ప్రస్తుతం సుమకూరుతున్నది మాత్రం 500 యూనిట్లు మాత్రమే. సాంకేతికత ఎంత పెరిగినా ఒకరి నుంచి మరొకరికి అందించడం తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అవన్నీ అపోహలు మాత్రమేనని, కనీసం 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్స్‌ దానం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. 


సోషల్‌ మీడియాతో పెరిగిన రక్తదాతలు 

సోషల్‌ మీడియాతో స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్‌ డొనేషన్‌ గ్రూపుల ద్వారా, సోషల్‌మీడియా యాప్స్‌ అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటుకే వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాతల నుంచి రక్త తీసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. 


500 యూనిట్ల నిల్వ సామర్థ్యం

చిత్తూరు, కుప్పం ప్రభుత్వాస్పత్రుల్లో రెండు బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో కుప్పం పూర్తిస్థాయిలో ప్రారంభానికి నోచుకోలేదు. చిత్తూరులో మాత్రమే బ్లడ్‌బ్యాంకు ఉంది. 500 యూనిట్ల వరకే రక్త నిల్వ చేసుకునే సామర్థ్యంఉంది. అవసరమైనప్పడు ఇక్కడి నుంచే ఏరియా, సీహెచ్‌సీ ఆసుపత్రులు వెళ్తున్నాయి. ప్రస్తుతం 250 యూనిట్ల రక్తం అందుబాటులో ఉందని బ్లడ్‌బ్యాంకు అధికారి అమరనాథ్‌ తెలిపారు. 


రక్తదానంపై అపోహలొద్దు 

ప్రతి ఒక్కరి శరీరంలో 5.5 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఒక యూనిట్‌(250-300 ఎంఎల్‌) ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ఏ నష్టం వాటిల్లదు. రక్తదానం చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా రోగనిరోదధక శక్తి పెరుగుతుంది. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించి రక్తదానం చేయిస్తున్నాం. రక్తం సేకరించిన 35 రోజుల్లో వినియోగించాల్సి ఉంటుంది. 

- అమరనాథ్‌, చిత్తూరు ప్రభుత్వాస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌ అధికారి


Updated Date - 2022-10-01T06:04:29+05:30 IST