ఇలాగైతే ఎలా?

ABN , First Publish Date - 2021-11-27T07:11:05+05:30 IST

ప్రభుత్వం అభివృద్ధి పనులను పట్టించుకోవడం మానేసింది. పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు మాత్రమే వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనివిధంగా సర్పంచుల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను వెనక్కి తీసేసుకుంది.

ఇలాగైతే ఎలా?
యాదమరి మండలం దళవాయిపల్లెలో రోడ్డు పక్కన రక్షణ గోడ నిర్మాణం (ఫైల్‌ ఫొటో)




పనులు చేయరు..  చేసేవారిని ప్రోత్సహించరు


ఖాతాల్లో నిధుల మాయంతో  నిరాశలో సర్పంచులు


చిత్తూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అభివృద్ధి పనులను పట్టించుకోవడం మానేసింది. పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు మాత్రమే వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. దీంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని కొత్తగా వచ్చిన సర్పంచులు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనివిధంగా సర్పంచుల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను వెనక్కి తీసేసుకుంది. గ్రామాలను అభివృద్ధి చేయకపోగా.. అభివృద్ధి చేసుకోవాలని కేంద్రం విడుదల చేసిన నిధులనూ రాష్ట్రం వెనక్కి తీసుకోవడం దారుణమని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.


రూ.60 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కి!


15వ ఆర్థిక సంఘం మొదటి క్వార్టర్‌ నిధులు మూడు నెలల కిందట రూ.23.96 కోట్లు, రూ.36 కోట్ల చొప్పున రెండు విడతలుగా జిల్లాకు మంజూరయ్యాయి. పంచాయతీ స్థాయిని బట్టి ఈ నిధులను కేటాయించారు. పారిశుధ్య పనులకు, తాగునీటి పథకాల మరమ్మతులకు, కార్మికుల జీతాలకు, పంచాయతీ అభివృద్ధికి ఆయా సర్పంచులు సొంత నిధులతో ఖర్చు చేశారు. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు ఉండడంతో డ్రా చేసుకుందామని కొందరు బిల్లులు పెట్టుకున్నారు. మరికొందరు బిల్లులు పెట్టుకోవడంలో ఆలస్యం చేశారు. కానీ.. ఎక్కడా బిల్లులు మంజూరు కాలేదు. సుమారు 40 శాతం నిధులు ఈ బిల్లులకు సర్దాల్సి ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాలన్నీ ఖాళీ చేసేసింది. జిల్లాకు మంజూరైన రూ.60 కోట్ల నిధుల్లో దాదాపుగా అంతా వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో సర్పంచులు లబోదిబో మంటున్నారు.

 యాదమరి మండలం దళవాయిపల్లె సర్పంచి యశోద పంచాయతీలో చేసిన పలు అభివృద్ధి పనులకుగానూ జూలైలో రూ.1.47 లక్షలు, సెప్టెంబరులో రూ.1.50 లక్షల బిల్లులు పెట్టుకున్నారు. ట్రెజరీలో బిల్లులు అప్రూవ్‌ అయ్యాయి. ఖాతాలోని రూ.7.50 లక్షల నిధులు వెనక్కి వెళ్లిపోవడంతో ఆందోళనలో పడిపోయారు. 


గంగవరం మండలం కలగటూరు గ్రామ పంచాయతీలో సర్పంచి ఈశ్వరమ్మ వీధి దీపాలు, పైపులైన్లు, మోటర్లను రూ.3 లక్షలు అప్పు చేసి, మరమ్మతులు చేశారు. పంచాయతీ ఖాతాలో రూ.15 లక్షలు ఉన్నాయిలే బిల్లు పెట్టుకుని డ్రా చేసుకుందామనుకున్నారు. ఒక్కసారిగా మొత్తం నిధులు ఖాళీ అయిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. 


అభివృద్ధి పనులు చేయాలంటే ఆలోచిస్తున్నాం


మా పంచాయతీలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, బోరు మోటర్ల రిపేర్లకు, డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు, వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, కరోనా సమయంలో శానిటైజేషన్‌ చేయడం వంటి పనులకు రూ.3.19 లక్షలు ఖర్చు చేశాం. నాలుగు నెలల కిందట బిల్లు పెట్టుకున్నాం. వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి అయిన ఖర్చు మరో రూ.2 లక్షల బిల్లు పెట్టాలనుకున్నాం. ఖాతాలోని రూ.5 లక్షలు ఒక్కసారిగా మాయమవడంతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఆలోచిస్తున్నాం.

- ఊహ, నంజరపల్లె సర్పంచి, పెనుమూరు మండలం 


రూ.6.89 లక్షలు వెనక్కి


మా గ్రామంలో కొత్త బోరు మోటరు వేయించాం. జూన్‌లోనే ఖర్చు అయిన రూ.1.40 లక్షలు బిల్లు పెట్టుకున్నాం. బంగారుపాళ్యం సబ్‌ ట్రెజరీలో బిల్‌ అప్రూవ్‌ కూడా అయిపోయింది. ఇక మంజూరు కావాల్సి ఉండగా.. సర్పంచి ఖాతాలోని రూ.6.89 లక్షలు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రభుత్వం ఇలా చేయడం నిజంగా దారుణం. ఇక మేం గ్రామాల్లో పనులెలా చేయాలి.

- భగవతి, ఓటివారిపల్లె సర్పంచి, యాదమరి మండలం 


అప్రూవ్‌ అయిన బిల్లులకు నిధులు


సర్పంచుల ఖాతాల్లో నిధులు జీరోగా మారడం అనేది రాష్ట్ర స్థాయి సమస్య. పనులు చేసి బిల్లులు పెట్టుకుని.. ఆ బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్రూవ్‌ అయి ఉంటే.. వాటికి మాత్రం నిధులు కచ్చితంగా విడుదల అవుతాయి. సర్పంచులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

- డీపీవో దశరథరామిరెడ్డి




Updated Date - 2021-11-27T07:11:05+05:30 IST