రాఘవ కుటుంబానికి న్యాయం జరగాలి

ABN , First Publish Date - 2021-03-01T06:00:10+05:30 IST

బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలోని కన్నీరు రాఘవ కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని రాష్ట్ర టీడీపీ దళిత నాయకుల బృందం హామీ ఇచ్చింది.

రాఘవ కుటుంబానికి న్యాయం జరగాలి
ఇళ్లపల్లిలో రాఘవ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న టీడీపీ దళిత నాయకుల బృందం

రాష్ట్ర టీడీపీ దళిత నాయకులు

బిక్కవోలు, ఫిబ్రవరి 28: బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలోని కన్నీరు రాఘవ కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని రాష్ట్ర టీడీపీ దళిత నాయకుల బృందం హామీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో  ఈ బృందం సభ్యులు ఇళ్లపల్లిలో రాఘవ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు గ్రామంలో విజయోత్సవ ర్యాలీకి అనుమతివ్వడాన్ని తప్పుబట్టారు. ఇంట్లో బాలింత ఉందని బాణసంచా దూరంగా కాల్చమన్న రాఘవను, కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచారన్నారు.  బిక్కవోలు ఎస్‌ఐ వాసు వచ్చి వారిని వారించకపోగా, ఇంట్లో ఉన్న రాఘవ, అతని కుటుంబ సభ్యులను తిరిగి కులం పేరుతో దూషించి కొట్టడం  దారుణమన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఖాకీ బట్టలు తీసేసి వైసీపీ కండువాలతో ఉద్యోగాలు చేయాలని సూచించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ బిక్కవోలు ఎస్‌ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తిరిగి ఎస్‌ఐనే విచారణాధికారిగా నియమించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నాయకత్వంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే రామకృష్ణారెడ్డితో పాటు మరో 35 మందిపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.  దాడిచేసి కులం పేరుతో దూషించిన వైసీపీ నేతలపైనా, చట్టాన్ని రక్షించాల్సిన ఎస్‌ఐ వాసుపైన అట్రాసిటీ చట్టం, నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోవాలని, రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాఘవ కుటుంబానికి అండగా ఉంటామని దళిత నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, అయితా బత్తుల ఆనందరావు, ముప్పుడి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. వారి వెంట మండల టీడీపీ నాయకులు సత్తి దేవానందరెడ్డి, రాయుడు రామచంద్రరావు, సిరసపల్లి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

బలభద్రపురం మాజీ సర్పంచ్‌కు పరామర్శ 

ఇటీవల చింతూరు మండలంలో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తూ డోకుబుర్ర దైవ కృపావతి మృతి చెందడంతో ఆమె భర్త, బలభద్రపురం మాజీ సర్పంచ్‌ చాపల వీరభద్రరావును రాష్ట్ర టీడీపీ దళిత నాయకులు పరామర్శించారు. 

Updated Date - 2021-03-01T06:00:10+05:30 IST