జిల్లాలో కురుస్తున్న వర్షాలు

Nov 29 2021 @ 01:24AM
బెళుగుప్ప వద్ద పొలంలోనే కుళ్లిపోయిన పప్పుశనగ పంట

అపార నష్టం

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 

కోట్ల రూపాయల పెట్టుబడి నీటిపాలు 

పంట చేతికొచ్చే దశలో విధ్వంసం

కరువు రైతు మళ్లీ అప్పులపాలు


తుఫాన దెబ్బకు జిల్లా రైతులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో  పంటలు దెబ్బతిన్నాయి వేరుశనగ, వరి, పప్పుశనగ, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు నీటిపాలు కావడంతో రైతులు భారీగా నష్టపోయారు. కోట్లాది రూపాయల పెట్టుబడి.. వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోయింది. వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోగా, వరి కంకులు నీటిలోనే మొలకలు వేస్తున్నాయి. పప్పుశనగ పొలాలు బురదతో నిండిపోయాయి. మిర్చిపంట పొలాలు జోమెక్కడంతో తెగుళ్లు విజృంభించాయి. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నష్టాన్ని కాకిలెక్కలు కడుతున్నారని అటు రైతులు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా విధించిన నిబంధనలతో ఎంతమేర పరిహారం వస్తుందో తెలియక అన్నదాతలు అయోమయంగా ఎదురు చూస్తున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు,  అనారోగ్య సమస్యల కోసం దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టి కొండంత ఆశతో పంటలను సాగు చేస్తే  చేతికొచ్చే దశలో నాశనమయ్యాయి. పెట్టుబడి కూడా దక్కకపోగా అప్పులే మిగులుతున్నాయి. 


పప్పుశనగ పంటంతా నాశనం

రబీ సీజనలో 53 వేల హెక్టార్లల్లో సాగు 

ఎడతెరిపిలేని వర్షంతో కుళ్లిపోయిన పంట 

మళ్లీ విత్తనం వేసేందుకు రైతులు సన్నద్ధం 

మళ్లీ తుఫానతో ఆశలు అడియాశలు  

అనంతపురం వ్యవసాయం, నవంబరు 28: జిల్లా వ్యాప్తంగా రబీ సీజనలో 53 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో పప్పుశనగ పంట సాగు చేశారు. వరుస వర్షాలతో తెగులు సోకడంతో పూర్తి స్థాయిలో పంట దెబ్బతింది. జిల్లాలోని 19 మండలాల్లో 55 వేల ఎకరాల్లో రూ.66.11 కోట్ల విలువైన పప్పుశనగ దెబ్బతిన్నట్లు వ్యవసా య శాఖ ప్రాథమిక అంచనా. జిల్లాలో నీటమునిగిన పొలాలను మాత్రమే వ్యవసాయ అధికారులు లెక్కించినట్లు తెలిసింది. వాస్తవానికి సాగుచేసిన పంటంతా దెబ్బతిన్నట్లు బాధిత రైతులు వాపోతున్నారు. తాజాగా జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బొత్ససత్యనారాయణ నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పంటనష్టం అంచనాల్లో తప్పులున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరో మారు క్షేత్ర స్థాయిలో పంటనష్టంపై అంచనాలు సిద్ధం చేసి పంపాలని వ్యవసా య అధికారులను ఆయన ఆదేశించారు. వరుస వర్షాలతో వేరుకుళ్లు తెగులు సోకి పొలాల్లోనే పంటంతా దెబ్బతిన్నట్లు బాధిత రైతులు వాపోతున్నారు. రబీ సీజనలో పప్పు శనగ పంట సాగు చేసిన నాటి నుంచి వర్షాలు ప్రభావం చూపటంతో పంట పాడైపోయింది. 


ఇప్పటికే అదును దాటిన వైనం 

రబీ సీజనలో నవంబరు 15 దాకా పప్పుశనగ సాగు చేసుకునేందుకు అదును సమయం.  వరుస వర్షాలతో పప్పుశనగ పూర్తిగా దెబ్బతినడంతో మళ్లీ విత్తనం వేసు కుందామని రైతులు భావించారు. అయితే ఇప్పటికీ ఇంకా పొలాలు ఆరలేదు. పొలాలు ఆరడంతోపాటు మళ్లీ వర్షాలు పడకపోతేనే మళ్లీ పప్పుశనగ విత్తనం వేసుకునేం దుకు అవకాశం ఉంటుంది. తుఫాన ప్రభావంతో ఆదివారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  దీంతో నెలాఖరులోనైనా విత్తనం వేసుకోవచ్చన్న రైతుల ఆశలు అడియా శలయ్యాయి. 


పంట నష్టపరిహారం కోసం వేడుకోలు 

జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు  నష్ట పరిహారం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పప్పుశనగ మినహా మిగతా పంటలకు పంట నష్టపరి హారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు  నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 61 మండలాల్లో 1.16 లక్షల ఎకరాల్లో రూ.169.33 కోట్ల విలువైన పప్పుశనగ, వరి, వేరుశనగ, ప్రత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు దెబ్బతి న్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. నష్టపోయిన పప్పుశనగ రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపింది. జిల్లాకు 16వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాలు అవసరమని నిర్ధారించారు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మళ్లీ సబ్సిడీతో విత్తనం పంపిణీ చేసినా విత్తేందుకు  అదును దాటిపోయిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని పలు వురు ఎమ్మెల్యేలు ఇనచార్జ్‌ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సబ్సిడీతో విత్తనం ఇవ్వడంతోపాటు ఈ క్రాపింగ్‌కు సం బంధం లేకుండా రైతులకు పంటనష్టపరిహారం అందించా లని కోరారు. 

 

ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యం..! 

జిల్లాలో నెలకొన్ని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యమైంది. వర్షా లు తగ్గిన తర్వాత పెసర, మినుములు, ధనియాలు, కొర్ర, జొన్న, ప్రొద్దుతిరుగుడు పంటలు సాగు చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రబీలో పంట నష్టపోయిన, వరుస వర్షాలతో  పంట సాగు చేయలేక పొలాలను బీడు గా ఉంచుకున్న రైతులకు కూడా ప్రత్యామ్నాయ విత్తనా లను సబ్సిడీతో అందించి ఆదుకోవాల్సిఉంది. ఆ మేరకు ప్రజాప్రతినిధులు  జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల ను సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులను ఆదుకోవాల్సి ఉంది. 


పప్పుశనగ పంటంతా పోయింది

16 ఎకరాల్లో పప్పుశనగ సాగు చేశా. వరుసగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలవడంతో పంటంతా పోయింది. ఎకరాకు రూ.10వేల దాకా ఖర్చు చేశా.ఈ సారి దిగుబడి బాగా వస్తుందని ఆశతో సాగు చేస్తే వర్షానికి పంట దెబ్బతినింది. పంటంతా పూర్తిగా పోవడంతో మళ్లీ విత్తుకోవాలనుకున్నా పొలాలు ఆరలేదు. అం తలోనే మళ్లీ తుఫానతో వర్షాలు పడతాయని ప్రకటి స్తున్నారు. ఈనెలాఖరులోగా విత్తనం వేసుకుంటేనే దిగుబడి వస్తుంది. మారిన వాతావరణ పరిస్థితులతో ఈ సారి పప్పుశనగ పంటను మరిచిపోవాల్సిందే. పంట  నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. వంద శాతం సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలు అందించి రైతులకు చేయూతనివ్వాలి. 

- రైతు విజయ్‌కుమార్‌నాయుడు, నారాయణపల్లి, పుట్లూరు మండలం 

నేలకొరిగిన వరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రైతు

12 వేల ఎకరాల్లో వరి పంట ధ్వంసం 

కోత దశలో పంటపై ప్రవహించిన నీరు  కుళ్లిపోయిన కాండం... 

మొలకలొచ్చిన ధాన్యం రూ. 36 కోట్ల దాకా అన్నదాతకు పెట్టుబడి నష్టం

 హెచ్చెల్సీ ఆయకట్టులో రైతన్నల ఆక్రందన  

8 వేల ఎకరాలలో నష్టాన్ని చూపిన అధికారులు

ఎకరాకు రూ. 6 వేల ప్రకారం 

పరిహారం లెక్కలు 

రాయదుర్గం: తుంగభద్ర ఎగువ కాలువ కింద సాగు చేసిన వరిని తుఫాను తుడిచేసింది. ఖరీ్‌ఫలో సాగు చేసి కోత దశలో ఉన్న పంటపై వరద  పొంగి రైతుల ఆశలను ముంచేసింది. కణేకల్లు, బొమ్మన హాళ్‌ మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టులో ఈ ఏడాది 38 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతింది. పంట నష్టం భారీగా వాటిల్లినప్పటికీ ప్రభుత్వం  తూతూ మంత్రంగా లెక్కగట్టింది.  అధికారు లు మాత్రం ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి లెక్కగడుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు పరిహారం కింద ఎలాంటి సొమ్ము చెల్లించక పోగా కనీసం ఆసరాగా కూడా నిలిచిన పరిస్థితి లేదని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  


రూ. 36 కోట్ల  పెట్టుబడి నష్టం 

ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులకు రూ. 36 కోట్ల దాకా పెట్టుబడి నష్టం జరిగినట్టు అంచనా. తుఫాను తీవ్రతకు  కోత దశలో ఉన్న పంట సుమారు 12 వేల ఎకరాలు నేలకొరిగి నీళ్లల్లో తడిచి పోయింది. దీంతో కంకి పూర్తిగా మొలక వచ్చే విధంగా పాడైపోయింది. కనీసం నేలకొరిగిన ధాన్యాన్ని కోత కోసి విక్రయించేందుకు వీలు లేని పరిస్థితి ఉంది. ఎకరాకు కనీసం రూ. 30 వేల దాకా పెట్టుబడి కింద రైతులు పెట్టినట్లు స్పష్టం చేస్తున్నారు.   తుఫాను లాంటి వాతావరణ బీభత్సాలు లేకపోయి ఉంటే ఎకరాకు 40 బస్తాల ప్రకారం 4.80 లక్షల బస్తాల ధాన్యం 12 వేల ఎకరాల నుంచి లభించేదని రైతులు చెబుతు న్నారు. పంట కోత చేసి ధాన్యాన్ని విక్రయించి ఉంటే రూ. 63 కోట్లు ఆదాయం వచ్చేదని వివరిస్తున్నారు. దీని ప్రకారం పెట్టుబడి కింద రూ. 36 కోట్లు పోయినా రూ. 27 కోట్ల దాకా రైతులకు మిగులు బాటయ్యేది. పైగా చా లా మంది రైతులు కౌలుపై ఆధారపడటంతో అదనంగా ఆ భారం కూడా మోయాల్సిన పరిస్థితిని ఏర్పడింది. పెట్టుబడులకు చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితిలో రైతులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఆయకట్టు కింద ఇప్పటికే నేలకొరిగిన పంటను ఎత్తి సరిచేసుకు నేందుకు రైతులు శ్రమించినా ధాన్యం మాత్రం  తిండికి ఉపయోగపడని విధంగా తయారైందని వాపోతున్నారు. 


ప్రభుత్వ నిబంధనలతో నష్టం 

ప్రభుత్వం తుఫాను తీవ్రతకు నష్టపోయిన పంటల వివరాలు అంచనా వేయడంలో విధించిన నిబంధనలు రైతులను మరింత కుంగదీస్తున్నాయి.  క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అంచనా వేస్తున్నప్పటికీ నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 33 శాతానికి మించి పంట పూర్తిగా నష్టపోతేనే ప్రభుత్వం దృష్టిలో వరద నష్టం కింద అంచనా వేస్తారు. అదేవిధంగా వరి కంకి పూర్తిగా నీటిలో మునిగి రోజుల తరబడి ఉన్నప్పుడే ప్రభుత్వ లెక్కల్లో కనబరిచేందుకు వీలుంటుంది.  వరి పైరు పూర్తిగా నేలలో నుంచి ఊడలతో పాటు బయటకు వచ్చినప్పుడే ఆ పొలం నష్టం కిందకు అర్హత పొందుతుంది. కానీ చాలా చోట్ల మాత్రం తుఫాను దెబ్బకు గింజ గట్టి పడి, కంకులు వచ్చిన వరి పైరు పూర్తిగా నేలకొరిగి బురదమయమైంది. దీంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి. దీంతో రైతులు పరిహారం అందుతుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌లో నమోదైన పంటకు మాత్రమే పరిహారానికి అర్హతగా వివరిస్తున్నారు. పంట పూర్తిగా నష్టపోయినా,  తడిసిన గింజ లను ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేస్తున్నారు. తుఫాను నష్టంగా కనబరిస్తే ధాన్యం కొనుగోలు ఉండదని,  నష్టం కింద చూపించకపోతేనే కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారని రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో పరిహారం కంటే ప్రభుత్వ నిబంధనలే రైతులను బాధపెట్టే విధంగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వాధికారులు ఆయకట్టు కింద 8 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. ఎకరాకు రూ. 6 వేల ప్రకారం పరిహారం అందించేందుకు ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. దీని ప్రకారం రూ. 4.80 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లినట్లు సమాచారం. పెళ్లికి చేసిన అప్పు తీర్చాలనుకున్నా

కూతురి పెళ్లి చేసినందుకు అయిన అప్పును ఈ ఏడాది కొంత తీర్చగలననే నమ్మకం ఉండేది. కానీ పంట  తుఫాను దెబ్బకు పూర్తిగా నాశనం కావడంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. నాకున్న మూడున్నర ఎకరాలలో వరి సాగు చేశా. కంకి వచ్చిన పంట తుఫాను దెబ్బకు నేల కొరిగిపోయింది. ఎకరాకు రూ. 30 వేల దాకా పెట్టుబడి పెట్టా. కానీ పంటపై నీళ్లు ప్రవహించి మట్టి చేరుకుంది. అధికారులు కూడా వచ్చి చూశారు. ఇప్పటివరకు పరిహా రం అందించలేదు. చేసిన అప్పుకు తోడుగా ఈ సారి పెట్టుబడి అప్పు కూడా తోడైంది. పంట ఇప్పటికీ పూర్తిగా నేలకు ఒరిగిపోయి ఉంది. పైన కప్పుకున్న ఎర్రమట్టి తొలగించి పంటను తీయాల్సిన పరిస్థితి ఉంది.   

-  వెంకట రెడ్డి, రైతు, గోనేహాళ్‌

పైరు పైన నీళ్లు పారటంతో కుళ్లిపోయింది

తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో రోజుల తరబ డి పైరుపైన నీళ్లు పారడంతో వరి కాండం నుంచి కంకి వ రకు కుళ్లిపోయింది. పంట పూర్తిగా నీళ్లల్లో నానిపోయింది. కంకిలోని గింజలు మొలకెత్తుతున్నాయి. ఎకరాకు రూ. 30 వేల దాకా ఇప్పటివరకు పెట్టుబడి పెట్టా. కౌలు కింద ఎకరాకు రూ. 20 వేల దాకా చెల్లించాలి. ఆరు ఎకరాల పొ లంలో కొంత కూడా మిగలకుండా పూర్తిగా పాడైపో యింది. ఇప్పటికే రూ. రెండు లక్షలు అప్పు ఉంది. ఇప్పు డు పెట్టుబడి కింద పెట్టిన సొమ్ము రూ. 1.50 లక్షలు దాకా అదనంగా అప్పు పెరిగింది. పదవ తరగతి చదివే పాప ఉంది. పాసైతే పెద్ద కళాశాలలో చదివిద్దామని ఆశపడ్డాను. కానీ ఏమి చేయాలో తెలియటం లేదు. తుఫాను వచ్చి పూర్తిగా నాశనం చేసింది.   

 -  తిప్పేస్వామి, రైతు, కణేకల్లు

 

పొలాల్లోనే కుళ్లిపోయిన వేరుశనగ 

కోత సమయంలో వరుస వర్షాలతో నష్టం 

పశువుల మేతకు పనికిరాని వైనం 

 అనంతపురం వ్యవసాయం:  జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు  పొలాల్లోనే వేరుశనగ పంట కుళ్లిపోయింది.  ఇటీవల తుఫాన ప్రభావంతో వరుసగా కురిసిన వర్షాలకు అప్పటికే కోత పూర్తై పొలాల్లో ఆరబెట్టిన వేరుశనగ పంటంతా కుళ్లిపోయింది. పశుగ్రా సానికి కూడా పనికిరాకుండాపోయింది. ఈ ఏడాది ఖరీ్‌ఫలో 4.90 లక్షల హెక్టార్లల్లో వేరుశనగ పంట సాగు చేశారు. జూన, జూలై రెండో వారం వరకు 3.90  లక్షల హెక్టార్లల్లో సాగైంది. జూలై నెలాఖరు, ఆగస్టు మాసంలో  లక్ష హెక్టార్లల్లో వేరుశనగ పంట సాగు చేశారు. జూన, జూలై రెండో వారం వరకు సాగు చేసిన పంట వర్షా భావంతో దెబ్బతింది. పంట కీలక దశలో వర్షాభావం వెం టాడటంతో దిగుబడి రాలేదు. ఈ సారి ఖరీఫ్‌ ఆరం భంలో వర్షాలు బాగా పడటంతో వేరుశనగ పంట సాగు చేశారు. ఆ తర్వాత ఊడలు దిగే సమయం, పిందె పడే సమయాల్లో వర్షం పడలేదు. దీంతో కొన్నిప్రాంతాల్లో కాయలే కాయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పిందెలుపడినా సరిగాఊరలేదు. తద్వారా దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు ఒక బస్తానుంచి రెండు బస్తాల వరకే దిగుబడి వచ్చింది. అలాగే జూలై నెలాఖరు, ఆగస్టు మాసాల్లో సాగు చేసిన పంట కోత కోసిన తర్వాత ఇటీవల కురిసిన వరుస వర్షాలకు పొలాల్లోనే కుళ్లిపోయింది. అరకొరగా పండిన వేరుశనగ పంట నల్లగా మారి, బూజీ పట్టింది. వేరుశనగ కట్టె పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయింది.   హెక్టారు వేరుశనగ సాగు కోసం రూ.50వేల దాకా ఖర్చు చేశారు. ఈ లెక్కన ఈ ఏడాది దాదాపు రూ.2450 కోట్ల  దాకా రైతులు నష్టపోయినట్లు అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా అతివృష్టి, అనావృష్టితో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో పొలాల్లో తడిసి కుళ్లిపోయిన పంటలకు  నష్టపరిహారం జాబితాలోకి రాద ని వ్యవసాయ శాఖ అఽధికారులు పేర్కొంటున్నారు. పొలా ల్లోనే కుళ్లిపోయిన పంట కనిపిస్తుంటే నష్టపరిహారం ఎందుకు ఇవ్వరంటూ బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇనచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి పలువురు ఎమ్మెల్యే లు ఇదే విషయాన్ని తీసుకువెళ్లారు. కోత సమయంలో పొలాల్లో కుళ్లిపోయిన పంటకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. 


పత్తిపంటను తొలగిస్తున్న రైతు

తెల్లబంగారం.. నష్టాలమయం

కుళ్లిన పత్తి కాయలు..

వాటిలో నుంచి మోసులు 

తడిచిన పత్తికి తగ్గిన ధర

లక్ష ఎకరాల్లో పంట సాగు

రూ.150 కోట్ల

 పెట్టుబడి వర్షార్పణం

తాడిపత్రి, నవంబరు 28: జిల్లాలో ఖరీఫ్‌ సీజనలో లక్ష ఎకరాలకు పైగా పత్తి పంటను రైతులు సాగుచేశారు. మొత్తం 8 మండలాల్లో  60 వేలకు పైగా ఎకరాల్లో పత్తిని  వేశారు.  ఇప్పటివరకు పత్తి సాగు, సస్య రక్షణ చర్యల పేరుతో రూ.150 కోట్లు ఖర్చుచేశారు. ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేలు వ్యయం చేశారు. మొదట్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అర కొరగా వచ్చిన మొలకల స్థానంలో రెండవసారి విత్తనాలు విత్తారు. అన్ని కష్టాలు పడి సాగుచేసిన పత్తికి మొదటి క్రాప్‌ కింద అరకొర దిగుబడి వచ్చింది. అప్పట్లో ఆశించినంత స్థాయిలో ధర కూడా లేకపోవడంతో రైతులకు మొదటి క్రాప్‌ కింద రూ.40 కోట్లలోపే దిగుబడి వచ్చింది. దీంతో రెండో క్రాప్‌ కోసం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ధర కూడా గణనీయంగా పెరిగింది. క్వింటా పత్తి రూ.8500 వరకు పలుకుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు ముంచెత్తెతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తిచెట్లు ఏపుగా పెరిగినా కాయలు మాత్రం పూర్తిగా దెబ్బతింటున్నాయి. రోజుల తరబడి నీళ్లల్లో చెట్లు ఉండటంతో కాయలు రంగుమారుతున్నాయి. ఎక్కువరోజులు నీళ్లల్లో ఉండటంతో కాయలు కుళ్లిపోతూ కిందకు రాలిపోతున్నాయు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే పగిలిన పత్తి కాయల్లో మోసులు వస్తున్నాయి.  మోసులు వచ్చిన పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు విముఖత చూపుతున్నారు. కాయల నుంచి పగలాల్సిన పత్తి వర్షాల వల్ల  అరకొరగా పగులుతోంది. చేసేదేమిలేక వర్షాల కార ణంగా దెబ్బతిన్న పత్తిని పలువురు రైతులు ట్రాక్టర్ల ద్వారా తొలగిస్తున్నారు.  


 కూతురి వైద్యం కోసం చేసిన అప్పు తీరుతుందని ఆశించా  

చింతకుంటలోని హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతు న్న దివ్యాంగురాలైన నా కూతురు దీపిక వైద్యం కోసం హైదరాబాద్‌, అనంతపురం తదితర ప్రాంతాలు తిరిగి దాదాపు రూ.2.50 లక్షలు ఖర్చుచేశా. ఇతర అవసరాల కోసం మరింత అప్పుచేశా. నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తి బాగా పండితే అప్పులన్నీ తీర్చేయచ్చు అని ఆశపడ్డా. కానీ వరుసగా కురుస్తున్న వర్షాలతో పెట్టిన రూ.60వేలు పెట్టుబడి నీటిపాలైంది. గతంలో వేసిన పత్తి కూడా దెబ్బతిని పెట్టుబడి రావడమే గగనమైంది.  పత్తి బాగా పండి ఉంటే ఎకరాకు 6నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుత ధర క్వింటా రూ.8500 పలుకుతోంది. దిగుబడి రూపంలో నాలుగు ఎకరాలకు రూ.2.30 లక్షల వరకు వచ్చేది. ఈ వర్షాల వల్ల ఈ మొత్తం చేతికిరాకుం డా పోయింది.  ఇక మీదట కుటుంబ అవసరాల కోసం నేను నాభార్య కూలీలుగా మారి వ్యవసాయ పనులకు వెళ్లాల్సిందే. 

- రాజశేఖర్‌, రైతు, చింతకుంట, పుట్లూరు మండలం

తట్టుకోలేక ట్రాక్టర్‌తో దున్నేశా

కుళ్లిన కాయలు, తడిచిన పత్తి, కాయల్లో వచ్చిన మోసులను చూస్తూ తట్టుకోలేక ఏడు ఎకరాల్లో సాగు చేసిన పత్తిని ట్రాక్టర్‌తో దున్నేశా. ఇప్పటికే పెట్టుబడి రూపంలో దాదాపు లక్ష రూపాయలు ఖర్చుచేశా. వర్షాలు తగ్గుతాయి పంట పండుతుంది అని రోజులతరబడి ఎదురుచూసినా తెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలు కలచివేశాయి. ఇప్పటికే పంటకు ఆశించిన గులాబీపురుగు నివారణకు వేలకు వేలు ఖర్చుచేసి సస్యరక్షణ చర్యలు చేపట్టా. పురుగు ఉధృతి తగ్గిందని సంతోషంతో ఉన్న సమయంలో అల్పపీడనాల పేరుతో వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంట పూర్తిస్థాయిలో దెబ్బ తినింది. 

- మదనమోహన రెడ్డి, లక్షుంపల్లి, పెద్దవడుగూరు మండలం

కుళ్లిపోతున్న మిరపకాయలు

మిరప రైతు కుదేలు  

తేమ ఎక్కువై కుళ్లిపోయిన మిరప పంట

విడపనకల్లు : అధిక వర్షాల కారణం గా నల్లరేగడి నేలలు జోమెక్కడంతో మిర్చి పైరు , పంట కుళ్లిపోతోంది. తేమ కారణంగా మిర్చికి తెగుళ్లు సోకుతుం డటంతో దిక్కుతోచని రైతులు ఆందోళన  చెందుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు గత సంవత్సరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి పంట సాగు చేశారు. ప్రస్తుతం మిరప పంట కాయ దశలో ఉంది. ఇంకో రెండు నెలలకు కాయలు ఎర్రబడి పంటలు చేతికి వస్తాయి. ఇప్పటికే కొంత మంది రైతుల పొలాల్లో మిరప కాయలు ఎర్రగా మారాయి.  కానీ తుఫాను ప్రభావంతో కురుస్తున్న అధిక వర్షాలకు ఎర్రబారిన కాయలు కుళ్లిపోయి నల్లగా మారాయి. అధిక తేమకు పంటలు కుళ్లిపోతుండటంతో వాటిని కాపాడుకునేందుకు వివిధ రకాల మందులను పిచికారి చేస్తున్నారు. గడేకల్లు, పాల్తూరు, కరకముక్కల, హావళిగి, విడపనకల్లు, వేల్పుమడుగు, ఆర్‌ కొట్టాల, పెంచ లపాడు, తదితర గ్రామాల్లో వర్షాలు అధికంగా రావటంతో పొలాల్లో తేమ ఎక్కువ కావటం వల్ల మిర్చి పంటలకు విల్ట్‌ తెగులు సోకింది. ఇప్పటికే ఒక్కొక్క రైతు ఎకరాకు రూ. లక్షకుపైనే పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు. విడపనకల్లు మండలంలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో మిర్చి పంటలు పూర్తిగా కుళ్లిపోయి ఎండిపో యాయి. దీంతో రైతులకు పెట్టుబడుల నష్టం కోట్ల రూపా యల్లో జరిగింది. 


తేమఎక్కువ కావటంతో కుళ్లి పోయింది 

నేను రెండున్నర ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా. వర్షాలు అధికంగా రావటంతో తేమ ఎక్కువై పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. పంటను కాపాడుకోవటానికి వివి ధ రకాల మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోతోంది. సాళ్లకుసాళ్లు మిర్చి మొక్కలు నేలకు వాలి పోతున్నాయి.

 - బాల చంద్రారెడ్డి, రైతు, గడేకల్లు

తడిసిన మొక్కజొన్నలను ఆరబెడుతున్న రైతు

మొక్కజొన్న.. భారీ నష్టం

హిందూపురం: జిల్లాలోనే అత్యధికంగా మొక్కజొన్న పంట సాగు చేసే హిందూపురం వ్యవసాయ డివిజనలో పంటకు భారీ నష్టం జరిగింది. ఖరీఫ్‌ సీజనలో 17500 ఎకరాలకుపైగా  మొక్కజొన్న సాగు చేశారు. పంట కోతదశలో ఉండగా వా రం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పా టు కర్ణాటక నుంచి వచ్చిన వరద నీరు పంట పొలాలను  ముంచేసింది. హిందూపురం డివిజనలోనే ఇప్పటిదాకా రూ. 35 కోట్ల సాగు పెట్టుబడి పెట్టారు. చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం. పరిగి మండలాల్లో 2330 ఎకరాలు, రొద్దం 85 పెనుకొండలో 56 ఎకరాల్లో సోమందేపల్లిలో 324 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతినింది. ఎనిమిది మండలాల్లో కలిపి 2795 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తడిసిపోవడంతో కంకుల నుంచి మోసులొచ్చినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగు కోసం ఎకరాకు సగటున రూ. 20 వేల దాకా పెట్టుబడి పెట్టారు. మొత్తం 5.5 కోట్లపైగా నష్టపోయారు. పంట చేతికొస్తే రైతుకు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల దాక ఆదా యం వచ్చేంది. ఇలా 2795 ఎకరాలకు రూ. 12.5 కోట్లకుపైగా  నష్టం జరిగినట్లు అంచనా. కనీసం పశు గ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చేనులోనే మోసులొచ్చాయి

రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పంట కోత దశలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు చేనులోనే కోత దశకు వచ్చిన కంకుల నుంచి మోసులొచ్చాయి. పం ట పెట్టుబడి కోసం రూ. 40 వేల దాకా ఖర్చు చేశా. పం ట చేతికి వస్తే రూ. 90 వేల దాకా వచ్చేంది. పంటను కోత కోయాలంటే రూ. 15 ఖర్చు పెట్టాలి. ఎంత చేతి కొస్తుందో తెలియదు. ఈసారీ పంట చేతికొస్తుందని గత పంటకు చేసిన రుణాన్ని తీర్చుకుందామని భావించా. భారీ వర్షాలకు నా ఆశ ఆవిరైపోయింది. 

- ఆదినారాయణ, కోనాపురం, మొక్కజొన్న రైతు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.