పబ్లిక్‌గానే..!

ABN , First Publish Date - 2022-09-24T05:01:15+05:30 IST

నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. రోజూ టన్నులకొద్దీ బియ్యాన్ని పబ్లిక్‌గానే.. కర్ణాటకకు తరలిస్తున్నారు.

పబ్లిక్‌గానే..!
అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనం (ఫైల్‌)

అమడగూరు మీదుగా కర్ణాటకకు సబ్సిడీ బియ్యం రవాణా

రోజూ లారీల కొద్దీ యథేచ్ఛగా తరలింపు

మామూళ్ల మత్తులో అధికారులు?

 పుట్టపర్తి (ఆంధ్రజ్యోతి) : నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. రోజూ టన్నులకొద్దీ బియ్యాన్ని పబ్లిక్‌గానే.. కర్ణాటకకు తరలిస్తున్నారు. అమడగూరు మీదుగా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. బియ్యం దొంగలకు ఈ దారి రాచమార్గంగా మారింది. ఈ మార్గంలో నిఘా లేకపోవడం అక్రమార్కులకు కలిసొస్తోంది. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్ఛగా వాహనాల్లో రాత్రింబవళ్లు తరలిస్తున్నా.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నది స్థానికుల నుంచి వినిపిస్తున్న విమర్శ. కొందరు అధికారులు.. అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ అక్రమ రవాణా వెనుక బడా రాజకీయ నాయకులున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


రోజూ 200 టన్నులకుపైగా..


అమడగూరు మండలం కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో నిఘా కూడా పెద్దగా ఉండదు. దీంతో అక్రమార్కులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీ బియ్యానికి కర్ణాటకలో భారీగా డిమాండ్‌ ఉండడంతో దానిని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు అర్రులు చాస్తున్నారు. ధర్మవరం, కదిరి, నల్లమాడ, రెడ్డిపల్లి, ఓబుళదేవరచెరువు, పులివెందుల తదితర ప్రాంతాలనుంచి రోజూ 10 నుంచి 15 లారీల్లో 200 టన్నులకుపైగా సబ్సిడీ బియ్యం అమడగూరు మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నారంటే ఏస్థాయిలో అక్రమ రవాణా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.


బియ్యం.. మాయం..


బడా రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వారి హస్తం లేకుండా ఇంత పెద్దస్థాయిలో అక్రమ రవాణా సాధ్యం కాదని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారులు కూడా మామూళ్లు తీసుకుని, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారం రోజుల క్రితం ధర్మవరం నుంచి అమడగూరు మీదుగా కర్ణాటకకు సబ్సిడీ బియ్యం తరలిస్తున్న వ్యాన.. చెర్లోపల్లి సమీపంలోని నల్లగుట్ట వద్ద బురదలో ఇరుక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వ్యానను తనిఖీ చేయగా, అందులో సబ్సిడీ బియ్యం పట్టుబడింది. ఆ సమయంలో వ్యాన నిండా బియ్యం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గోడౌనకు తరలించే సరికి సగానికి పైగా బియ్యం తగ్గిపోవడం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికారులే దగ్గరుండి వ్యానలో ఉన్న బియ్యం మరో వాహనంలో తరలించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోజూ పదుల సంఖ్యలో పబ్లిక్‌గానే వెళ్తున్నా విజిలెన్స, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కూతవేటు దూరమే..


సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాకు అమడగూరు మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఈ మండలం కర్ణాటకకు కూతవేటు దూరంలో ఉండడమే. ధర్మవరం, నల్లమాడ, రెడ్డిపల్లి, కొండకమర్ల, సల్లావాండ్లపల్లి, గౌరాపురం, మహమ్మదాబాద్‌, అమడగూరు మీదుగా కర్ణాటకకు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. మామూళ్లు దండుకుని, కొందరు అధికారులు అన్నివిధాలా సహకరిస్తున్నారనీ, ప్రభుత్వ కార్యాలయం ముందు నుంచే కర్ణాటక సరిహద్దు వరకు వాహనాలను పంపుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.


రూ.కోట్లు దండుకుంటున్నారు..


సబ్సిడీ బియ్యం అక్రమ రవాణా రోజురోజుకీ ఊపందుకుంటోంది. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల ఆశీస్సులతో అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయల చందంగా సాగుతోంది. దీంతో అక్రమ రవాణా వ్యాపారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ధర్మవరం, నల్లమాడ, రెడ్డిపల్లి, కొండకమర్ల, కదిరి, ఓబుళదేవరచెరువు, అమడగూరు ప్రాంతాల్లో వందల సంఖ్యలో బియ్యం వ్యాపారులున్నారంటే ఏస్థాయిలో అక్రమ రవాణా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారం ప్రారంభించక ముందు ఆర్థికంగా ఏమీలేనివారు నేడు రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టడం గమనార్హం. రెవెన్యూ, విజిలెన్స దాడులు నామమాత్రంగా ఉండడంతో సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాకు అడ్డేలేకుండా పోతోంది. ఇప్పటికైనా దీనికి అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.


  సన్న బియ్యంగా మార్చి..


సబ్సిడీ బియ్యాన్ని కొందరు నేరుగా కర్ణాటకకు తరలిస్తున్నారు. మరికొందరు వాటిని రీసైక్లింగ్‌ చేసి, సన్నబియ్యంగా మార్చి, రవాణా చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవలిగా రీసైక్లింగ్‌ ఊపందుకుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


ఎస్కార్ట్‌ విధానంలో..


అక్రమంగా కర్ణాటకకు రోజూ వ్యాన్లు, మినీ వ్యాన్లు, లారీలు, ఆటోల్లో బియ్యం అక్రమంగా తరలిస్తుంటారు. బియ్యం వాహనం వెళ్లే ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనాల్లో వెళ్లి, పరిసర ప్రాంతాలు గమనించి, తరువాత వాహనదారులకు సమాచారం అందిస్తారు. రెవెన్యూ, విజిలెన్స అధికారులుంటే వారి చేతులు తడిపి, తరువాత అక్రమ రేషన వాహనం ముందుకెళ్తుందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వాహనంముందు ఒకరు, వెనుకవైపు నుంచి మరొకరు ద్విచక్రవాహనాల్లో ఎస్కార్ట్‌ విధానంలో మరికొంత మంది కూడా వెళ్తుంటారు. 


దొరికింది చాలా.. చూపింది కొంతే..?


15 రోజుల క్రితం మండలంలోని చెర్లోపల్లి సమీపాన బురదలో ఇరుక్కున్న వ్యానలో ఉన్న బియ్యం కన్నా.. తక్కువగా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాత్రికి రాత్రే అధికారులు ప్రకటించని బియ్యం మరో వాహనంలో సరిహద్దులు దాటిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వ్యానలో బియ్యం తగ్గడానికి ప్రధాన కారణం అధికారులకు చేయి తడపడమేనన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో ముగిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.



Updated Date - 2022-09-24T05:01:15+05:30 IST