మాస్టర్‌ప్లాన నిబంధనలు గాలికి

ABN , First Publish Date - 2021-11-25T06:21:40+05:30 IST

నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక (టౌన ప్లానింగ్‌)లో అంతా ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

మాస్టర్‌ప్లాన నిబంధనలు గాలికి
సూర్యానగర్‌లో ఓ భారీ భవంతికి సెల్ల్లార్‌

టౌనప్లానింగ్‌లో.. ఇష్టారాజ్యం..!

స్టిల్ట్‌ అప్రూవల్‌తో సెల్లార్‌ నిర్మాణాలు

వాహనాల పార్కింగ్‌కు మంగళం

ఆమ్యామ్యాల మత్తులో అధికారులు

రాజకీయ సిఫార్సులంటూ బుకాయింపు

నైట్‌ సిట్టింగ్‌కు వస్తే అప్రూవల్‌ ఒకే

ఓ ప్లానింగ్‌ సెక్రటరీ బంపరాఫర్‌

అనంతపురం కార్పొరేషన, నవంబరు24: నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక (టౌన ప్లానింగ్‌)లో అంతా ఇష్టారాజ్యంగా మారిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని నగర ప్రజలు వాపోతున్నారు. గాలి, వెలుతురు కూడా సరిగా అందకుండా పక్కపక్కనే నిర్మాణాలు. ఎక్కడచూసినా బహుళ అంతస్తుల భవనాలు. 90 శాతం కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగానే. ఇదీ అనంతపురం నగరంలో సాగుతున్న తంతు. మున్సిపాలిటీ స్థాయి నుంచి అనంతపురం నగరపాలక సంస్థగా మారే క్రమంలోనే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు వెలుస్తూ వచ్చాయి. చివరికి మురుగు కాలువలను సైతం వదలకుండా నిర్మిస్తూ వచ్చారంటే టౌనప్లానింగ్‌ అధికారుల వత్తాసు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. చివరికి సచివాలయాల్లో పనిచేసే ప్లానింగ్‌ సెక్రటరీలను కూడా ఆ అవినీతి మత్తులో దింపారంటే అధికారులు ఎంత ఘటికులో అర్థమవుతుంది. కదిరి పట్టణంలో తాజాగా ఓ భవనం కూలింది. మూడేళ్ల క్రితం నగరంలోని మారుతినగర్‌లో ఓ భవనం నిర్మాణ దశలోనే కూలింది. మాస్టర్‌ప్లాన నిబంధనలను ఏనాడో గాలికొదిలేశారు. మరో దౌర్భాగ్యమేంటంటే నగరంలో ఏ భవనానికీ పార్కింగ్‌ కూడా లేకుండా నిర్మించడం. ఇక కాలువల్లో మురుగునీరు వెళ్లక, నడిచివెళ్లే దారి కూడా దుస్థితిలో వందల సంఖ్యలో సందులున్నాయంటే ఆ పాపమంతా టౌనప్లానింగ్‌ అధికారులదే.


నివాసాల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు

నివాస ప్రాంతాల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లతో కూడిన భవనాలు నిర్మించరాదు. నిబంధలనకు పూర్తిగా విరుద్ధం. నగరంలో అది సాధారణ విషయంగా మారిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు మినహా అన్ని కాలనీల్లోని ప్రాంతాలు రెసిడెన్షియల్‌ ఏరియాలోకే వస్తాయి. నడిబొడ్డున ఉన్న కమలానగర్‌లోని లోపలి సందుల్లో నివాస పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రతి భవనమూ కమర్షియల్‌గానే నిర్మిస్తున్నారు. సాయినగర్‌లోనూ అదే దుస్థితి. ఇక్కడ ఓ నాలుగు భవనాలు నిబంధనలకు విరుద్ధంగా కడుతుంటే వాటికి ఓ విప్‌ పేరు, హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పారట. నగరంలోని రెండోరోడ్డులో పాత భవంతిని కూల్చి ఆ స్థానంలో ఓ భారీ భవంతి నిర్మిస్తున్నారు. అందులో కింది భాగంలో మొ త్తం దుకాణాల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఆ బిల్డింగ్‌కు సమీపంలోని మరో భవంతి కింది భాగంలోనూ అదే  పరిస్థితి నెలకొంది. ఈ రెండింటి నుంచి టౌనప్లానింగ్‌ అధికారులకు భారీగానే ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. ఇలా నగరంలోని అన్ని నివాస ప్రాంతాల్లోనూ కమర్షియల్‌గా కట్టడాలు నిర్మిస్తున్నారు. సెట్‌బ్యాక్స్‌ల నుంచి ఎలాంటి నిబంధనలు లేవంటూ అధికారులు ఒక్కో భవనానికి రూ.లక్షల్లో పుచ్చుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో ఒక్కో భవనానికి 10 శాతం అనుమతి ఉందని ఓ అధికారి సెలవిస్తారు... మొత్తం అలా కడుతుంటే మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇలా నగరపాలక సంస్థ టౌనప్లానింగ్‌లో అవినీతి జలగల అవతారమెత్తారు.


అనుమతులు రాకముందే నిర్మాణాలు

నగరంలోని ఆదర్శనగర్‌లో ఓ వైసీపీ డివిజన స్థాయి నాయకుడు అనుమతి లేకుండానే ఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఒక అంతస్తు నిర్మించేశాడు. ఆ స్థలం వివాదంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు  అందజేయకుండానే నిర్మిస్తున్నా.. అధికారులు మాత్రం అలా నిర్మించేసుకోవచ్చని చెప్పుకొస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, ఆమ్యామ్యాలతో అధికారులు ఊ కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక అదనపు అంతస్తుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాయినగర్‌లోని ప్రధాన రోడ్డులో పాత భవంతి స్థానంలో అదనపు అంతస్తుల నిర్మాణం విషయంలో అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. రామ్‌నగర్‌లో బ్రిడ్జి పక్కగా వెలిసిన భారీ భవనంలో ఎలాంటి సెట్‌బ్యాక్స్‌ లేకపోవడంతో అదనపు అంతస్తును నిర్మించారు. ఆదర్శనగర్‌లోని ఓ భవంతికి 14 శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ చెల్లించకుండా ఎల్‌టీపీల సంఘం నాయకుడు చక్రం తిప్పి అధికారులకు రూ.లక్షల్లో కట్టబెట్టారట. ఇవన్నీ ముడుపుల బాగోతాలే. లంచావతారం ఎత్తిన అధికారులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే... అధికార పార్టీ రాజకీయ నాయకుల సిఫార్సులంటూ బుకాయిస్తారట.


స్టిల్ట్‌ అప్రూవల్‌తో సెల్లార్‌ నిర్మాణాలు...

నగరంలో వెలిసే భారీ భవనాల్లో 60 శాతం భవనాలకు సెల్లార్‌లు ఉంటున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్మించేస్తున్నారు. స్టిల్ట్‌ అంటే రోడ్డుకు సమాంతరంగా భవన నిర్మాణం జరగాలి. అందుకు విరుద్ధంగా కిందిభాగంలో లోతుగా తవ్వేసి సెల్లార్‌లు నిర్మిస్తున్నారు. స్టిల్ట్‌కు అనుమతి తీసుకుని యథేచ్ఛగా సెల్లార్‌లు నిర్మిస్తున్నారు. కమలానగర్‌లో తాజాగా రెండు భవనాల సెల్లార్లు నిర్మించారు. వాస్తవానికి 750-1000 చదరపు అడుగులు అంటే 18.50 సెంట్లలో మాత్రమే స్టిల్ట్‌తోపాటు ఒక సెల్లార్‌ నిర్మించాలి. 5 సెంట్లున్నా సెల్లార్లు నిర్మిస్తున్నారు. 25 సెంట్లలో మాత్రమే స్టిల్ట్‌తోపాటు రెండు సెల్లార్ల అనుమతి. ఇవేవీ లేకున్నా తక్కువ సెంట్లలోనే సెల్లార్లు నిర్మించి కమర్షియల్‌గా వాడేస్తున్నారు. రామ్‌నగర్‌లో 80 అడుగుల రోడ్డులో స్టిల్ట్‌కు అనుమతి తీసుకుని ఏకంగా ఆరడగులపైనే లోతు తవ్వేసి సెల్లార్‌ కోసం యత్నిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. సూర్యానగర్‌ రోడ్డులో ఏకంగా వంక సమీపంలో ఓ భవంతి... అందులోనూ సెల్లార్‌ నిర్మిస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా భారీ భవనాలకు సంబంధించి సెల్లార్లు నిర్మిస్తున్నారు. అధికారులు.. బిల్డర్లతో కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతున్నారు. 


నైట్‌సిట్టింగ్‌కు వస్తే అప్రూవల్‌ ఓకే...

సచివాలయ విధులకు గైర్హాజరైతేనో... అధికార పార్టీ నాయకులు చెప్పింది వినకపోతేనో వారిపై ససెన్షన వేటు వేస్తున్నారు. అవినీతిలో మునిగిపోయిన సిబ్బందిపై మాత్రం అవ్యాజ్యమైన ప్రేమ చూపుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. నగరంలోని  సచివాలయాల్లో పనిచేసే ప్లానింగ్‌ సెక్రటరీల్లో 60 శాతం వరకు అవినీతికి అలవాటుపడ్డారు. ఓ ప్లానింగ్‌ సెక్రటరీ వద్దకు ఏదైనా బిల్డింగ్‌ ఫైల్‌ అప్రూవల్‌కు వస్తే మొదట నైట్‌ సిట్టింగ్‌ (రాత్రి మందు పార్టీ)కి వస్తే అప్రూవల్‌ ఒకే చేస్తానని డీల్‌ పెడతాడట. ఆ పార్టీలోనే ఎంత ఇచ్చుకోవాలో చెప్పేస్తాడట. రెండు నెలల క్రితం ఓ 60 ఏళ్ల వ్యక్తి బిల్డింగ్‌కు దరఖాస్తు చేసుకోగా... నైట్‌ సిట్టింగ్‌కు వస్తారా అంటూ ఫోన చేసినట్లు సమాచారం. ఇందుకు ఆ పెద్దాయన మరో ఇంటి యజమానితో తనతో నైట్‌ సిట్టింగ్‌ అంటాడేంటి అని అడిగితే... అవతలి వ్యక్తి అసలు విషయం చెప్పడంతో పెద్దాయన నిర్ఘాంతపోయారట. ఆ సచివాలయ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ షెడ్డు విషయంలో ఈ సెక్రటరీ ఆధ్వర్యంలో రూ.4.50 లక్షలు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ బిల్డర్‌ను ఏకంగా వంద సిమెంట్‌ ప్యాకెట్లు ఇచ్చేయమని డిమాండ్‌ చేశాడట సంబంధిత సెక్రటరీ. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడం గమనార్హం.





Updated Date - 2021-11-25T06:21:40+05:30 IST