అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2021-02-24T04:56:31+05:30 IST

తాండూరు నుంచి నారా యణపూర్‌ వరకు రైలు పట్టాల పక్కన ఉన్న రోడ్డు నిర్మాణం

అసంపూర్తిగా రోడ్డు నిర్మాణం
అసంపూర్తిగా ఉన్న నారాయణపూర్‌ రోడ్డు

  • అనుమతులు నిరాకరించిన రైల్వే అధికారులు 
  • రూ.9కోట్లు వెచ్చించి బ్రిడ్జి నిర్మించి వృథా
  • రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా అందని పర్మిషన్‌ 
  • పూర్తికాని నారాయణపూర్‌-తాండూరు రోడ్డు


తాండూరు రూరల్‌ : తాండూరు నుంచి నారా యణపూర్‌ వరకు రైలు పట్టాల పక్కన ఉన్న రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలి పోయింది. రోడ్డు పూర్తి కాకపోవడంతో ఆ రోడ్డుపై ప్రయాణించే నారాయణ పూర్‌, గోనూరు, వీర్‌శెట్టిపల్లి, మంతట్టి, కాశీంపూర్‌, రెడ్డి ఘనాపూర్‌ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. 2016లో తాం డూరు నుంచి నారాయణ పూర్‌ వరకు రైలుపట్టాల పక్కనుంచి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ.9కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో నారాయణపూర్‌ కాగ్నా నదిపై 460 మీటర్ల బ్రిడ్జీ, 6కిలోమీటర్ల బీటీ రోడ్డును పూర్తి చేయాల్సి ఉంది. అయితే శ్రీమన్నారాయణ కన్‌స్ట్రక్షన్స్‌ క ంపెనీ వారు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పూర్తి చేశారు. పీర్‌ పకీర్‌సాబ్‌ దర్గా నుంచి పాత తాండూరు వరకు మరో నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో బీటీ రోడ్డు పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న నారాయణపూర్‌ గ్రామస్థులు ఇటీవల  రైల్వే నిలయంలో ఏజీఎం, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కానీ రైల్వే అధికారులు రైలు పట్టాల పక్క నుంచి బీటీ రోడ్డు వేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. రోడ్డు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆయా గ్రామాల నుంచి తాండూరుకు రావాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రూ.9కోట్లు వెచ్చించి బ్రిడ్జి నిర్మించినా మరో సగం రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు ప్రయాణికుల కష్టాలను గుర్తించి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


అనుమతులు ఇవ్వకుంటే ఆందోళన చేపడతాం..

పాత తాండూరు రైల్వే గేటు నుంచి పీర్‌పకీర్‌సాబ్‌ దర్గా వరకు బీటీ రోడ్డు వేసేందుకు రైల్వే అధి కారులు అనుమతులు ఇవ్వకుంటే గ్రామస్థులతో కలిసి ఆందోళన చేప డతాం. అనుమతుల కోసం ఇప్పటివరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసి రోడ్డు ఏర్పాటు చేయాలని విన్నవించాం. అయినప్పటికీ రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో బ్రిడ్జీ నిర్మించి కూడా వృథా అవుతోంది. అధికారులు స్పందించి అనుమలు ఇవ్వాలి. 

-  చంద్రప్ప, సర్పంచ్‌, నారాయణపూర్‌




Updated Date - 2021-02-24T04:56:31+05:30 IST