గుండె గు‘బిల్లు’!

ABN , First Publish Date - 2021-05-18T04:40:11+05:30 IST

వేసవి వేళ ఉష్ణోగ్రతల ప్రభావం.. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. పదిహేను రోజులుగా వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంది. కరోనా కేసుల పెరుగుదలతో అత్యవసర పరిస్థితులు మినహాయించి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా గతనెల నుంచి ఇప్పటివరకూ(శనివారం) గృహ వినియోగం 25.74 మినియన్ల యూనిట్ల వాడకం పెరిగింది.

గుండె గు‘బిల్లు’!

 వేసవిలో పెరిగిన విద్యుత్‌ వాడకం

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఈదుపురం గ్రామానికి చెందిన పాలేపు మహాలక్ష్మి... ఇంట్లో రెండు లైట్లు, టీవీ, ప్యాన్‌ వినియోగిస్తున్నారు.. ప్రతి నెల రూ. 150 నుంచి రూ.200 వరకు విద్యుత్‌ బిల్లు చెల్లిస్తుంది. ప్రస్తుతం రీడింగ్‌ తీయగా బిల్లు రూ. 634 వచ్చింది. ప్రస్తుతం కర్ఫ్యూతో ఎటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంత మొత్తంలో బిల్లు ఎలా చెల్లించగలమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా వేసవి వేళ ఉష్ణోగ్రతల ప్రభావం.. కర్ఫ్యూ ఆంక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. పదిహేను రోజులుగా వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంది. కరోనా కేసుల పెరుగుదలతో అత్యవసర పరిస్థితులు మినహాయించి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు,  ఏసీలు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా గతనెల నుంచి ఇప్పటివరకూ(శనివారం) గృహ వినియోగం 25.74 మినియన్ల యూనిట్ల వాడకం పెరిగింది. ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమలు మూత పడడంతో గృహ వినియోగం మరింత పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికలోడ్‌ కారణంగా సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అదనపు పరివర్తకాలు, ఉపకేంద్రాల ఉన్నతీకరణ పనులు చేపట్టారు. విద్యుత్‌ లైన్ల మరమ్మతులపైనా దృష్టి పెట్టారు. 


గత ఏడాది కంటే అధికం : 

జిల్లాలో విభాగాల వారీగా 7,51,712 గృహ విద్యుత్‌ కనెక్షన్లు,  27,145 వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు సంబంధించి 2,805, వాణిజ్యం 67,414, ఇతర రంగాలకు చెందిన కనెక్షన్లు 19,770 మొత్తం 8,68,846 ఉన్నాయి. వీటితో పాటు  పెద్ద పరిశ్రమలకు సంబంధించి 439 కనెక్షను ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో లాక్‌డౌన్‌ వల్ల వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు మూసేయడంతో వాటి విద్యుత్‌ వాడకం తగ్గింది. గృహాల్లో వినియోగం మాత్రం పెరిగింది. ప్రస్తుతం కొవిడ్‌ రెండో దశ ప్రభావం అధికంగా ఉన్నా, ఆర్థిక లోటును దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఆంక్షల వైపే మొగ్గు చూపుతున్నాయి. తద్వారా పరిశ్రమలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 19..73 మిలియన్‌ యూనిట్ల వినియోగం అధికమైంది. ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్నా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంది. ఇళ్లలోనూ విద్యుత్‌ ఉపకరణాల వాడకం అధికమైంది.  బిల్లులు కూడా అదేస్థాయిలో పెరగడంతో.. వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

- ఏసీలను 26 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఇన్వర్టర్‌ టెక్నాలజీ, 5 స్టార్‌ ఏసీలు తీసుకుంటే అధిక విద్యుత్‌ వినియోగం ఉండదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఏసీ వేసి, గది చల్లబడిన తర్వాత ఆపేయడం మంచిది. 

- గదిలో పైకప్పునకు సీలింగ్‌ వేసుకోవడం, గది పైన మరో ప్లోర్‌ లేకపోతే కూల్‌ సెమ్‌ కోటింగ్‌ వేసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది.

- కూలర్లు ఇంట్లో కాకుండా కిటికీ దగ్గర పెట్టాలి. పాతవే వాడకుండా గడ్డిని మార్చి వాటర్‌ సంప్స్‌ సరిగా పనిచేస్తున్నాయో.. లేదో చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  


 నిరంతర విద్యుత్‌ సరఫరా.. :

ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా అధిక లోడు కారణంగా సరఫరాలో సమస్య ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించనున్నాం. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా స్థానిక సచివాలయ జూనియర్‌ లైన్‌మెన్‌కు సమాచారం అందిస్తే తక్షణం పరిష్కరిస్తారు. 

- ఎస్‌.మసిలమణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, శ్రీకాకుళం.

Updated Date - 2021-05-18T04:40:11+05:30 IST