పెరిగిన భూముల విలువ

ABN , First Publish Date - 2021-07-21T05:25:21+05:30 IST

రేపటి నుంచి భూముల విలువ పెంచుతూ

పెరిగిన భూముల విలువ

  • రేపటి నుంచి అమల్లోకి..

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రేపటి నుంచి భూముల విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూముల విలువ గరిష్ఠంగా 50శాతానికి పెంచుతూ నిర్ణయం తీసు కుంది. అంతేకాక రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ విలువ ఎకరానికి రూ.75వేలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో ఓపెన్‌ ప్లాట్ల కనిష్ఠ విలువ చదరపు గజానికి రూ.200గా నిర్ణయించారు. గజం రూ.151 నుంచి 1000గజాలు ఉన్న ప్లాట్ల ధరలు  1.5రెట్లు అంటే 50శాతం పెంచారు. గజం రూ.1001 నుంచి రూ.5వేల వరకు ఉన్న ప్రాంతాల్లో 1.3రెట్లు లేదా రూ.1500 పెంచాలని నిర్ణయించారు. ఈ రెండిం టిలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలుచేస్తారు. అలాగే గజం రూ. 5వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 1.2 రెట్లు లేదా 6,500గా అమలు చేయాలని  నిర్ణయిం చారు. అపార్ట్‌మెంట్లకు సంబంధించి అతితక్కువ విలువ ఒక చదరపు అడుగుకు రూ.800 ఉండగా దీన్ని రూ.1000 చేశారు. కొత్తగా పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 


హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో...

హెచ్‌ఎండీఏ పరిధిలో వ్యవసాయ భూముల ధరలు ఇలా పెరగనున్నాయి. ప్రస్తుతం ఎకరా రూ.3.35 లక్షల ఉన్న భూమి విలువ ఇక మీదట రూ.5లక్షలు కానుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లా అంతటా కూడా ఈ ధరలు వర్తిస్థాయి. అలాగే  ప్రస్తుతం రూ.3.35లక్షల నుంచి రూ.10లక్షల వరకు విలువ ఉన్న భూముల ధరలు 1.5రెట్లు అధికం కానున్నాయి. అలాగే రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉన్న భూమి విలువ ఇక మీదట 1.4 రెట్లు లేదా రూ.15లక్షల వరకు పెరగనుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని అమలుచేస్తారు. అలాగే  ఎకరా రూ.కోటిపైగా ఉన్న ప్రాంతాల్లో భూముల విలు వను 1.3 రెట్లు లేదా రూ.1.40 కోట్లుగా నిర్ణయించారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలు చేస్తారు. ఇక ప్లాట్ల విషయానికి వస్తే గతంలో గజం రూ.1000 ఉన్నచోట.. ఇపుడు రూ.1500గా నిర్ణయిం చారు. అలాగే గజం రూ.1001- 10,000 ధర ఉన్న  ప్రాంతాల్లో ధరను 1.5 రెట్లు అంటే 50శాతం పెంచారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని అమలు చేస్తారు. ఇక గజం రూ. 10,000 నుంచి రూ.20,000 ఉన్న  ప్రాంతాల్లో 1.4రెట్లు లేదా రూ.15వేలు అదనంగా పెంచుతారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ధర ఉంటే దాన్ని అమలుచేస్తారు. గజం రూ.20వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 1.3 రెట్లు లేదా రూ.28వేలు అదనంగా పెంచాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా దాదాపు ఇవే ధరలు అమలు కానున్నాయి. 


మున్సిపాలిటీల్లో..

అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో గజం ప్రస్తుతం కనిష్ఠంగా రూ. 350 విలువ ఉండగా, దీన్ని ఇప్పుడు రూ.500 చేశారు. అలాగే రూ.351 నుంచి రూ. 2వేల వరకు ధర ఉన్న ప్రాంతాల్లో భూమి విలువ 1.5 రెట్లు అధికం చేశారు. అలాగే 2,000- 10,000 ధర ఉన్న ప్రాంతాల్లో ధరను 1.4 రెట్లు లేదా రూ.3వేలు పెంచారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే దాన్ని అమలు చేస్తారు. ఇక గజం రూ.10వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 1.3రెట్లు లేదా రూ.4వేలు అదనంగా పెంచారు. అంటే ఈ ప్రాంతాల్లో కనిష్ఠం రూ. 14 వేలుగా నిర్ణయించారు. అంటే ఒకేసారి రూ. 4వేలు పెరగనుంది. 

Updated Date - 2021-07-21T05:25:21+05:30 IST