మేరే పీచే జగన్ హై.. అంతా నా ఇష్టం.. ఏపీలో ‘దువ్వాడ’ హాట్ టాపిక్!

ABN , First Publish Date - 2021-02-16T20:02:32+05:30 IST

సిక్కోలు జిల్లాలో ఓ నాయకుడి ఓవర్‌యాక్షన్‌ అధికార వైసీపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తోందా? ...

మేరే పీచే జగన్ హై.. అంతా నా ఇష్టం.. ఏపీలో ‘దువ్వాడ’ హాట్ టాపిక్!

సిక్కోలు జిల్లాలో ఓ నాయకుడి ఓవర్‌యాక్షన్‌ అధికార వైసీపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తోందా? చీటికి మాటికి ఆయన చేస్తున్న హంగామా పార్టీ పెద్దలకు తలనొప్పులు తెచ్చిపెడుతోందా? జెండా ఎజెండా పక్కనపెట్టి సొంత ఇమేజ్‌ కోసం ప్రాకులాడుతున్న ఆ నాయకుడు ఎవరు? పార్టీ సీనియర్ల సూచనలు ప్రక్కన పెట్టి వివాదాలకు కేరాఫ్‌గా ఆయన ఎందుకు మారుతున్నారు? నిమ్మాడ పర్యటనకు బయల్దేరిన ఎంపీ విజయసాయి మధ్యలోనే ఎందుకు వెనక్కి వెళ్లారు? ఆ నేత వ్యవహారంపై శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అనేది ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


మేరా పీచే జగన్ హై!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌ ఓవర్‌యాక్షన్‌ ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతుందట. ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి లాభం కంటే నష్టం చేకూర్చేవిధంగా ఉందని వారు ఆందోళన చెందుతున్నారట. చీటికీ మాటికీ వివాదాలు...తన రూటే సపరేటు అన్నట్టుగా ప్రవర్తించడం జిల్లా పెద్దలకు సైతం రుచించటం లేదని ఆ పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు సీఎం జగన్ దగ్గర పలుకుబడి ఉందని..తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లుగా చెప్పుకొస్తారట. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు యావత్ రాష్ట్రంలో దుమారం రేపాయి.


ఎందుకు వెనక్కి వెళ్లారు..!?

స్థానిక సంస్ధల ఎన్నికల ముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఆయన చేసిన హల్‌చల్‌ టీవీల్లో కళ్లకు కట్టినట్టు కనిపించింది. బ్యాట్లు, ఇనుప రాడ్లు చేతపట్టుకుని శివాలెత్తిపోవడం..వేసేద్దాం..నరికేద్దాం అంటూ అనుచరులను ఉసిగొల్పిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది. దువ్వాడ దూకుడు వైఖరి పార్టీ పరువును మరింత దిగజార్చిందని సిక్కోలు వైకాపా నేతలు మదనపడుతున్నారట. అయితే ఎంపీ విజయసాయిని నిమ్మాడలో పర్యటించాలని దువ్వాడ శ్రీనివాస్‌ ఆహ్వానించగా.. దానికి జిల్లా నేతలే అడ్డుపుల్ల వేశారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. దాంతో నిమ్మాడ సమీపం వరకూ వెళ్లిన విజయసాయి రెడ్డి వెనక్కి తిరిగి వచ్చేయటానికి అధిష్టాన పెద్దల ఆదేశాలే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


భవిష్యత్ భయం..!

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని, కృపారాణి వంటి సీనియర్లు అధికార వైసీపీలో కొనసాగుతున్నారు. పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎక్కడా లేని అలజడి దువ్వాడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఒక్క టెక్కలిలోనే కనిపించడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు విషయంలో కక్ష సాధింపులకు దిగుతున్న దువ్వాడ తీరుతో భవిష్యత్‌లో పార్టీ మరింత పతనం కావటం ఖాయమని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.


ఏం జరుగుతుందో..!?

సొంత అజెండాతో ముందుకెళ్లి పార్టీ పరువు బజారుకీడ్చుతున్నారంటూ దువ్వాడపై వైసీపీ పెద్దలు కూడా నిప్పులు చెరుగుతున్నారట. దువ్వాడ వ్యవహారంతో స్థానిక అధికారులు కూడా సతమతమవుతున్నట్లు సమాచారం. ప్రోటోకాల్ లేని దువ్వాడను అధికారిక కార్యక్రమాలకు పిలవకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారట. మొత్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న దువ్వాడ శ్రీనివాస్‌ విషయంలో వైసీపీ అధిష్టాన పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.



Updated Date - 2021-02-16T20:02:32+05:30 IST