సొంత భవన నిర్మాణం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2020-11-30T05:36:29+05:30 IST

నర్సాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అరకొర సౌకర్యాల మధ్య నీటిపారుదల శాఖకు చెందిన అతిథిగృహంలోనే కొనసాగుతోంది.

సొంత భవన నిర్మాణం పూర్తయ్యేనా?
అతిథిగృహంలో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయం

అరకొర సౌకర్యాలతో అతిథిగృహంలోనే నర్సాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం 


నర్సాపూర్‌, నవంబరు 29: నర్సాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో అరకొర సౌకర్యాల మధ్య నీటిపారుదల శాఖకు చెందిన అతిథిగృహంలోనే కొనసాగుతోంది. గతంలో పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో ఉన్న పాత తహసీల్దార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సునీతారెడ్డి నూతన  కార్యాలయ నిర్మాణం కోసం రూ.60లక్షలు మంజూరు చేయించారు. 2013లో శంకుస్థాపన కూడా చేశారు. పాత భవనాన్ని పూర్తిగా తొలగించి అదే స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టారు. కానీ పునాదులు మాత్రమే తీసి వదిలేశారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో అంతకుముందు కేటాయించిన నిధులు ప్రత్యేక రాష్ట్రంలో కేటాయించకపోవడంతో నిర్మాణం మందుకు సాగలేదు. దీంతో కొన్ని రోజులు అద్దె భవనంలో కొనసాగిన కార్యాలయం ఆ తర్వాత నీటిపారుదల శాఖ అతిథిగృహంలోకి మారింది. పాత తహసీల్దార్‌ కార్యాలయ స్థలంలో కొన్ని రోజుల క్రితమే రూ.నాలుగు కోట్లతో ఆధునిక మార్కెట్‌ను నిర్మించడానికి నిర్ణయించారు. దీంతో కార్యాలయ నిర్మాణానికి సొంత స్థలం లేకుండా పోయింది. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న స్థలంలోనే అప్పట్లో తహసీల్దార్‌ కార్యాలయాన్ని నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించినా ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఊసే లేదు.


అరకొర సౌకర్యాలతోనే కార్యాలయం


అతిథిగృహంలో అరకొర సౌకర్యాలతోనే సంవత్సరాలుగా కార్యాలయం కొనసాగుతున్నా సొంత భవన నిర్మాణం కోసం ప్రయత్నాలు చేయడం లేదు. అతిథి గృహంలో సరిపడ గదులు కూడా లేవు. అధికారులు, ప్రజలు కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు. అయినా కూడా పట్టించుకునేవారు లేరు. ఈ కార్యాలయం ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. 


Updated Date - 2020-11-30T05:36:29+05:30 IST