‘మన బడి’కి నిధులేవి?

ABN , First Publish Date - 2022-06-25T05:35:56+05:30 IST

మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు నడుం బిగించగా ఇంకా నిధుల రాకపోవడంతో ప్రారంభం కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠశాలల్లో గుర్తించిన పనులను పూర్తి చేయాలని సంకల్పించినప్పటికీ నేటికీ పనులు మొదలు కాలేదు.

‘మన బడి’కి నిధులేవి?
కోహెడ ప్రాథమిక పాఠశాలలో తలుపులు లేని తరగతి గదులు

మొదటి విడతలో కోహెడ మండలంలో 17 పాఠశాలల ఎంపిక

ఇంకా ప్రారంభం కాని పనులు


కోహెడ, జూన్‌ 24 : మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు నడుం బిగించగా ఇంకా నిధుల రాకపోవడంతో ప్రారంభం కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠశాలల్లో గుర్తించిన పనులను పూర్తి చేయాలని సంకల్పించినప్పటికీ నేటికీ పనులు మొదలు కాలేదు. 

12 రకాల అభివృద్ధి పనులు

కోహెడ మండలంలో మొత్తంగా 58 పాఠశాలలు ఉండగా మన ఊరు - మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో 17 పాఠశాలలు ఎంపికయ్యాయి. డిజిటల్‌ విద్య, టాయిలెట్లు వసతి, విద్యుదీకరణ, విద్యార్థులకు ఫర్నిచర్‌, కొత్త తరగతి గదులు, సురక్షితమైన తాగునీటి సరఫరా, ప్రహరీ గొడలు నిర్మాణం, మెరుగైన వంటశాలలు, డైనింగ్‌ హాళ్లతో పాటు 12 రకాల అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉంది. అవకసరమైన ఉపాధ్యాయుల నియామించాలి.

రూ.1.89 కోట్లు మంజూరు

మండలంలోని ప్రాథమిక పాఠశాలలు.. బస్వాపూర్‌కు రూ.12లక్షలు, కోహెడ బీసీ కాలనీ పాఠశాలకు రూ.6లక్షలు, సీసీపల్లికి రూ.6లక్షలు, గుండారెడ్డిపల్లికి రూ.6లక్షలు, కోహెడకు రూ.12లక్షలు శ్రీరాములపల్లి రూ.6లక్షలు, తంగళ్లపల్లి రూ.6లక్షలు, వింజపల్లి రూ.6 లక్షలు, సముద్రాలకు రూ.12లక్షలు, శనిగరం రూ.12లక్షలు కేటాయించగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. నారాయణపూర్‌కు రూ.6లక్షలు, బస్వాపూర్‌ హైస్కూల్‌కు రూ.18లక్షలు, సీసీపల్లి హైస్కూల్‌కు రూ.6లక్షలు, కోహెడ హైస్కూల్‌కు రూ.30 లక్షలు, సముద్రాల హైస్కూల్‌కు రూ.9 లక్షలు, శనిగరం హైస్కూల్‌కు రూ.27లక్షలు, తంగళ్లపల్లి హైస్కూల్‌కు రూ.9లక్షలు నిధులు మంజూరు అయ్యాయి.

రెండు పాఠశాలల్లో పనులకు శంకుస్థాపన

మండలంలోని తంగళ్లపల్లి, శనిగరం గ్రామాల్లో ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఇటీవల పర్యటించి పనులకు శంకుస్థాపన చేశారు. కేవలం రెండు పాఠశాలలో పనులకు శంకుస్థాపన చేశారు. మిగతా పాఠశాలలో పనులు ప్రారంభం కాలేదు. మంజూరైన నిధులు పాఠశాలలకు 10 శాతం కూడా జమ కాలేదు. దీంతో పనులు ప్రారంభం కాలేదు. అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్‌ హన్మంతరావు కోహెడ సందర్శించి జూన్‌ 12 వరకు పనులు పూర్తి చేయాలి అని ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో మౌలిక  వసతుల కల్పనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. నిధులు సద్వినియోగం అయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు 

Updated Date - 2022-06-25T05:35:56+05:30 IST