ఇదేనా భరోసా?

ABN , First Publish Date - 2021-05-27T05:30:00+05:30 IST

---ఇలా ఒకరిద్దరు కాదు... జిల్లాలో 3031 మంది అర్హులైన మత్స్యకారులకు భరోసా అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. ప్రస్తుతం చేపల వేట నిషేధం. కరోనా కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. అర్హత ఉన్నా భరోసా దక్కకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం మం

ఇదేనా భరోసా?
కలెక్టర్‌ను అభ్యర్థిస్తున్న మత్స్యకారులు






జిల్లాలో 3,031 మందికి అందని మత్స్యకార భరోసా

అర్హత ఉన్నా దక్కకపోవడంపై మత్స్యకారుల ఆవేదన 

న్యాయం చేయాలని కలెక్టర్‌కు అభ్యర్థన

(ఇచ్ఛాపురం రూరల్‌)

- ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన జానకిరావు మత్స్యకారుడు. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో కుటుంబంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. మత్స్యకార భరోసాకు దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాలేదు. ఈయన బోటులో రిజిస్టర్‌ అయిన మిగతా నలుగురికి మాత్రం భరోసా మంజూరైంది. దీంతో వేట నిషేధ భృతి అందక కుటుంబంతో ఇబ్బందులు పడుతున్నారు. 

- డొంకూరుకు చెందిన ఈయన పేరు చలపరాయి ఆదినారాయణ. గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా మంజూరైంది. ఈ ఏడాది మాత్రం బోటులో మిగతా ఐదుగురికి వచ్చి..ఈయనకు మంజూరు కాలేదు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక సతమతమవుతున్నాడు. 

---ఇలా ఒకరిద్దరు కాదు... జిల్లాలో 3031 మంది అర్హులైన మత్స్యకారులకు భరోసా అందలేదు.  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. ప్రస్తుతం చేపల వేట నిషేధం. కరోనా కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. అర్హత ఉన్నా భరోసా దక్కకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లో తీర ప్రాంతం విస్తరించి ఉంది.  104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.  4,698 రిజిస్టర్‌ బోట్లు ఉన్నాయి. ఇందులో 16,630 మంది మత్స్యకారులు నమోదై ఉన్నారు. 3,031 మందికి వివిధ కారణాలతో భృతి దక్కలేదు.  తుఫాన్‌ అప్రమత్తం చర్యల్లో భాగంగా ఇటీవల తీర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌ నివాస్‌కు బాధిత మత్స్యకారులు కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. 


 వివరాలు సేకరిస్తున్నాం

 భరోసా అందని మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. 3,031 మందికి వివిధ కారణాలతో భరోసా జమకాలేదు. ఇతర పథకాలు అందుతున్నందున నిలిచిపోయింది. ఇందులో 541 మంది నిజమైన అర్హులుగా గుర్తించాం. వారందరికీ త్వరలో భరోసా అందుతుంది. 

- శ్రీనివాసరావు, మత్స్యశాఖ జెడీ, శ్రీకాకుళం.





Updated Date - 2021-05-27T05:30:00+05:30 IST