గుంతలతోనే సరి

ABN , First Publish Date - 2021-10-02T06:52:43+05:30 IST

ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించిన జగనన్న కాలనీకే దిక్కులేదు.

గుంతలతోనే సరి
4 వేలకుపైగా గృహాలు మంజూరైన చిత్తూరు అనుప్పల్లి లేఅవుట్‌ ప్రస్తుతం ఇలా ఉంది

జిల్లా అంతా ఇదే పరిస్థితి

రెండు నెలలుగా అందని బిల్లులు

రూ.144.23 కోట్ల బిల్లుల పెండింగ్‌

నిర్మాణానికి ఆసక్తి చూపని లబ్ధిదారులు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: 

ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించిన జగనన్న కాలనీకే దిక్కులేదు. ఇక జిల్లాలోని అన్నిం ప్రాంతాల కాలనీల పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. గ్రౌండింగ్‌ మేళా అంటూ చేసిన హడావుడి ఆ తర్వాత కనిపించలేదు. చెప్పిన మాటలకూ, చేస్తున్న సాయానికీ నడుమ పొంతన లేకపోవడంతో లబ్దిదారులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. అప్పోసప్పో చేసి పనులు మొదలు పెట్టినవారికి బిల్లులు రాలేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు 1.80 లక్షలతో ఇల్లు పూర్తయ్యే అవకాశం లేదు. ఊళ్లకు దూరంగా ఉన్న ఈ కాలనీలలో నిర్మాణపనుల ఖర్చు మరింత ఎక్కువగ ఉంటోంది. లేఅవుట్‌లలో రోడ్లు, కరెంటు, నీటి వసతి వంటివి కూడా ఎక్కడా సరిగా ఏర్పాటు చేయలేదు. దాదాపుగా అన్ని చోట్లా జెసీబీలతో తవ్విన గుంతలతో జగనన్న కాలనీలు ఈసురోమంటూ ఉన్నాయి. 


 రూ.144.23 కోట్ల బకాయిలు


వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు కూడా ప్రభుత్వం బిల్లులు సరిగా చెల్లించడం లేదు.  రూ.196.83 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. విడతలవారీగా రూ.52.60కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. మరో రూ.144.23 కోట్లను అందించాల్సి ఉంది. రెండు నెలలుగా బిల్లులు లబ్ధిదారులకు అందకపోవడంతో నిర్మాణాలన్నీ ఆయా దశల్లోనే ఆగిపోయాయి. పునాది నిర్మాణం పూర్తయితే రూ.60వేలు, గోడలకు రూ.60 వేలు, పైకప్పు కోసం రూ.30 వేలు, పూతలు చేసేందుకు రూ.30 వేలు చొప్పున మొత్తంగా రూ.1.80 లక్షలను మంజూరు చేయాలి. ఆయా దశల్లో ఈ మొత్తాలను లబ్దిదారులకు చెల్లించాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వడ్డీలకు అప్పులు తెచ్చుకుని ఇళ్లు కట్టుకుంటున్న పేదలు లబోదిబో మంటున్నారు. 


1.8 లక్షలతో ఇల్లు పూర్తవుతుందా?


గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వ ఇళ్ళకు గ్రామాల్లో రూ.1.80 లక్షలు, పట్టణాల్లో రూ.2.50 లక్షల చొప్పున నిర్మించుకునే లబ్ధిదారులకు చెల్లించేవారు. ఇప్పుడు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినా ఇంటి నిర్మాణ వ్యయం పెంచలేదు. 


ఇదీ ప్రగతి!

జిల్లాకు కేటాయించిన ఇళ్లు: 1.74 లక్షలు. 

జూలైలో ప్రారంభించిన నిర్మాణాలు: 1.03 లక్షలు

ఇప్పటికి పునాదులు పడినవి: 34,829

 గోడలు లేచినవి: 4602,

 పైకప్పు వేసినవి:  2464, 

ఇప్పటికే పూర్తయిన ఇళ్లు:  214


ఇదీ వర్తమాన చిత్రం


చిత్తూరు శివారులోని అనుప్పల్లెలో 1020 పట్టాల కోసం లే అవుట్‌ను సిద్ధం చేశారు. యాభై శాతమే చదును చేశారు.  130 ఇళ్లకు పునాదులు పూర్తి అయినా, బిల్లులు రాకపోవడంతో మిగితా లబ్దిదారులు ముందుకురావడం లేదు.

జీడీనెల్లూరు మండలంలో మొత్తం 5305 గృహాలు మంజూరుకాగా710 మాత్రమే పునాది దశలో ఉన్నాయి. ఇళ్లు కట్టుకుంటున్న వారికి రూ.5.46 కోట్టు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికి రూ.1.60 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 

 వడమాలపేటలోని కాలనీలో 830 ఇళ్లకుగానూ 10 ఇళ్లు గోడలను పూర్తి చేసుకోగా.. 234 మాత్రమే పునాదుల నిర్మాణం పూర్తయ్యాయి.

యాదమరి మండలంలోని 15 లేఅవుట్లలో 2243 ఇళ్లకుగానూ 65 గృహాలకు పైకప్పు వేయగా.. 538 మాత్రమే పునాదులు పూర్తయ్యాయి. 

కలకడ మండలంలో మొత్తం 1503 గృహాలు మంజూరుకాగా.. లేఅవుట్లు సరిగా లేని కారణంగా ఒక్క నిర్మాణమూ ప్రారంభం కాలేదు. 

రొంపిచెర్లలో 1770 కుగానూ 400 గృహాల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు.  313 మాత్రమే పునాది దశలో ఉన్నాయి. 

ములకలచెరువుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టను చదును చేసి 240 మందికి పట్టాలిచ్చారు. గృహాలు మంజూరుకాకపోవడంతో ఆ ప్రాంతమంతా అడవిని తలపిస్తోంది. 

గుడిపాల మండలంలో 2139 గృహాలు మంజూరైనా వంద మాత్రమే గోడల వరకు వచ్చాయి. ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు.

రామచంద్రాపురంలో 192 ఇళ్లకుగానూ 118 గృహాల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు.

తంబళపల్లె నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు.. మొత్తంగా 10 మండలాల్లో ఇంటి పట్టాలను పంపిణీ చేసినా.. సాంకేతిక సమస్యల కారణంగా అక్కడ గృహాలను మంజూరు చేయలేదు. దీంతో ఆయా మండలాల్లో ఉన్న లేఅవుట్లన్నీ అడవులను తలపిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఆ మండలాల్లో సుమారు 11 వేల గృహాలు మంజూరైనట్లు హౌసింగ్‌ అధికారులు చెప్పారు.

మదనపల్లె మున్సిపాలిటీలో 3,027 మందికి, మండలంలో 6,465 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. 47 లేఅవుట్లలో స్థలాలు ఇచ్చారు. వీటిల్లో పునాదులు దాకా వచ్చినవి వందల్లోనే ఉన్నాయి. 

పుత్తూరులో మూడు లేఅవుట్లలో 1575 మందికి, నగరిలో ఏడు లేఅవుట్లలో 3,065 మందికి స్థలాలు కేటాయించారు. వ్యక్తిగతంగా ఇంటి నిర్మాణం భారం కావడంతో ఇక్కడ అధికారుల చొరవతో కాంట్రాక్టర్‌లను ఏర్పాటు చేసుకున్నారు.  పైకప్పు, బయట గోడలకు పూతలు, తలుపులు, కిటికీలను కాంట్రాక్టర్‌ అమర్చుతారు. మిగిలిన పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకోవలసి వుంటుంది. ఈ పద్ధతిలో నగరిలో 305 ఇళ్ల నిర్మాణం మొదలైంది. పుత్తూరులో 225 ఇళ్లు, నగరిలో 205 ఇళ్లకు  పునాదులు వేశారు.






 ‘‘పునాదులు తవ్వేందుకు డబ్బులు లేవంటున్నా అధికారులు ఒత్తిడి చేసి గుంతలు తవ్విస్తున్నారు. అప్పు చేసి పనులు ప్రాంభించాం. ఇప్పటికే పునాది కట్టుకున్నోళ్లకు బిల్లులు రాలేదంట. అప్పు ఎట్టా తీర్చాలో భయంగా ఉంది.:

- ధనలక్ష్మి, గుడిపాల


Updated Date - 2021-10-02T06:52:43+05:30 IST