కైలాస భూమిని వ్యాపారంగా మార్చొద్దు

ABN , First Publish Date - 2021-05-11T04:47:06+05:30 IST

‘కైలాసభూమిని వ్యాపార వ్యవస్థగా మార్చడం దారుణం... కొవిడ్‌ మృతుల దహన సంస్కారాలకు వేలకు వేలు వసూలు చేయడం ఎంతవరకు సబబు.

కైలాస భూమిని వ్యాపారంగా మార్చొద్దు

మాజీ  ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ
రాజమహేంద్రవరం, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘కైలాసభూమిని వ్యాపార వ్యవస్థగా మార్చడం దారుణం... కొవిడ్‌ మృతుల దహన సంస్కారాలకు వేలకు వేలు వసూలు చేయడం ఎంతవరకు సబబు. ఇకపై నయాపైసా కూడా తీసుకోకండి. అవసరమైన ఖర్చులన్నీ మేమే భరిస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సిటీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇన్నీసు పేటలోని కైలాసభూమిని సోమవారం ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న దహనాలు, వాటికి వసూలు చేస్తున్న సొమ్ముకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం తన స్వగృహం వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం ప్రజల విరాళాలతో రోటరీ కైలాస భూమిని నిర్మించారని, అయితే దాని నిర్వాహకులు మానవత్వానికి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాడీని తీసుకుని వెళ్లే స్ర్టెచర్‌ ఇచ్చినందుకు రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణకు అయ్యే ఖర్చెంతో చెబితే నెలనెలా తాము చెల్లిస్తామని, పుల్లలు ఉచితంగా ఇవ్వడానికి పేపరుమిల్లు ముందుకు వచ్చిందని ఆకుల వివరించారు.

కైలాస భూమి వద్ద ఆకుల దౌర్జన్యం

 మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం కైలాసభూమి గేట్‌ వద్ద హల్‌చేస్తూ సందర్శకులను, నిర్వాహకులను బెదిరిస్తూ అక్కడి రిజిస్టర్లను లాక్కుని వెళ్లిపోయారని రోటరీ కైలాసభూమి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ‘గత కొద్ది రోజులుగా ఆకుల  సత్యనారాయణ ప్రవర్తన రకరకాల వీడియోల ద్వారా మనం చూస్తున్నామని, కైలాసభూమికి 10 టన్నుల కలప పంపించినట్టు చెప్తున్నారని అవన్నీ అబద్ధాలను తెలిపింది. మీ వ్యాన్‌ ద్వారా  కైలాసభూమి వద్ద  ఉచితంగా ఎన్ని పేదల కార్యక్రమాలు నిర్వహించుకున్నారో మీకే తెలుసు. కానీ ఈరోజు మీ ప్రవర్తన చూస్తే మతిభ్రమించినట్టు ఉంది’ అని ప్రకటనలో పేర్కొంది. ప్రాణం పోసే డాక్టర్‌ సేవలు మర్చి, జనం దృష్టిని శవాలపై మరల్చి ప్రాబల్యం కోసం తహతహలాడుతున్నట్టు అనిపిస్తోందని స్పష్టం చేసింది. ‘ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుర్తుకు రాని కైలాసభూమి ఇవాళ గుర్తొచ్చింది. ‘మా అభివృద్ధి, మా సంస్థ అభివృద్ధి చూసి మీరు ఈర్ష్యపడుతున్నారు. మీ జీతాల కోసం పనిచేసేవారు ఇక్కడ ఎవరూ లేరు. మీకు చేతనైతే దహన క్రియల్లో పనిచేసే సేవకులను ఇవ్వండి’అని విజ్ఞప్తి చేసింది. రాజమహేంద్రవరంలో కోట్లాది రూపా యలతో మహా కాళేశ్వరాలయం నిర్మిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. తమ సంస్థ చరిత్ర గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని ఈ సందర్భంగా పేర్కొంది. సేవా కార్యక్రమాల్లో సంస్థ సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T04:47:06+05:30 IST