సొంత స్థలం, నిధులతో ‘కళామందిరం’

ABN , First Publish Date - 2022-06-27T06:53:24+05:30 IST

పలమనేరు పట్టణ సమీపంలోని సాయిగార్డన్‌ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష, కార్యదర్శులు పి.తులసినాథంనాయుడు, పుష్ప దంపతులు ‘కళామందిరం’ నిర్మించారు.

సొంత స్థలం, నిధులతో ‘కళామందిరం’
కళామందిరం

 తెలుగు సాహిత్య కార్యక్రమాల కోసం నిర్మించిన ఉపాధ్యాయ దంపతులు 


పలమనేరు, జూన్‌ 26: పలమనేరు పట్టణ సమీపంలోని సాయిగార్డన్‌ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష, కార్యదర్శులు పి.తులసినాథంనాయుడు, పుష్ప దంపతులు ‘కళామందిరం’ నిర్మించారు. ఉపాధ్యాయ దంపతులైన వీరు తెలుగు సాహిత్యంపై అభిమానంతో.. సొంత స్థలంలో, సొంతనిధులతో ఈ నిర్మాణం పూర్తి చేశారు. తెలుగు సాహిత్యంపై వీరికున్న మమకారంతో దశాబ్దం కిందట పలమనేరులో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా తెలుగువారి విశిష్ట పండుగలైన సంక్రాంతికి ముగ్గుల పోటీలు, ఉగాదికి విద్యార్థులకు సాహిత్యంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తూ తమసొంత డబ్బుతో బహుమతులు అందజేస్తున్నారు. విద్యార్థుల్లో తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు వేమన, సుమతి పద్యాలను పుస్తకాలుగా ముద్రించి  పాఠశాలలకు వెళ్లి ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటివరకు 1,30,000 మంది విద్యార్థులకు పద్య పుస్తకాలను  పంపిణీ చేశారు. ఏటా పద్యాల పోటీలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. పలమనేరులో తెలుగు సాహిత్య సాంస్కృతికి సమితి సాహిత్యం కోసం కార్యక్రమాలు నిర్వహించేందుకు కళాక్షేత్రం నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అమరనాథరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మూడేళ్ల క్రితం పలమనేరు పట్టణంలో కళాక్షేత్రం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. కళాక్షేత్రం నిర్మాణానికి వి.వి.మహల్‌ రోడ్డుపక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, వైసీపీ అధికారం చేపట్టడంతో ఈ కళాక్షేత్రం నిర్మాణం ఆగిపోయింది. దీంతో తులసినాథంనాయుడు, పలువురు సాహిత్య అభిమానులు ఇక్కడి ఎమ్మెల్యే వెంకటేగౌడును కలిసి కళాక్షేత్రం నిర్మాణం చేయాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఏడాది గడిచిపోయినా ఆచరణకు నోచుకోలేదు. దీంతో కుంగిపోకుండా తులసినాథం, పుష్ప దంపతులు తాము నివాసముంటున్న ఇంటిపక్కనే ఉన్న సుమారు రూ.30 లక్షల విలువచేసే 1200 చదరపు అడుగుల స్థలంలో రూ.20 లక్షల సొంత డబ్బులు వెచ్చించి తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కోసం కళామందిరం నిర్మించారు. ఈ కళామందిరం నిర్మాణం పూర్తి కావడంతో ప్రముఖ అష్టావధాని ఆముదాల మురళి చేతుల మీదుగా అష్టావధానంతో ప్రారంభించాలని  తులసినాథం నాయుడు, పుష్ప దంపతులు ప్రయత్నిస్తున్నారు. సాహిత్యంపై వీరికున్న మక్కువను పలువురు ప్రశంసిస్తున్నారు. 





Updated Date - 2022-06-27T06:53:24+05:30 IST