Kuppam లో ఉద్రిక్తత.. మాజీ మంత్రిని నెట్టేసిన పోలీసులు

ABN , First Publish Date - 2021-11-09T07:46:50+05:30 IST

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో 14వ వార్డు వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు అధికారులు చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది.

Kuppam లో ఉద్రిక్తత.. మాజీ మంత్రిని నెట్టేసిన పోలీసులు
పోలీసుల తోపులాటలో కింద పడిపోతున్న అమర్‌

  • -14వ వార్డులో వైసీపీ అభ్యర్థి..
  • ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటన
  •  -మండిపడి నిరసనకు దిగిన టీడీపీ 
  • -మున్సిపల్‌ కార్యాలయంలో తోపులాట
  • - పోలీసులు నెట్టివేయడంతో కింద పడ్డ 
  •    మాజీ మంత్రి అమరనాథ రెడ్డి
  • -మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా
  •    చేస్తున్న టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జి
  • - న్యాయ పోరాటానికి సిద్ధమన్న నేతలు
  • - నేడు చంద్రబాబు కుప్పం వచ్చే అవకాశం


కుప్పం, నవంబరు 8: కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో 14వ వార్డు వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు అధికారులు చేసిన ప్రకటన తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. తమ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోకుండానే ఈ ప్రకటన ఎలా చేస్తారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహోదగ్రులై మున్సిపల్‌ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. అధికారులను నిలదీసి, ధర్నాకు, రాస్తారోకోకు దిగాయి. వారిపై పోలీసుల లాఠీఛార్జితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  

కుప్పం మున్సిపాలిటీ ఉపసంహరణల ఘట్టం సాయత్రం మూడు గంటలకే ముగిసింది.  25 వార్డులు మాత్రమే కలిగిన మున్సిపాలిటీలో అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయడంలో అధికారులు విపరీతమైన ఆలస్యం చేశారు. సాయంత్రం ఏడు గంటలదాకా ఎదురుచూసిన టీడీపీ నేతలు అమరనాథ రెడ్డి, నిమ్మల రామానాయుడు, పులివర్తి నాని, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌ తదితరులు ఏదో జరుగుతోందన్న అనుమానంతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తలుపులు వేసుకుని అధికారులు ఛాంబర్‌లో ఉండిపోవడంతో ద్వారం ఎదుటే నిలబడి వేచి చూశారు. మరో 20 నిమిషాల్లో జాబితా ఇస్తామని చెప్పిన అధికారులు రాత్రి 8 గంటలకు కూడా విడుదల చేయలేదు. బయట వేచివున్న నేతల్లో ఆందోళన అధికమైంది. ఈ మధ్యలో వెలుపలికి వచ్చిన మున్సిపల్‌ కమిషనర్‌ చిట్టిబాబు, 14వ వార్డునుంచి వైసీపీ అభ్యర్థి మునస్వామి ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి ప్రకాష్‌ వేసిన నామినేషన్‌ ఏమైందని టీడీపీ నేతలు నిలదీశారు. ప్రకాష్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారంటూ ఆయన సంతకాలు చేసినట్లున్న ఫారాన్ని వారికి అధికారులు చూపారు. ప్రకాష్‌ తమవద్దనే ఉదయంనుంచి ఉన్నారని, అటువంటి వ్యక్తి నామినేషన్‌ కేంద్రానికి వచ్చి నామినేషన్‌ను ఎలా ఉపసంహరించుకుంటారని నేతలు వారిని నిలదీశారు. అధికారులనుంచి సమాధానం రాకపోవడంతో నిరసనకు దిగారు.పోలీసులు కల్పించుకుని అమరనాథ రెడ్డి,రామానాయుడు, దొరబాబు,గౌనివారి శ్రీనివాసులు, మనోహర్‌ తదితరులను  మున్సిపల్‌ కార్యాలయం బయటకు పంపడానికి గట్టిగా ప్రయత్నించారు.ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో అమరనాథ రెడ్డి కిందపడిపోయారు.ఈలోగా టీడీపీ శ్రేణులు నియోజకవర్గవ్యాప్తంగా కుప్పం మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆగ్రహోదగ్రులైన వారు, కార్యాలయంలో పాక్షిక విధ్వంసం సృష్టించారు. పోలీసులు కల్పించుకుని వారిని రోడ్డుమీదకు చెదరగొట్టి మున్సిపల్‌ కార్యాలయం గేటు మూసేశారు.దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన టీడీపీ శ్రేణులు, ‘కమిషనర్‌ డౌన్‌ డౌన్‌‘ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.14వ వార్డులో తమ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించి తీరాలని, అలా అని అధికారులు ప్రకటించే వరకూ కార్యాలయంనుంచి కదిలేది లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర నేతలు చేరవేశారు.పోలీసులు తొలుత నచ్చజెప్పడానికి ప్రయత్నించి, ఆ తర్వాత వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 14వ వార్డులో తమ అభ్యర్థులపై మొదటినుంచి దాడులు, అరాచకాలను అధికార వైసీపీ కొనసాగిస్తున్నదన్నారు. తొలుత తాము అభ్యర్థిగా నిలబెట్టిన వెంకటేష్‌పై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించివేయడమేకాక, అతడి నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారన్నారు. ఇప్పుడు అదే వార్డులో తమ అభ్యర్థి ప్రకాష్‌ ఫోర్జరీ సంతకాలు అధికారులే చేసి, వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారని, ఇది దారుణమైన అన్యాయమని ధ్వజమెత్తారు.టీడీపీ అభ్యర్థులు, శ్రేణులు, నేతలమీద  అధికార వైసీపీ చేస్తున్న దాడులను, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వారు మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించేందుకు కాచుకున్నారన్నారు.మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసు కాబట్టే ఇటువంటి అరాచకాలకు అధికార నేతలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు అన్యాయాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలపై కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కాగా రాత్రి బాగా పొద్దుపోయేదాకా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.










Updated Date - 2021-11-09T07:46:50+05:30 IST