‘ఉద్దానం’ గొంతెండుతోంది!

ABN , First Publish Date - 2021-05-19T05:25:06+05:30 IST

-ఉద్దానం ప్రాజెక్ట్‌కు సమస్యల గ్రహణం పట్టింది. దశాబ్దాల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో 3 లక్షల మంది జనాభాకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తాగునీరు అందుతోంది. నిర్వహణలో భాగంగా ప్రాజెక్ట్‌ను ఫేజ్‌-1, ఫేజ్‌-2గా విభజించారు. సోంపేట మండలం తురకశాసనాంతో పాటు మరికొన్ని చోట్ల రక్షిత నీటి పథకాలు ఏర్పాటు చేసి ‘ఉద్దానం ప్రాజెక్టు’ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.

‘ఉద్దానం’ గొంతెండుతోంది!
ఉద్దానం ప్రాజెక్ట్‌ పంపుహౌస్‌







ఉద్దానం ప్రాజెక్టుకు వెంటాడుతున్న నిధుల కొరత

శివారు గ్రామాలకు అందని తాగునీరు

ఏడాదిగా వేతనాలు లేక సిబ్బందికి ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు 

(సోంపేట/రూరల్‌)

ఉద్దానం ప్రాజెక్ట్‌.. దాదాపు 300 గ్రామాల దాహార్తిని తీర్చుతున్న అపర భగీరథి. దశాబ్దాలుగా మూడు నియోజకవర్గాల ప్రజలకు ఏడాది పొడవునా తాగునీరు అందిస్తోంది. కానీ ప్రభుత్వాలు అరకొరగా నిధులు విడుదల చేస్తుండడంతో ప్రధాన సమస్యలకు మోక్షం కలగడం లేదు. నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆ ప్రభావం నీటి సరఫరాపై పడుతోంది. శివారు గ్రామాలకు తాగునీరు అందని పరిస్థితి ఎదురవుతోంది. 15 నెలలుగా సిబ్బందికి వేతనాలు అందని దుస్థితి నెలకొంది. కరోనా విపత్కర వేళ పస్తులతో గడుపుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించి.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. 


-ఉద్దానం ప్రాజెక్ట్‌కు సమస్యల గ్రహణం పట్టింది. దశాబ్దాల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో 3 లక్షల మంది జనాభాకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తాగునీరు అందుతోంది. నిర్వహణలో భాగంగా ప్రాజెక్ట్‌ను ఫేజ్‌-1, ఫేజ్‌-2గా విభజించారు. సోంపేట మండలం తురకశాసనాంతో పాటు మరికొన్ని చోట్ల రక్షిత నీటి పథకాలు ఏర్పాటు చేసి ‘ఉద్దానం ప్రాజెక్టు’ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా నిధుల కొరత వెంటాడుతోంది. దశాబ్దాల కిందటి ఈ నిర్మాణాలు పాడవుతుండగా... యంత్రాలు మూలకు చేరుతున్నాయి. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.  ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండల ప్రభావానికి బావులు, చెరువులు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రాజెక్టు ద్వారా సరఫరా చేస్తున్న నీరే.. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని అత్యధిక గ్రామాలకు ఆధారం. ప్రాజెక్టు మరమ్మతులకు గురవడంతో కొద్దిరోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉద్దానంలోని బారువ, సోంపేట, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల వారు, మత్స్యకారులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.  


సిబ్బందికి అందని వేతనాలు

ఉద్దానం ప్రాజెక్ట్‌ పరిధిలో ప్రస్తుతం 170 మంది సిబ్బంది పని చేస్తున్నారు. తాగునీటి సరఫరాతో పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారు. దశాబ్దాలుగా పని చేస్తున్నా, వీరి వేతనాలు అంతంతమాత్రమే. పూర్తిస్థాయి ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో అరకొర జీతాలతో పనిచేస్తున్నారు.  కనీస వేతనాలు అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏడాది కాలంగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో బతుకు భారమవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దాని పరిధిలోకి తెచ్చింది. కానీ ఉద్దానం ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న తమను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు కలిసి విన్నవించినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. కనీసం వేతనాలనైనా సక్రమంగా అందిస్తే కొంత స్వాంతన చేకూరుతుందని చెబుతున్నారు. కరోనా కష్టకాలంలోనైనా తమ ఇబ్బందులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


 నెలాఖరులోగా...

సాంకేతికపరమైన సమస్యల వల్లనే జీతాల చెల్లింపులో జాప్యమవుతోంది. జిల్లా పరిషత్‌ నిధుల నుంచి జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడవ్వడంతో 15 గ్రామాలకు నీరు అందడం లేదు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. 

-ఎం.తిరుపతినాయుడు, ఉద్దానం ప్రాజెక్ట్‌ డీఈ


జీవనం కష్టమవుతోంది

ఏడాది నుంచి వేతనాలు అందడం లేదు. కుటుంబ జీవనం కష్టంగా మారుతోంది. కరోనా విపత్కర వేళలోనైనా ప్రభుత్వం మాపై కనికరం చూపాలి. ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాలి. జీతాలు సక్రమంగా అందజేసేలా కృషి చేయాలి. అందరి దాహార్తిని తీర్చే మేం ఇబ్బందులు పడుతున్నాం.

-పి.కిశోర్‌, ఉద్దానం ప్రాజెక్ట్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధి



Updated Date - 2021-05-19T05:25:06+05:30 IST