తేల్చరు.. కూల్చరు!

ABN , First Publish Date - 2022-06-26T05:38:23+05:30 IST

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం చెరువు, కుంటల కబ్జాకు ఊతమిస్తున్నది. లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భూములను చెరబడుతున్నారు. హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో రూ.50 కోట్ల విలువైన చెరువు శిఖం భూమిని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు దర్జాగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తేల్చరు.. కూల్చరు!
శంభునికుంటలో ఏర్పాటు చేసిన రేకుల ఫెన్సింగ్‌

రూ. 50 కోట్ల చెరువు భూమి కబ్జాకు యత్నం

కుంట మధ్యలో అసైన్డ్‌ భూమి ఉన్నట్టు రికార్డుల సృష్టి

అసైన్డ్‌ పట్టా ఉందని భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు

బీరంగూడ శంభునికుంటలో రెండెకరాలు అన్యాక్రాంతం


పటాన్‌చెరు, జూన్‌, 25: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం చెరువు, కుంటల కబ్జాకు ఊతమిస్తున్నది. లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు భూములను చెరబడుతున్నారు. హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో రూ.50 కోట్ల విలువైన చెరువు శిఖం భూమిని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు దర్జాగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్నది. గతంలో  శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు ప్రస్తుతం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ బీరంగూడ నడిబొడ్డున ఉన్న శంభునికుంటను అనేక సంవత్సరాలుగా రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు కాపాడుకుంటూ వస్తున్నాయి. గతంలోనూ చెరువు శిఖంలో వెలసిన కట్టడాలను తొలగించారు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో.. ఇన్నాళ్లు రికార్డుల్లో చెరువుగా నమోదైన కుంటను ఇటీవల వ్యవసాయ భూమిగా మార్చుశారు. ఈ భూమిలో తమకు అసైన్డ్‌ పట్టా ఉందని పేర్కొంటూ కొందరు వ్యక్తులు చెరువు శిఖం మధ్యలో కొంత భాగాన్ని ఆక్రమించి చుట్టూ రేకులతో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 50 కోట్ల విలువైన రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.


చెరువు మధ్యలో అసైన్డ్‌ పట్టానా!

చెరువులో అసైన్డ్‌పట్టా ఇవ్వడం కుదరదు.. ఇచ్చినా నిబంధనల ప్రకారం చెల్లదు. సదరు అసైన్డ్‌దారుడికి వేరేచోట భూమిని అసైన్డ్‌ చేయాల్సి ఉంటుంది. అసైన్డ్‌ పట్టా ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకోవాలే తప్ప.. ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్దం. శంభునికుంట చెరువులో మధ్యలో తనకు పట్టా ఉందని వాదిస్తున్న అసైన్డ్‌దారులకు రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు అందలేదు. కేవలం రాజకీయ నాయకుల అండతోనే రాత్రికిరాత్రి భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో మందీమార్బలాన్ని మోహరించి హల్‌చల్‌ చేస్తున్నారు. ఇదంతా అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే జరగడం గమనార్హం. 


హడావుడిగా కూల్చివేత

శంభునికుంటలో ఫెన్సింగ్‌ నిర్మాణంపై సమాచారం రావడంతో అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నారు. శిఖం భూమిలో రేకులతో నిర్మించిన ప్రహరీని పాక్షికంగా తొలగించారు. కానీ కబ్జాదారులు మరుసటిరోజే కూల్చేసిన ఫెన్సింగ్‌ను తిరిగి పునర్‌ నిర్మించారు.  తాజాగా కుంట కట్టను తొలగించి రోడ్డు వేసినా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించడం లేదు. రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను పునరుద్ధరించడం, భూమి స్వాధీనం వ్యవహారం రెవెన్యూ సిబ్బందికి తెలిసే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే కబ్జాదారులు అంత ధైర్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.


రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు చెరో దారి!

రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల మధ్వ సమన్వయ లోపం శంభుని కుంటకు శాపంగా మారింది. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్‌శాఖ అధికారులు శంభునికుంట వ్యవహారంలో నోరు మెదపడం లేదు. మరోవైపు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ సిబ్బంది ఈ వ్యవహారాన్ని ఇరిగేషన్‌శాఖపై నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రికార్డుల్లో సదరు భూమి కుంట శిఖంగా స్పష్టంగా ఉన్నా కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయంపై అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా రికార్డులను పరిశీలించి ఫెన్సింగ్‌ను తొలగిస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్‌శాఖ డీఈ రామస్వామి దృష్టికి శంభునికుంట వ్యవహారాన్ని తీసుకెళ్లగా రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. కుంట మధ్యలో ఫెన్సింగ్‌ వేసి నెలరోజులు గడుస్తున్నా ఇంకా రికార్డులు పరిశీలిస్తూనే ఉన్నామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే చెరువు స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది.

Updated Date - 2022-06-26T05:38:23+05:30 IST