రైతుబజార్‌ భూమికి ప్రైవేటు యజమాని

May 6 2021 @ 23:52PM
బొల్లారంలో అక్రమంగా క్రమబద్దీకరణ అయిన రైతుబజార్‌ స్థలం

 770 గజాల స్థలం జీవో 59 కింద క్రమబద్ధీకరణ

 స్థలం విలువ రూ.3కోట్లపైనే  

 స్వాధీనానికి సదరు వ్యక్తి ప్రయత్నాలు 

 నాటి రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరుతో ప్రజాస్థలానికి ఎసరు!!


జిన్నారం, మే6: 770 గజాల ప్రభుత్వ స్థలం... ఆ భూమి విలువ సుమారు రూ.3కోట్లపైనే ఉంటుంది. ప్రజల సౌకర్యార్ధం అప్పటి ప్రభుత్వం 2008లో రైతుబజార్‌ కోసం కేటాయించింది. నిర్వహణ లోపం వల్ల కొంతకాలానికి రైతుబజార్‌ మూతపడింది. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఇదే అదనుగా భావించిన కొందరు 770 గజాల ప్రభుత్వ స్థలాన్ని జీవో 59 కింద క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఇప్పుడా భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్‌ పాలకవర్గం కోర్టులో కేసు వేసింది. 

బొల్లారంలో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 284 సర్వే నంబర్‌లో 425 మందికి స్థలాలు కేటాయించింది. కాలనీ మొదటి వరుసలో పార్కు, ఆ పక్కనే 770 గజాల స్థలాన్ని రైతుబజార్‌ కోసం కేటాయించారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన కాలనీ మ్యాప్‌లోనూ రైతుబజార్‌ను చూపించారు. 2011లో రైతుబజార్‌ను  అప్పటి ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతుబజార్‌ను ఓ వ్యక్తి 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. కొంతకాలానికి వివిధ కారణాలతో నిర్వహణ సరిగా లేక రైతుబజార్‌ మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూముల్లో నివాసాలు నిర్మించుకున్న వారికి 80గజాల వరకు ఉచితంగా, ఆపై కొంత డబ్బు చెల్లిస్తే జీవో 59 కింద క్రమబద్ధీకరణకు సర్కారు అవకాశం కల్పించింది. ఇదే అదనుగా భావించిన కొందరు మూతపడ్డ రైతుబజార్‌పై కన్నేశారు. కరెంటు మీటర్‌ కోసం తీసుకున్న డోర్‌ నంబర్‌ ఆధారంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజేషన్‌ చేయించుకున్నారు. 2014కు ముందు నిర్మించిన నివాసాలకే క్రమబద్ధీకరణ వర్తించినా రైతుబజార్‌ను మాత్రం 2017లో రెగ్యులరైజేషన్‌ చేయడం గమనార్హం. రైతుబజార్‌ను లీజుకు ఇచ్చిన, క్రమబద్ధీకరణ చేసిన సమయంలో గ్రాపంచాయతీగా ఉన్న బొల్లారం 2020 నుంచి మున్సిపాలిటీగా మారింది. అయితే రూ.3కోట్ల విలువ గల 770 గజాలస్థలం అన్యాక్రాంతం వ్యవహారంలో పంచాయతీ ఉద్యోగులతో పాటు, రెవెన్యూ అధికారుల హస్తం ఉందని, భారీగానే డబ్బు చేతులు మారి ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రజాఆస్తులను అక్రమంగా క్రమబద్దీకరణ చేయడం అన్యాయమని, వెంటనే రద్దు చేయాలని నాటి పంచాయతీపాలకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ మ్యాప్‌లో స్పష్టంగా ఉన్న రైతుబజార్‌ స్థలాన్ని అధికారులు తమ పరిశీలనలో గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇన్నాళ్లు ఈవ్యవహారంపై నిమ్మకుండిన క్రమబద్ధీకరణ చేయించుకున్న వారు ఇటీవల వివిధ మార్గాల్లో స్థలస్వాధీనం కోసం ప్రయత్నాలు చేపట్టారు. పాలకులు సైతం క్రమబద్ధీకరణ రద్దుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుత మున్సిపల్‌ పాలకవర్గం ఈ అక్రమ క్రమబద్ధీకరణను రద్దు చేయాలని కూడా తీర్మానం చేసింది. మున్సిపల్‌ అధికారులు, కౌన్సిలర్లు ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్లు వేయగా కొవిడ్‌ కారణంగా విచారణ చేపట్టలేదు. 


రైతుబజార్‌ స్థలాన్ని రక్షిస్తాం : రోజారాణి, చైర్‌పర్సన్‌ బొల్లారం 

బొల్లారం మున్సిపాలిటీలో విలువైన రైతుబజార్‌ స్థలా న్ని రక్షిస్తాం.  పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో విలువైన మార్కెట్‌ను నిర్మించాం. కొందరు ఆ స్థలాన్ని జీవో 59 కింద అక్రమంగా క్రమబద్ధీకరణ చేయించుకున్నారు. ఈవ్యవహారంలో పాత్ర ఉన్న వారిపై న్యాయస్థానంలో కేసు వేశాం. ఆ స్థలాన్ని కాపాడి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.


Follow Us on: