‘హరీ’తహారం

ABN , First Publish Date - 2021-05-10T05:29:38+05:30 IST

స్థలం ఎవరిదైతేనేం కబ్జా చేసేద్దాం అన్న ఆలోచనల్లో కొందరు కబ్జాదారులున్నారు. ప్రభుత్వ స్థలంలో సర్కారు నాటిన ఈత మొక్కలు తొలగించి అందులో నుంచి రోడ్డు వేసుకునే చర్యలు ప్రారంభించారు.

‘హరీ’తహారం

  • మంత్రి నాటిన మొక్కలకూ రక్షణ కరువు
  • ఈతవనం కబ్జాకు ఫాంహౌజ్‌ యజమానుల యత్నం
  • పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు 


మొయినాబాద్‌ రూరల్‌: మొయినాబాద్‌ మండలంలో హరితహారానికి తూట్లు పడ్డాయి. సాక్షాత్తూ మంత్రి నాటిన మొక్కలకే దిక్కులేకుండా పోయింది. ఎంతో ఆర్భాటంగా నాటిన మొక్కలు పరిస్థితి దయనీయంగా మారింది. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్‌శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అప్పట్లో నాటిన ఈతచెట్ల వనాన్ని కొందరూ అక్రమార్కులు కబ్జా చేసేందుకు మంత్రి నాటిన మొక్కలనే తొలగించారు. హరితహారంలో భాగంగా హిమాయత్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్‌ 22లో హిమాయత్‌సాగర్‌ జలాశయం నుంచి గండిపేట జలాశయానికి నీటిని తోడేందుకు పైపులైను ఏర్పాటు చేసేందుకు పట్టాదారుల నుంచి ప్రభుత్వం ఎనిమిది ఎకరాల భూమిని సేకరించింది. అందులోని ఒకటిన్నర ఎకరంలో 2017 జూలై 25న ఎక్సైజ్‌ శాఖ, గీత కార్మికుల ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు పాల్గొని ఈత మొక్కలను నాటారు. అప్పట్లో అక్కడ 800 మొక్కలను నాటారు. ఎంతో అట్టహాసంగా మొక్కలను నాటినప్పటికీ వాటి సంరక్షణ సరిగా చేయలేదు. కనీసం మొక్కలకు ట్రీ గార్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో నాటిన వాటిలో సగం మొక్కలు చనిపోయాయి. ప్రభుత్వం నుంచి మొక్కల సంరక్షణకు నిధులు రాకపోవడంతోనే వాటి ఆలనా పాలన ఎవరూ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ఆ మొక్కలు నాటిన ప్రాంతానికి సమీపంలో ఫాంహౌజ్‌లు నిర్మించుకున్న కొందరు ఈతవనం భూమిపై కన్నేశారు. దానిని ఎలాగైనా కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు ఆ వనంలోని ఈత మొక్కలను తొలగించి రోడ్డును వేసుకునేందుకు వీలుగా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈతవనంలో దాదాపు ఐదు గేట్లదాకా ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి మొక్కలు నాటినప్పుడు వచ్చిన అధికారులు మళ్లీ ఇంతవరకు ఆ ఈతవనాన్ని పరిశీలించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.


  • ఎక్సైజ్‌ అధికారుల నిర్లక్ష్యం


ఈతవనంలో నుంచి ఫాంహౌజ్‌ యజమానులు రోడ్డు వేసుకుంటున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గీతకార్మికులు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని కబ్జా చేసేందుకు పద్మారావుగౌడ్‌ నాటిన మొక్కలను తొలగించి కొందరు గేట్లను ఏర్పాటు చేసుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫాంహౌజ్‌ యజమానుల నుంచి ఈత వనాన్ని కాపాడాలని గీతకార్మికులు కోరుతున్నారు. 


  • మొక్కలు తొలగించి రోడ్డు వేసుకొని ... 


ఈతవనంలో నాటిన మొక్కల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అక్రమంగా మొక్కలను తొలగించారు. ఆ స్థలంనుంచి రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి వారికి ఈ మొక్కలు నాటిన ప్రభుత్వ స్థలం నుంచి దారిలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమకు రెవెన్యూ అధికారుల నుంచి దారికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఫాంహౌజ్‌ యాజమానులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని గీతకార్మికుల వాపోతున్నారు.


ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి 


నిధులు లేకనే మంత్రి నాటిన మొక్కలు చనిపోయాయి. నాటిన మొదట్లో బాగానే చూసుకున్నాం. నిధులు లేని కారణంగానే వాటి పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం బోరు వేసుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. సమీపంలో కొందరు చేపట్టిన నిర్మాణాల కారణంగా చెట్ల పక్కనుంచి భారీ వాహనాలు వెళ్తుండడంతో మొక్కలు దెబ్బతింటున్నాయి. మొక్కల సంరక్షణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అద్భుతంగా చెట్లుగా ఎదిగేందుకు కృషి చేస్తాం.      


- ఎల్గని శ్రీనివాస్‌గౌడ్‌, గీత కార్మికుడు


  • బాధ్యత గీతకార్మికులదే


మంత్రి ఈత మొక్కలను నాటిన మాట వాస్తమే. అయితే వాటి సంరక్షణ బాధ్యత స్థానిక గీతకార్మికులదే. అప్ప ట్లో ఇదే విషయాన్ని మంత్రి స్వయంగా చెప్పారు. ఈతవనంలో మొక్కలను తొలగించినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలో ఈతవనాన్ని సందర్శించి పూర్తి దర్యాప్తు చేస్తాం. మొక్కలను తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటాం.


- రాకేష్‌, ఎక్సైజ్‌ సీఐ, చేవెళ్ల 


  • రికార్డుల్లో దారిలేదు..


గతంలో మంత్రి పద్మారావు హిమాయత్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటారు. ఈ భూమినుంచి పైపులైనుకు సంబంధించి మాత్రమే రోడ్డు ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలంలో నుంచి ఎవరికీ దారి లేదు. దారి ఏర్పాటు చేసుకొని గేట్లు బిగించుకున్న వారిని పిలిపించి గేట్లు తీయాలని సూచించాం. లేకుంటే చర్యలు తీసుకుంటామని ఫాంహౌజ్‌ యజమానులకు తెలిపాం. ప్రభుత్వ స్థలాల్లో నుంచి ఇతర ప్రైవేటు వ్యక్తులకు దారులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈత వనానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాం. చెట్ల సంరక్షణ బాధ్యత మా పరిధిలోనిది కాదు. 


 - అనిత, తహసీల్దార్‌, మొయినాబాద్‌ 

Updated Date - 2021-05-10T05:29:38+05:30 IST