అదిగో జాగా... వేసేయ్‌ పాగా!

ABN , First Publish Date - 2021-02-26T04:46:12+05:30 IST

పరిగి మండల పరిధిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ జాగా కనిపిస్తే..

అదిగో జాగా... వేసేయ్‌ పాగా!
పరిగి శివారులోని రుకుంపల్లి స్టేజి దగ్గర పూడ్చివేసేందుకు నాలాపై పోసిన మట్టి, మైత్రీనగర్‌లో నాలాను కబ్జా చేసి వేసిన తారురోడ్డు

  • పరిగి పరిధిలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు  
  • ఏటేటా పెరుగుతున్న భూముల ధరలు    
  • యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు, నాలాల ఆక్రమణ 
  • రియల్టర్ల ఇష్టారాజ్యం.. పట్టించుకోని అధికారులు


పరిగి మండల పరిధిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ జాగా కనిపిస్తే.. అక్కడ పాగా వేస్తున్నారు. ఏటేటా భూముల ధరలకు రెక్కలొస్తుండటంతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. నాలాలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కోట్లాది రూపాయల విలువైన భూములను రియల్టర్లు మాయం చేస్తున్నారు.


పరిగి: పరిగి మున్సిపాలిటీతోపాటు, మండల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు మాయమవుతున్నాయి. పరిగి నుంచి నస్కల్‌ వెళ్లే దారిలో ఏకంగా వాగునే కబ్జా చేస్తున్నారు. బసిరెడ్డిపల్లి, మల్లెమోనిగూడ, మైసమ్మగడ్డ తండాల వైపు నుంచి వచ్చే వర్షపు నీరు ఈ వాగు ద్వారా లక్నాపూర్‌ ప్రాజెక్టులో చేరుతుంది. ఈ వాగు నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. రికార్డుల్లో కూడా నాలా ఉన్నట్లు గుర్తించిన అధికారులు రిలయల్లర్లు నాలాను పూడ్చుతుంటే అడ్డుకున్నారు. అనంతరం కొంతకాలం తర్వాత మళ్లీ వాగు కనిపించకుండా మట్టితో పూడ్చివేశారు. అయితే తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇలా కబ్జా జరుగుతుంటే పట్టించుకోని అధికారులు, ఇక మారుమూల ప్రాంతాల్లో జరిగితే ఎలా కట్టడి చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిగి పట్టణ శివారులో హైదరాబాద్‌కు వెళ్లేదారిలో వెలిసిన ఓ వెంచర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నాలా దారినే మళ్లించారు. నాలాను పక్కదారిగా తవ్వించడం ద్వారా రియల్టర్లకు లాభం జరుగొచ్చుకానీ, నీటి ప్రవాహానానికి మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదే నాలాకు ఉత్తరం వైపు కూడా కబ్జాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై గతంలో భవానీ థియేటర్‌ వద్ద బ్రిడ్జి పరిసరాల్లో కూడా నాలాను కబ్జా చేసి ఏకంగా భవనాలే నిర్మించారు. ఇలా ఎక్కడబడితే అక్కడ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. 


తిరుమల, మైత్రీ వెంచర్లలో..

పరిగి పట్టణంలో టాప్‌కాలనీగా చెప్పుకునే తిరుమల, మైత్రీ వెంచర్లలో కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. మైత్రీ వెంచర్‌కు ఆనుకొని సుల్తాన్‌నగర్‌ వైపు వెళ్లే దారిలో నాలా ఉంది. ఈ నాలా స్థలాన్ని పూడ్చివేయించి ఏకంగా తారురోడ్డునే నిర్మించారు. ఇంకా కొంత భాగాన్ని ఇటీవలే పూడ్చి వేయించారు. గతంలో ఈ కబ్జా విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, కిందిస్థాయి అధికారులు నామమాత్రపు విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. పూర్తిగా విచారణ చేస్తే కబ్జాల భాగోతం బయటపడుతుంది.


గజం ధర గరిష్ఠంగా రూ.50 వేలు

 పరిగి పట్టణ పరిధిలోని భూముల గజం ధర రూ.10వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుండడంతో రియల్టర్లు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. రియల్టర్లు కూడా సంబంధిత అధికారులకు అంతో ఇంతో ఇచ్చుకోవడంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే షిర్డీ సాయి మందిరం వద్ద భవానీనగర్‌కు ఆనుకొని కొత్తగా వెలుస్తున్న వెంచర్‌ కూడా నిబంధనలకు విరుద్ధంగానే చేస్తున్నారని ఇటీవల కాలనీవాసులు గొడవకు దిగారు. అలాగే రూఫ్‌ఖాన్‌పేట్‌, రంగాపూర్‌, మాదారం, సుల్తాన్‌నగర్‌ తదితర గ్రామాల పరిధిలోని పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నాయి. సంబంధిత అధికారులు స్ప ందించి కబ్జాకు గురికాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. 


ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కబ్జాల గురించి ఇటీవలే మా దృష్టికి వచ్చింది. రుకుంప ల్లి స్టేజీ వద్ద పనులను నిలిపివేయిం చాం. మైత్రీ వెంచర్‌ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు వివరాలు సేకరిస్తున్నాం. కబ్జా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా జరిగినట్లు మా దృష్టికి తెస్తే విడిపిస్తాం. కబ్జాదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తిలేదు. 

   - విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దార్‌, పరిగి



Updated Date - 2021-02-26T04:46:12+05:30 IST