హైకోర్టు జడ్జిగా లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-10-17T05:02:05+05:30 IST

హైకోర్టు జడ్జిగా లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం

హైకోర్టు జడ్జిగా లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం
లక్ష్మణ్‌ను ప్రమాణస్వీకారం చేయిస్తున్న సతీశ్‌చంద్ర శర్మ

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): తెలంగాణ హైకోర్టు జడ్జిగా వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం విజయ దశమి రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ కొత్తగా నియామకమైన లక్ష్మణ్‌తో సహా మరో ఆరుగురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నాంపల్లి లేబర్‌ కోర్టు నెం.1ప్రిసైడింగ్‌ అధికారిగా పనిచేసిన లక్ష్మణ్‌తో పాటు మరో ఆరుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌    సిగ్నల్‌ ఇచ్చిన తరువాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మోమిన్‌పేట మండలం, వెల్చాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ పాఠశాల విద్య వెల్చాల్‌, కోహీర్‌, పరిగిలోచదువగా, ఇంటర్‌ వికారాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్నారు. ఓయూ క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్న ఆయన రంగారెడ్డి జిల్లా, సిటీ సివిల్‌ కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. అదనపు జిల్లా జడ్జి నియామక పరీక్షలో లక్ష్మణ్‌  ప్రతిభ కనబరిచి ఏడీజేగా ఎంపికయ్యారు. 2008లో తొలిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ఏడీజేగా ఆయన నియమితులయ్యారు. అనంతరం నిజామాబాద్‌ జిల్లా కోర్టులో ఏడీజే హోదాలో, హైదరాబాద్‌ ఆర్థిక నేరాల కోర్టులో స్పెషల్‌ జడ్జి హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌జడ్జిగా 2016లో పదోన్నతి పొందిన ఆయన వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యే వరకు ఆయన నాంపల్లి లేబర్‌ కోర్టు నెం.1 ప్రిసైడింగ్‌ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నుసహచర జడ్జిలు, న్యాయవాదులు అభినందించారు.

Updated Date - 2021-10-17T05:02:05+05:30 IST