మొక్కజొన్న సాగు వైపు మొగ్గు

ABN , First Publish Date - 2020-07-06T10:03:48+05:30 IST

వానాకాలం పంటగా మొక్కజొన్నను సాగుచేయొద్దని ప్రభుత్వం హెచ్చరించినా రైతులు మాత్రం ఆ పంటనే వేసేందుకు మక్కువ చూపారు.

మొక్కజొన్న సాగు వైపు మొగ్గు

రైతుబంధు ఖాతాల్లో జమ కావడంతో పెరిగిన సాగు

పత్తిసాగుకు కూలీల భయం

ప్రభుత్వ అంచనాలు తారుమారు


షాద్‌నగర్‌అర్బన్‌/రూరల్‌: వానాకాలం పంటగా మొక్కజొన్నను సాగుచేయొద్దని ప్రభుత్వం హెచ్చరించినా రైతులు మాత్రం ఆ పంటనే వేసేందుకు మక్కువ చూపారు. ప్రభుత్వ హెచ్చరికతో సందిగ్ధంలో ఉన్న రైతులు.. రైతుబంధు డబ్బు బ్యాంకులో జమ కాగానే మొక్కజొన్న సాగులో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని రైతులు మొక్కజొన్నను సాగుచేశారు. 


పెరుగుతున్న మొక్కజొన్న సాగుబడి

షాద్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఆరు మండలాల్లో గత వానాకాలం పంటగా 49,453 ఎకరాల్లో మొక్కజొన్నను, 58,236 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు లేని షాద్‌నగర్‌ డివిజన్‌లోని రైతులు అధికపంట దిగుబడి కోసం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నారు. గత వానాకాలంలో పత్తి పంటను సాగుచేసిన పొలంలో ప్రస్తుతం మొక్కజొన్నతోపాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. మొక్కజొన్న సాగుచేసిన పొలంలో పత్తితోపాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఈ వానాకాలం పంటగా పత్తి, మొక్కజొన్నను సాగు చేయడానికి రైతులు దుక్కులు దున్ని పొలం సిద్ధం చేసిన సమయంలో.. రైతులు వానాకాలం పంటగా మొక్కజొన్నను సాగుచేయొద్దని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.


మొక్కజొన్న వేస్తే కాస్తు రాయమని, రైతుబంధు ఇవ్వబోమని హెచ్చరించింది. దాంతో మొక్కజొన్న వేయాలని నిర్ణయించుకున్న రైతులు సందిగ్ధంలో పడ్డారు. మొత్తం పత్తి పంట వేస్తే పెట్టుబడితోపాటు కూలీలను ఎక్కడి నుంచి రప్పిస్తామని, మొక్కజొన్న వేయకపోతే పశుగ్రాసం పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో పడ్డారు. తొలకరి వర్షాలు కురియగానే పత్తి వేయాలనుకున్న పొలంలో పత్తివిత్తనాలు నాటిన రైతులు మొక్కజొన్న సాగు కోసం కొంత జాప్యం చేశారు. పత్తిసాగుచేస్తే కూలీల సమస్య ఉంటుందని భావించిన పెద్దరైతులు ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేసినా.. చేయకపోయినా.. రైతుబంధు డబ్బులను ఇవ్వకపోయినా సరేనంటూ మొక్కజొన్నను సాగుచేశారు. మొక్కజొన్నసాగు చేయాలనుకున్న సన్న, చిన్న కారు రైతులు రైతుబంధు డబ్బు బ్యాంకు అకౌంట్లలో పడగానే ఆ పంటను సాగుచేయడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయకపోయినా స్థానిక పౌలీ్ట్రలకు విక్రయిస్తామన్న ధీమాతో ఉన్నారు. రైతుల ఆసక్తిని పరిశీలిస్తే గతేడాది సాగుబడికి దీటుగానే మొక్కజొన్న సాగుబడి ఉండే అవకాశం లేకపోలేదు. 


పత్తికి కూలీలకు భయం

పత్తి పంటను సాగుచేసిన రైతులను కరోనా భయపెడుతుంది. ప్రతి ఏటా పత్తిని తీయడానికి కర్నూల్‌ జిల్లా నుంచి కూలీలను రప్పిస్తారు. కుటుంబాలతో తరలివచ్చే వారు పంట ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఉండి వెళ్తారు. ఒక రూపాయి ఎక్కువైనా సరే పత్తి నేలపాలుకాకుండా ఇంటికి వస్తుంది. అయితే ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా కారణంగా పత్తిపంట తీయడానికి కర్నూల్‌ నుంచి కూలీలు వస్తారో.. రారోనన్న భయంతో ఆ పంట సాగుబడిని పెంచడానికి వెనుకడుగు వేస్తున్నారు. అలాగే మద్దతు ధరపై కొనుగోలు చేస్తున్న సీసీఐకి పత్తిని విక్రయించడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు భావిస్తున్నారు. పత్తి పంటకు పెట్టుబడులు అధికం కావడం, కూలీల సమస్య ఉండడంతో రైతులు తిరిగి మొక్కజొన్న సాగుపైనే ఆసక్తి కనబర్చుతున్నారు.

Updated Date - 2020-07-06T10:03:48+05:30 IST