నకిలీ మందులను అరికడదాం

ABN , First Publish Date - 2021-03-03T06:35:43+05:30 IST

నకిలీ మందులను అరికట్టి, జిల్లాకు మంచి పేరు తెద్దామని జిల్లా అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ వీరకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

నకిలీ మందులను అరికడదాం
వీరకుమార్‌ రెడ్డిని సన్మానిస్తున్న నరసింహులు తదితరులు

అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ వీరకుమార్‌ రెడ్డి పిలుపు


తిరుపతి (వైద్యం), మార్చి 2: నకిలీ మందులను అరికట్టి, జిల్లాకు మంచి పేరు తెద్దామని జిల్లా అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ వీరకుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని బాలాజీ ట్రస్ట్‌ భవనంలో మంగళవారం జిల్లా కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మందుల పంపిణీ, నకిలీ మందులను అరికట్టడంపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల కాలంలో డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌ వారు పరీక్షల నిమిత్తం తీసుకున్న కొన్ని మందులు నకిలీవిగా తేలినట్టు తెలిపారు. దర్యాప్తు చేయగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఓ కంపెనీ తయారు చేసినట్టుగా వెలుగులోకి వచ్చిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో నకిలీ మందుల అమ్మకాలను నిర్మూలించడానికి డైరెక్టర్‌ జనరల్‌ డ్రగ్స్‌ అండ్‌ కాపీరైట్‌ వారు కొన్ని మార్గదర్శకాలను సూచించారని చెప్పారు. ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే నకిలీ మందుల ఆట కట్టించవచ్చన్నారు. ప్రధానంగా.. మందులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేటపుడు ఆయా కంపెనీల, ప్రోడక్టుల వివరాలు, చిరునామా స్పష్టంగా సేకరించి ఉంచుకోవాలన్నారు. సదరు కంపెనీ, డీలర్‌ తరఫున రోజువారీ వ్యవహారాలు నిర్వహించే వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబరు వంటి కూడా తీసుకోవాలన్నారు. ఈ వివరాలన్నీ ఈనెల 15వ తేదీలోగా కచ్చితంగా హోల్‌సేల్‌ వద్ద ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.రత్నం, కార్యదర్శి నరేష్‌ బాబు, కోశాధికారి నరసింహులు, నాయకులు శివకుమార్‌, రామచంద్ర, లోకేష్‌తోపాటు జిల్లాలోని 200 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T06:35:43+05:30 IST