ఈ ఏడాదీ అంతే!

May 5 2021 @ 23:40PM

మామిడి రైతుకు చేదు అనుభవం

తేనె మంచుతో దెబ్బతిన్న పూత

ఉన్న పంటను అమ్ముదామంటే కలిసిరాని ధర

కరోనాతో ముందుకురాని వ్యాపారులు

(టెక్కలి/మెళియాపుట్టి)

మామిడి రైతులకు ఈ ఏడాది చేదు అనుభవమే ఎదురవుతోంది. గత ఏడాది కరోనా ప్రభావం ఎగుమతులు, రవాణాపై చూపింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో భాగంగా రవాణాకు అనుమతులు వచ్చినా.. అప్పటికే రైతులకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో దిగుబడి తగ్గుముఖం పట్టింది. తేనె మంచు కారణంగా పూత దశలో పంట దెబ్బతింది. అరకొర పంట ఉన్నా కరోనా కేసుల ఉధృతితో క్రయవిక్రయాలు సక్రమంగా సాగడం లేదు. వ్యాపారులు ముందుకు రావడం లేదు. 


ఇదీ పరిస్థితి

జిల్లాలో 30 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మెళియాపుట్టి, పాతపట్నం, సీంతంపేట, రాజాం, పొందూరు, భామిని, మందస, కొత్తూరు, లావేరు, రణస్థలం, రేగిడి, జి.సిగడాం, వంగర, సారవకోట మండలాల్లో మామిడి సాగు అధికం. వేలాదిమంది రైతులు మామిడి సాగుపైనే ఆధారపడతారు. కలెక్టర్‌, సువర్ణరేఖ బంగినపల్లి, చెరకు రసం, గోవా తదితర రకాల మామిడి ఉత్పత్తులు జిల్లా నుంచి ఒడిశాతో పాటు విజయవాడ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. తొలి విడతగా కలకత్తా, ఢిల్లీ, ముంబాయి, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, అస్సాం, హర్యానా, పంజాబ్‌, చత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండేవారు. ముందుగానే వ్యాపారులు రైతులతో మామిడి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటారు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లిస్తారు. సాధారణంగా ఉగాది తరువాత మామిడి సేకరణ, ఎగుమతులు ప్రారంభమవుతాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో వ్యాపారులు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. దాని ప్రభావం ఎగుమతులపై పడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  


ఏటా ఇదే పరిస్థితి

ఏటా వాతావరణ ప్రతికూల పరిస్థితులు, తెగుళ్లు.. మామిడికి అపార నష్టానికి గురిచేస్తున్నాయి. ఈ ఏడాది కూడా పూతను తేనె మంచు  దారుణంగా దెబ్బతీసింది. రైతులు వ్యయప్రయాసలతో పంటకు సస్యరక్షణ చేసి కాపాడుకున్నారు. దీనికితోడు సాగు ఖర్చులు పెరిగాయి. మామిడికాయల సేకరణ, రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం టన్ను మామిడి ఒడిశాలోని బరంపురం కేంద్రంగా రూ.25 వేలుకు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు రూ.40 వేలకుపైగా విక్రయిస్తున్నారు. ఏటా మామిడి రైతులు దళారుల భారిన పడి నిలువునా మోసపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.