రైతు గ్రూపులకే యంత్రాలు!

ABN , First Publish Date - 2021-06-11T04:57:46+05:30 IST

ఇకపై రైతుల గ్రూపులకే రాయితీ యంత్రాలు, పరికరాలు ఇవ్వనున్నారు. వ్యక్తిగత రాయితీ పథకానికి స్వస్తి పలికారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్పు చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రానికొకటి చొప్పున కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం, రెవెన్యూ డివిజన్‌కొకటి చొప్పున హైటెక్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. గ్రూపులకు యంత్రాలు, పరికరాలు మూడు విడతలుగా ఇవ్వనున్నారు. తొలివిడత జూలై, రెండో విడత సెప్టెంబరు, మూడో విడత డిసెంబరు నెలలో పరికరాల మంజూరుకు నిధులు కేటాయిస్తారు. ఏడీసీసీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని, జిల్లాకు రూ.37.80 కోట్లు మంజూరు చేశారు.

రైతు గ్రూపులకే యంత్రాలు!

 వ్యక్తిగత రాయితీకి స్వస్తి

 యాంత్రీకరణ పథకంలో మార్పులు

 జిల్లాకు రూ.37.80 కోట్లు మంజూరు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఇకపై రైతుల గ్రూపులకే రాయితీ యంత్రాలు, పరికరాలు ఇవ్వనున్నారు. వ్యక్తిగత రాయితీ పథకానికి స్వస్తి పలికారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్పు చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రానికొకటి చొప్పున కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రం, రెవెన్యూ డివిజన్‌కొకటి చొప్పున హైటెక్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. గ్రూపులకు యంత్రాలు, పరికరాలు మూడు విడతలుగా ఇవ్వనున్నారు. తొలివిడత జూలై, రెండో విడత సెప్టెంబరు, మూడో విడత డిసెంబరు నెలలో పరికరాల మంజూరుకు నిధులు కేటాయిస్తారు. ఏడీసీసీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని, జిల్లాకు రూ.37.80 కోట్లు మంజూరు చేశారు.


పేరు మార్పు.. :

యంత్రీకరణ పథకానికి మార్పు చేసి, వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకంగా నామకరణం చేశారు. ఈ పథకం కిందకు కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలన్నీ తీసుకొచ్చారు. రైతు గ్రూపులు తీసుకున్న చిన్న పరికరం మొదలు పెద్ద యంత్రం వరకు ఈ కేంద్రాల్లో ఉంచుతారు. జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఉన్నాయి. ఒక్కో ఆర్‌బీకే పరిధిలో ఒక రైతు గ్రూపు ఉంటుంది. తొలి విడతగా 252 గ్రూపులకు పథకం వర్తింపజేయనున్నారు. వచ్చే నెల 8న ముఖ్యంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. యంత్రాలు, పరికరాలను పొందిన గ్రూపుల్లోని రైతులు తమ పనులు చేసుకుంటూనే.. గ్రామంలోని ఇతరులకు అద్దెకు ఇవ్వవచ్చు. ఆర్‌బీకేల్లో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, యంత్రాలు, పరికరాలు అందజేయాలని గత ఏడాదే నిర్ణయించారు. అప్పట్లోనే గ్రూపునకు ఐదుగురు చొప్పున సభ్యులను ఎంపిక చేశారు. ఒక్కో గ్రూపునకు అప్పట్లోనే రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు, డివిజన్‌ స్థాయిలో ఒక్కో హైటెక్‌ హబ్‌కు రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్ల వరకు కేటాయించారు. సభ్యులంతా బ్యాంకుల్లో ఖాతాలు కూడా తెరిచారు. జిల్లాలో 772 గ్రూపులు ఖాతాలు తెరిచాయి. వీరంతా ఏడాదిగా ఎదురుచూశారు. గత ఏడాది నిబంధనలను సవరిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 నగదు చెల్లిస్తేనే.. 

వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకంలో బ్యాంకు రుణం 50 శాతం, రాయితీ వాటా 40 శాతం, రైతు వాటా 10 శాతం చొప్పున నిధులు కేటాయించారు. బ్యాంకు రుణం మినహా.. మిగిలిన రాయితీ, రైతు వాటా కింద 50 శాతం ముందుగా చెల్లించాలి. తర్వాత గ్రూపు ఖాతాల్లోకి రాయితీ మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం మెలిక పెట్టింది. అంత మొత్తం చెల్లించలేమని  వివిధ మండలాల్లోని రైతు గ్రూపుల సభ్యులు తేల్చి చెబుతున్నారు. గతంలో ప్రభుత్వాలు యంత్రీకరణ పథకాన్ని అమలు చేశాయి. ఈ పథకం కింద వ్యక్తిగతంగా రైతులకు యంత్రం, పరికరాలను రాయితీతో అందించాయి. ప్రస్తుతం నిబంధనలు మార్చారు. రైతు వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం లేకుండా చేశారు. కేవలం గ్రూపులకు మాత్రమే ఇవ్వడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


40 శాతం రాయితీ 

యాంత్రీకరణ పథకం కింద ఈసారి గ్రూపులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఐదుగురు రైతుల చొప్పున గ్రూపులుగా ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 40 శాతం రాయితీతో యంత్రాలు, పరికరాలు అందిస్తున్నాం. గ్రూపులన్నీ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే. జులై 8న తొలి విడత పరికరాలు అందజేసేందుకు షెడ్యూల్‌  వచ్చింది. ఈ మేరకు  ఏర్పాట్లు చేస్తున్నాం.

- కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ, జేడీ, శ్రీకాకుళం.


.............................

మండలాల వారీగా జాబితా అందజేయండి

వ్యవసాయాధికారులకు జేసీ సుమిత్‌కుమార్‌ ఆదేశం

కలెక్టరేట్‌, జూన్‌ 10 : రైతులకు ఏఏ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అవసరమో.. మండలాల వారీగా జాబితా అందజేయాలని జేసీ సుమిత్‌కుమార్‌.. వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో జేసీ మాట్లాడారు. రైతులకు  40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయనున్నట్లు  తెలిపారు.  రైతులకు ఏఏ పరికరాలు కావాలో మండలాల వారీగా జాబితా తయారు చేయాలని ఆదేశించారు.  పరికరాల తయారీదారులతో ధరలపై మాట్లాడాలన్నారు. రుణాల మంజూరులో ఆలస్యం చేయరాదని డీసీసీబీ  సీఈవోకు సూచించారు.  సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌, ఆగ్రోస్‌ డీఎం కె.జగన్మోహన్‌రావు, హార్టీ కల్చర్‌ ఏడీ, రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డీడీ రాబర్ట్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-11T04:57:46+05:30 IST