మనోడైతే ఓకే.. కాదంటే కూల్చెయ్‌!

ABN , First Publish Date - 2020-11-21T05:23:38+05:30 IST

సిక్కోలులో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఓ మాదిరి పట్టణాల్లో సైతం ఎకరా రూ.కోటికి తక్కువ లేకుండా ధర పలుకుతోంది. దీంతో కొంతమంది పాలక పెద్దలు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎక్కడ వాగులు, వంకలు, చెరువులు, ఆలయ, ఈనాం భుములు ఆక్రమణకు గురయ్యాయో గుర్తించే పనిలో పడ్డారు. ఆక్రమణదారులతో మిలాఖత్‌ అయి.. అందినంత దండుకుంటున్నారు. బేరసారాలు కుదుర్చుకుని కొంతమంది ఆక్రమణదారులను వదిలేస్తున్నారు. బేరం కుదరకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నోటీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

మనోడైతే ఓకే.. కాదంటే కూల్చెయ్‌!
కొర్లకోటలో ఆక్రమణల తొలగింపుపై చర్చిస్తున్న ఆర్డీవో కిశోర్‌


 ఆక్రమణల తొలగింపులో అధికార పార్టీ నేతల జోక్యం

 బేరసారాలు కుదరకపోతే నోటీసులు 

 ఆందోళన చెందుతున్న బాధితులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

సిక్కోలులో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఓ మాదిరి పట్టణాల్లో సైతం ఎకరా రూ.కోటికి తక్కువ లేకుండా ధర పలుకుతోంది. దీంతో కొంతమంది పాలక పెద్దలు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎక్కడ వాగులు, వంకలు, చెరువులు, ఆలయ, ఈనాం భుములు ఆక్రమణకు గురయ్యాయో గుర్తించే పనిలో పడ్డారు.   ఆక్రమణదారులతో మిలాఖత్‌ అయి.. అందినంత దండుకుంటున్నారు. బేరసారాలు కుదుర్చుకుని కొంతమంది ఆక్రమణదారులను వదిలేస్తున్నారు.  బేరం కుదరకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నోటీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులను రంగంలోకి దించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. అన్ని మునిసిపాలిటీల పరిధిలోనూ ప్రభుత్వ స్థలాల్లో పేదల ఆక్రమణలను తొలగిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గతంలో పేదలు, దళితులకు ప్రభుత్వం డీ పట్టా భూములను ఇచ్చింది. వీటిని ఇప్పుడు కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఉంటున్నామని... నేతల ఒత్తిళ్లతోనే అధికారులు తమ నివాసాలను తొలగిస్తున్నారని కొంతమంది బాధితులు వాపోతున్నారు. అధికారుల తీరుతో పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆక్రమణలు ఎన్నో.. 

- శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్‌బేగ్‌పేటలో చెరువు స్థలాన్ని కొందరు దర్జాగా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. అధికారులు వారికి ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఆక్రమణదారులు నేతలను ప్రసన్నం చేసుకోవడంతో ఏమీ తెలియనట్లు వదిలేశారు. 

- పెదపాడుకు సమీపంలో నారాయణపురం ఎడమ కాలువ గట్లు ఆక్రమణలకు గురయ్యాయి.  దీనిపై ఫిర్యాదులు అందడంతో నోటీసులు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. 

- పెదపాడు భీమేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.దేవదాయ శాఖ భూముల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. నోటీసులు జారీచేసినా ఆక్రమణదారులు పట్టించుకోకపోవడంతో అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. 

- పొందూరులో శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయ భూములు సుమారు రెండెకరాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ రైతులు కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. స్థానిక వైసీపీ నేతల అండతో ఇటీవల ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆక్రమణలకు దిగారు. ఆలయ ధర్మకర్త ముసుగులో ఉన్న వైసీపీ నేత.. ఈ భూములను తెగనమ్ముకుంటున్నారు. పెద్దఎత్తున నిర్మాణాలు చేపడుతుండడంతో అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాలను నిలిపేశారు. అయితే జిల్లాలో ఎక్కడి కక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాగా, అధికారులు కొన్ని ప్రాం తాల్లో మాత్రమే ఆక్రమణలు తొలగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నేతల అండ ఉన్నవారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


అధికారుల తీరుపై విమర్శలు...

ఆమదాలవలస రూరల్‌: ఆక్రమణల తొలగింపు పేరుతో నిరుపేదలను యంత్రాంగం ఇబ్బందులకు గురిచేస్తోంది. పక్కా ఇళ్ల జోలికి వెళ్లకుండా.. అఽధికారులు రేకుల షేడ్లు, ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తకుప్పలను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం కొర్లకోటలోని మురగడ చెరువులో (సర్వేనెంబర్‌ 294/2లో 3.13 ఎకరాల్లో) ఆక్రమణలు తొలగించేందుకు ఆర్డీవో కిశోర్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ జి.శ్రీనివాసరావు సిబ్బందితో చేరుకున్నారు. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలు ఇందుకు అంగీకరించకపోవడంతో.. అధికారులు పోలీసు బలగాలతో ఆక్రమణలు తొలగించారు. తాగునీటి కుళాయిని సైతం కూల్చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లు కూల్చేసి..  ప్రభుత్వ నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


-ఆక్రమణలు తొలగించాం

కొర్లకోటలో మురగడ చెరువులో ఆక్రమణలను తొలగించాం. శాశ్వత భవనాలకు నోటీసులు అందించాం. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందించి తదుపరి చర్యలు చేపతాం.

- జి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌, ఆమదాలవలస


 

Updated Date - 2020-11-21T05:23:38+05:30 IST