అంతా భ్రాంతియేనా..!

ABN , First Publish Date - 2022-08-10T05:37:36+05:30 IST

‘కోర్సు ఫీజు, పరీక్ష ఫీజు కట్టండి. ఆ తరువాత పరీక్షలకు హాజరుకండి. అంతా నేను చూసుకుంటా. చదవాల్సిన పనే లేదు. ప్రతి ప్రశ్నకూ జవాబులు చేతికి అందిస్తాం. చూసి రాస్తే చాలు.

అంతా భ్రాంతియేనా..!
కిందకూర్చొని పరీక్ష రాస్తున్న ఓపెన ఇంటర్‌ విద్యార్థులు

మార్చి పోయింది.. ఆగస్టూ పోతోంది..

ఓపెన పరీక్షల్లో కుదరని కాపీ పొత్తు

సీరియ్‌సగా తీసుకున్న జిల్లా విద్యాశాఖ

భారీగా డబ్బు వసూలు చేసిన వైసీపీ నాయకుడు

డబ్బు వెనక్కు ఇవ్వాలని వెంటబడుతున్న విద్యార్థులు

తాడిపత్రి, ఆగస్టు 9: ‘కోర్సు ఫీజు, పరీక్ష ఫీజు కట్టండి. ఆ తరువాత పరీక్షలకు హాజరుకండి. అంతా నేను చూసుకుంటా. చదవాల్సిన పనే లేదు. ప్రతి ప్రశ్నకూ జవాబులు చేతికి అందిస్తాం. చూసి రాస్తే చాలు. విద్యాశాఖలో కింది నుంచి పైదాకా అందరినీ మేనేజ్‌ చేస్తా. అనుమానమే వద్దు. గతంలో ఇలాగే చాలామందిని పాస్‌ చేయించా..’ ఓపెన టెన్త, ఇంటర్‌ సర్టిఫికెట్‌ ఆశించేవారికి ఇలా ఆయన భరోసా ఇచ్చారు. జస్ట్‌.. డబ్బులు కడితే చాలని అన్నాడు. పాస్‌ గ్యారెంటీ బాధ్యత తనదేనని మాటిచ్చాడు. ‘అక్షరం చదవాల్సిన పనిలేదు.. సర్టిఫికెట్‌ మీ చేతుల్లో పెడతాం..’ అని బేరం పెట్టాడు. ఆయన అధికార పార్టీ నాయకుడు. గతంలోనూ ఇలా చాలా మందిని పాస్‌ చేయించానని అంటున్నాడు. అందుకే.. బుట్టలో పడిపోయారు. వేలకు వేలు చెల్లించారు. కానీ.. అనుకున్నదొకటి.. అయ్యింది ఒ కటి..! చిట్టీలు అందలేదు. కాపీలు జరగలేదు. తాడిపత్రిలో డబ్బులు కడితే పాస్‌ గ్యారెంటీ అనుకున్నవారికి సినిమా కనబడుతోంది. ఓపెన టెన్త, ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 3న ప్రారంభమయ్యాయి. బుధవారంతో ముగుస్తాయి.  


ఎన్నెన్నో ఆశలు..

ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం చాలామంది 10వ తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లను సంపాదించాల్సి వస్తోంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, గౌరవ వేతనంతో పనిచేస్తున్న సిబ్బందికి ఓపెన ఇంటర్‌ ద్వారా సర్టిఫికెట్‌ పొందాలని చూస్తున్నారు. ఇలాంటివారికి తాడిపత్రికి చెందిన వైసీపీ నాయకుడు, మరికొందరు కలిసి అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ మొత్తం తారుమారైంది. గతంలో మాదిరి డబ్బులు వెదజల్లి పని పూర్తి చేయాలని చూసినవారికి చుక్కెదురైంది. ఓపెన టెన్త, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను విద్యాశాఖ ఈ ఏడాది చాలా సీరియ్‌సగా తీసుకుంది. మాస్‌ కాపీయింగ్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించింది. ఇన్విజిలేటర్లు, స్వ్కాడ్‌కు ప్రత్యేక హెచ్చరికలను జారీచేసింది. ఎక్కడైనా మాస్‌ కాపీయింగ్‌ జరిగితే.. ఇళ్లకు పంపుతామని స్పష్టం చేసింది. ఒకప్పుడు పరీక్ష కేంద్రం బయట ఉండి.. అంతా నడిపించిన ఇనస్టిట్యూషన్స ప్రతినిధులు ఈ సారి ఆ దరిదాపుల్లో కనిపించడం లేదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్దా విద్యాశాఖ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించింది. కాపీయింగ్‌కి పాల్పడ్డ వారిని డీబార్‌ చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. తల పక్కకు తిప్పేందుకు కూడా విద్యార్థులకు ఆస్కారం ఇవ్వడంలేదు. ఇన్విజిలేటర్లు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఎరవేసి.. డబ్బు గుంజిన ఇనస్టిట్యూషన్స నిర్వాహకులు చెప్పిన మాటలకు, పరీక్ష హాలులో పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. దీంతో చదవకుండానే పాస్‌ కావాలని హుషారుగా వచ్చినవారికి దిమ్మ తిరుగుతోంది. 


మార్చిలో మొదలైంది..

తాడిపత్రి పట్టణంలోని రెండు కేంద్రాల్లో ఓపెన టెన్త, మూడు కేంద్రాల్లో ఓపెన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. పట్టణంలోని బాలికోన్నత పాఠశాల, త్రిబుల్‌ ఎస్‌ ఆర్‌ఎం హైస్కూల్‌లో ఓపెన టెన్త, ప్రకాశం మున్సిపల్‌ హైస్కూల్‌, మోడల్‌స్కూల్‌, బాయ్స్‌ హైస్కూల్‌లో ఓపెన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో పరీక్షలు జరిగాయి. అప్పట్లో తాడిపత్రిలోని వివిధ సెంటర్లలో 500 మంది పదో తరగతి, 1500 మంది ఇంటర్‌ పరీక్షలు రాశారు. అప్పుడు కూడా సి్ట్రక్ట్‌గా జరగడంతో కేవలం ఆరుశాతం మంది పాసయ్యారు. ఫెయిలైన వారిలో ఎక్కువమంది సప్లిమెంటరీ పరీక్షల జోలికి వెళ్లలేదు. ఏమీ చదవకుండా పరీక్షలు ఎలా రాయాలి, ఎగ్జాం ఫీజు దండగ అన్నట్లు వ్యవహరించారు. అసలు పరీక్షల్లో కఠినంగా వ్యవహరించినా, సప్లిమెంటరీలోనైనా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారేమో అని కొందరు ధైర్యం చేశారు. ఇనస్టిట్యూషన్స వారికి వేలకు వేలు చెల్లించినందున.. అంతా వారే చూసుకుంటారని భావించారు. ఎన్నో ‘ఆశలతో’ ఈ నెల 3వ తేదీన తొలి పరీక్షకు హాజరయ్యారు. మొదటి రోజే చుక్కెదురైంది. మార్చి కంటే సి్ట్రక్ట్‌గా పరీక్షలను నిర్వహించడం ప్రారంభించారు. దీంతో మిగిలిన పరీక్షలకు వెళ్లడం, మూడు గంటలు కూర్చుని గోళ్లు గిళ్లుకోవడం ఎందుకని.. గైర్హాజరు అవుతున్నారు. 


ఏం చేస్తాం.. ప్చ్‌..

‘పార్టీ అధికారంలో ఉంది. నా మాటే శాసనం. ఏంచేసినా చెల్లుతుంది. విద్యాశాఖ అధికారులు తల ఆడిస్తారు. ఒకరిద్దరు  తల అడ్డంగా ఊపినా.. డబ్బిస్తే సర్దుకుంటారు..’ అని వైసీపీ నాయకుడు భావించాడు. తన ఇనస్టిట్యూషన పరిధిలో విద్యార్థులకు భరోసా ఇచ్చాడు. మిగిలిన ఇనస్టిట్యూషన్స వారి తరపున కూడా వకల్తా పుచ్చుకున్నాడు. ఓపెన టెన్త, ఓపెన ఇంటర్‌ విద్యార్థులకు గాలం వేశాడు. ఆంధ్రప్రదేశ ఓపెనస్కూల్స్‌ ద్వారా పాస్‌ చేయిస్తామని కరపత్రాలు వేశారు. తాడిపత్రి పట్టణం, జిల్లాలోని పలు ప్రాంతాల విద్యార్థులను ఆకర్షించారు. చాలామంది వీరి మాయలో పడిపోయారు. ఒక్కొక్కరు రూ.7వేల నుంచి రూ.10వేల వరకు చెల్లించారు. డబ్బుపోతే పోయింది.. సర్టిఫికెట్లు చేతికి వస్తాయి అనుకున్నారు. కానీ సీన రివర్స్‌ అయింది. దీంతో డబ్బు చెల్లించినవారు వైసీపీ నాయకుడి వద్దకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘అనుకున్నట్లు జరగలేదు. ఏం చేస్తాం..’ అని ఆయన ఓదారుస్తున్నారేగాని, డబ్బు తిరిగి ఇవ్వడం లేదని సమాచారం. 

Updated Date - 2022-08-10T05:37:36+05:30 IST