Advertisement

కారు.. కేసీఆర్‌ వైపు నిలబడండి

Oct 30 2020 @ 06:11AM

బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎండమావే 

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది

కాలువల కోసం ఇచ్చే భూమికి సిద్దిపేట మాదిరిగా పరిహారం ఇప్పిస్తా

కేంద్రం విదేశీ మక్కలను తెచ్చి ఇక్కడి కోళ్లకు పోస్తుంది 

మన మక్కలను ఎవరు బుక్కాలి ? 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


తొగుట, అక్టోబరు 29 : కారు.. కేసీఆర్‌ వైపు నిలబడాలని, కాంగ్రెస్‌, బీజేపీ ఇచ్చే సీసాలను ఎడమ కాలుతో తన్నాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వాళ్లకు ఓటు వేస్తే ఎండమావుల వెంట వెళ్లడమేనన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్‌, గుడికందుల గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. వానాకాలంలో వచ్చే ఉసిల్ల మాదిరిగా ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్‌, బీజేపోల్లు ఊళ్ల మీద పడ్డారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి కత్తి లేదు నెత్తి లేదని విమర్శించారు. బీజేపీది గ్లోబల్‌ ప్రచారం తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, మంత్రిగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. తొగుట మండలంలో కాలువల కోసం రైతుల నుంచి సేకరించే భూమికి సిద్దిపేటలో మాదిరిగా పరిహారం ఇప్పించే బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయని తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా అని ప్రశ్నించారు. నాటి నిజాం పాలన నుంచి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరూ భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారని గుర్తు చేశారు. ఒక్క కేసీఆర్‌ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బు ఇచ్చారని కొనియాడారు. రైతుల బతుకుల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్‌, 24 గంటల ఉచిత కరెంట్‌, రైతుబంధు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ పైసలు లేదా సీసాలు ఇస్తారని లేదంటే హరీశ్‌రావును తిడతారని అంతకంటే ఏమి చేస్తారని ప్రశ్నించారు. వాళ్ల తిట్లను దీవెనలుగా భావించి ఇంకా కష్టపడుతానని చెప్పారు. ‘కేంద్రంలోని బీజేపీ విదేశాల నుంచి మక్కలను దిగుమతి చేసుకుని తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి.. బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నదో ప్రజలు ఆలోచన చేయాలని’ హరీశ్‌రావు కోరారు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్‌ పాలిస్తున్న 5 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్‌, రైతుబంధు పేరిట రూ.10 వేలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.


రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. నరేంద్ర మోదీ బీహార్‌ ఎన్నికల్లో డబులు ఇంజన్‌ గ్రోత్‌ అంటున్నారని.. అంటే ఢిల్లీలో బీజేపీ.. బీహార్‌లో బీజేపీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని చెబుతున్నారని తెలిపారు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, అలాగే దుబ్బాకలోను గెలిచి డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌తో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంటు కోసం అర్ధరాత్రి కళ్లల్లో ఒత్తులు వేసుకుని రైతులు పొలం దగ్గర వేచి చూసే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దొంగ రాత్రి కరెంటు ఇస్తాం...మాకు ఓటు వేయండని కాంగ్రెస్‌ వాళ్లు ప్రజలను ఓట్లు అడుగతరా అని ప్రశ్నించారు. పేదింటి ఆడపిల్లకు లక్ష నూట పదహార్లు... కారు ..కేసీఆర్‌ ఇస్తున్నారని తెలిపారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్క రూపాయి ఇచ్చిందా అన్నారు. అనంతరం వెంకట్రావుపేట, ఘనపూర్‌, గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. అంతకుముందు గుడికందుల గ్రామంలోని కాల భైరవ స్వామి ఆలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు.


ఈ కార్యక్రమంలో అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవిరవీందర్‌, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అనిత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరికృష్ణరెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గోవర్ధన్‌ రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు కలిమొద్దీన్‌, ఎంపీటీసీలె శరత్‌, కవిత ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెంకటమ్మ, మల్లయ్య, నాయకులు శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రాజిరెడ్డి, బాల్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


మక్కల దిగుమతితో రైతులకు నష్టం

చేగుంట, అక్టోబరు 29: విదేశాల నుంచి మక్కలను దిగుమతి చేసుకుంటే రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎలా వస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతారామలింగారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్షారెడ్డికు మంగళహారతులతో డప్పుచప్పుళ్లు, బతుకమ్మ బోనాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్కల దిగుమతితో తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో ఎవరు గెలిస్తే పనులు అవుతాయో ఆలోచించి ఓటు వేయాలని, తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చలేక పోయాయని గుర్త చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు ఇచ్చిందని తెలిపారు.


బీడీ కార్మికులకు బీజేపీ ఏమో జీఎస్టీని, కాంగ్రెస్‌ పార్టీ ఏమో పుర్రె గుర్తు పెట్టిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం బీడీ కార్మికులకు పింఛన్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ బాయిలకాడ మీటర్లు పెడితే, కేసీఆర్‌ మాత్రం 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాళ్లు అడ్డు పెడితే పొలాలకు నీళ్లు వస్తాయన్నారు. తద్వారా నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు అన్నదాతలకు రూ.28 వేల కోట్లను అందజేశామని ఆయన తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వార్డు నెంబర్‌ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి దాకా అందరూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారని, అభివృద్ధి కావాలంటే సోలిపేట సుజాతకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంగళరావు, జడ్పీటీసీ మోదం శ్రీనివాస్‌, సర్పంచ్‌ లక్ష్మీజ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.