మైనర్లే డ్రైవర్లు

ABN , First Publish Date - 2021-10-09T05:00:13+05:30 IST

సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సిన ఇసుక ట్రాక్టర్లు దొడ్డిదారిన నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, మల్యాల, సిద్దిపేట రూరల్‌ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి, పుల్లూరు గ్రామాల మీదుగా సిద్దిపేటకు చేరుతున్నాయి. ఈ ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్న డ్రైవర్లు అందరూ మైనర్లే కావడం విడ్డూరం.

మైనర్లే డ్రైవర్లు
నంబర్‌ ప్లేట్‌ కూడా లేని ఇసుక ట్రాక్టర్‌ను నడుపుతున్న బాలుడు

బాలురతో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

పల్లెల్లో అతివేగంతో దూసుకెళుతున్న ట్రాక్టర్లు 

భయపడుతున్న ప్రజలు

ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్న ఇసుక మాఫియా

పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులు


ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అడ్డదారులను ఆశ్రయిస్తున్నది.  ప్రధాన రోడ్డు గుండా వెళితే ఆటలు సాగడం లేదని పలు పల్లెల దారులకు మలుపుతున్నది. ఏకంగా మైనర్లను ట్రాక్టర్ల డ్రైవర్లుగా రంగంలోకి దింపింది. వారు తెల్లవారగానే గ్రామాల గుండా అతివేగంతో దూసుకెళుతున్నారు. దీంతో పల్లె ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించిన వారికి ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. 


సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 8 : సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్న వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సిన ఇసుక ట్రాక్టర్లు దొడ్డిదారిన నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, మల్యాల, సిద్దిపేట రూరల్‌ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి, పుల్లూరు గ్రామాల మీదుగా సిద్దిపేటకు చేరుతున్నాయి. ఈ ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్న డ్రైవర్లు అందరూ మైనర్లే కావడం విడ్డూరం.


అతివేగంతో..

మైనర్లు పల్లెదారుల్లో అతివేగంతో ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారు. దాంతో గ్రామాల్లో రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం లేని మైనర్లు నిర్లక్ష్యంగా నడపడంపై పలు గ్రామాల్లో వాహనాలను ఆపి ప్రశ్నిస్తే వారికి ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయి. మీరు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తమని ఏమి చేయలేరు అంటూ స్థానికుల నోర్లు మూయిస్తున్నారు. గ్రామస్థాయి పాలకవర్గ సభ్యులు ఇసుక ట్రాక్టర్లను ఆపి ఈ దారి గుండా ట్రాక్టర్లు నడపవద్దని సూచించగా పోలీసు, రెవెన్యూ అధికారుల సూచన మేరకే ఇటు వైపు నుంచి ట్రాక్టర్లు నడుపుతున్నామని సమాధానం ఇచ్చారని తెలిపారు. 


తెల్లవారగానే..

ప్రతీరోజూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పల్లెవాసులు తెలిపారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు నంబర్‌ ప్లేట్‌ కూడా ఉండడం లేదు. ట్రాక్టర్ల అతివేగం పట్ల పోలీసులకు ఫోన్‌ ద్వారా పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు.

 

కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్‌ఐ

ఇసుక అక్రమ రవాణాపై మరింతగా పర్యవేక్షణ పెంచి చర్యలు తీసుకుంటామని సిద్దిపేట రూరల్‌  ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని చెప్పారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


Updated Date - 2021-10-09T05:00:13+05:30 IST