వర్షాకాలం గృహవైద్యం!

ABN , First Publish Date - 2021-06-29T18:13:36+05:30 IST

వర్షాకాల వాతావరణ ప్రభావంతో రోగనిరోధకశక్తి సన్నగిల్లే తత్వం ఉన్నవాళ్లు తేలికగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే గృహవైద్యాలను అనుసరించడం ఉత్తమం.

వర్షాకాలం గృహవైద్యం!

ఆంధ్రజ్యోతి(29-06-2021)

వర్షాకాల వాతావరణ ప్రభావంతో రోగనిరోధకశక్తి సన్నగిల్లే తత్వం ఉన్నవాళ్లు తేలికగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే గృహవైద్యాలను అనుసరించడం ఉత్తమం.


తమలపాకు రసం: కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లకు ఈ రసం తీసుకోవడం వల్ల ఉపశమనం దక్కుతుంది. శ్వాస సంబంధ ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, కఫ సంబంధ సమస్యలు తమలపాకు రసం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఈ రసం తయారీ కోసం పది నుంచి పదిహేను తమలపాకులు శుభ్రంగా కడిగి, నీళ్లు చేర్చి మిక్సీలో జ్యూస్‌లా రుబ్బుకుని, వడగట్టాలి. దీనికి తేనె, నిమ్మరసం లేదా ఉప్పు కలిపి పరగడుపున తీసుకోవాలి.


వెల్లుల్లి మజ్జిగ: ఇమ్యూనిటీ పెంచడానికి, కెలెస్ట్రాల్‌, శ్వాస సమస్యలు, గురక, రక్తసరఫరా సంబంధిత సమస్యలు, రక్తనాళాల్లో పూడికలు, రక్తం చిక్కబడడం మొదలైన సమస్యలకు ఉపకరిస్తుంది. రెండు వెల్లుల్లి పాయలు మెత్తగా నూరి, గ్లాసుడు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకోవాలి.


వేడినీళ్లు: వాతావరణంలో మార్పుల వల్ల జీర్ణశక్తి ప్రభావితం అవుతుంది. పక్వ, అపక్వ ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల పదార్థాలు సక్రమంగా జీర్ణం కావు. ఆ సమయంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేసిస్తే, అది వృద్ధి చెంది నీళ్ల విరోచనాలు, ఫుడ్‌ పాయిజనింగ్‌, ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగై, విరోచనం సాఫీగా జరుగుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ప్రొబయాటిక్స్‌ తోడ్పడతాయి.


లేపనాలు: గంధం, కర్పూర లేపనాలు శరీరానికి పూసుకున్నప్పుడు చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. 


ఆవ పిండి: ఆవపిండితో చేసిన పదార్థాలు తినడం వల్ల అంటు వ్యాధుల నుంచి రక్షణ దక్కుతుంది. ఆవపిండితో చేసిన ఆవకాయ పచ్చడి, మజ్జిగ చారు, ఆవపెట్టిన కూరలు మొదలైనవి ఈ కాలంలో తరచుగా తింటూ ఉండాలి.


జి. శశిధర్‌,

అనువంశిక ఆయుర్వేద 

వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌,

చీరాల.


Updated Date - 2021-06-29T18:13:36+05:30 IST