ఉపాధిహామీలో నం.1గా నిలపాలి

ABN , First Publish Date - 2021-02-28T05:27:26+05:30 IST

ఉపాధిహామీ పనుల నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా నిలపాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఉపాధిహామీలో నం.1గా నిలపాలి

 10 రోజుల్లో శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తి చేయాలి

 అధికారులకు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ఆదేశం


సిద్దిపేట సిటీ, ఫిబ్రవరి 27: ఉపాధిహామీ పనుల నిర్వహణలో జిల్లాను రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా నిలపాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌తో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో మర్కుక్‌ మండలాన్ని రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిపిన ఎంపీడీవో ఓబులేసును, సిద్దిపేట రూరల్‌, అర్బన్‌లను ఐదు, ఎనిమిదో స్థానాల్లో నిలిపిన ఎంపీడీవో సమ్మిరెడ్డిని, మండల ప్రత్యేక అధికారులను అభినందించారు. పది రోజుల్లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటికల నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. లేదంటే ఈఈ, ఏఈలను  సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలు, పెండింగ్‌లో ఉన్నటు పనుల వివరాలపై మండలాల ప్రత్యేకాధికారులు ఈఈ, ఏఈ, డీఆర్డీవో, డీపీవో, ఎంఎ్‌సవో, ఎంపీడీవో, అడిషనల్‌ కలెక్టర్ల సంతకాలతో కూడిన నివేదికలను ఫొటోలతో ఫైల్‌ రూపంలో తయారుచేసి సోమవారం సాయంత్రంలోగా కలెక్టరేట్‌లో నిర్వహించే సమీక్ష సమావేశంలో తనకు అందజేయాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో నిర్మించిన డంపుషెడ్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై కలెక్టర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలను చైతన్యం చేసేలా సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు, రైతుబంధు అధ్యక్షులు, మహిళా గ్రూపు నాయకులు, ఏపీవోలతో సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎమ్‌ఎ్‌సవోలు, ఎంపీఓలు, ఎంపీడీవోలు మండలంలో ఒక్కొక్కరు ఒక గ్రామంలో ప్రజలకు అవగహన కల్పించాలని సూచించారు. హుస్నాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌ మూడు డివిజన్లలో మూడు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసి జిల్లాలో శనివారంకల్లా పెండింగ్‌ లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నర్సరీల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నర్సరీల అభివృద్ధిపై కూడా స్వయంగా తానే నివేదిక తెప్పించుకొని పరిశీలించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. 


Updated Date - 2021-02-28T05:27:26+05:30 IST