నజరానా ఏదీ?

ABN , First Publish Date - 2021-05-11T04:44:47+05:30 IST

ఎన్నికల్లో వృథా ఖర్చును అరికట్టేందుకు, గ్రామాలు అభివృద్ధి సాధించడానికి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. దీంతో వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన సర్పంచులకు నిరాశే ఎదురైంది.

నజరానా ఏదీ?

  • ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు
  • రెండేళ్లుగా నిరీక్షణ 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 135 పంచాయతీలు 
  • ఏకగ్రీవ సర్పంచ్‌ల ఎదురుచూపులు


ఎన్నికల్లో వృథా ఖర్చును అరికట్టేందుకు, గ్రామాలు అభివృద్ధి సాధించడానికి ఏకగ్రీవ పంచాయతీలకు  ప్రభుత్వం  నజరానాను ప్రకటించింది. దీంతో వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన  సర్పంచులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లు దాటినా నజరానా అందకపోవడంతో ఏకగ్రీవ  సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. 

(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : రాష్ట్రప్రభుత్వం 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు సర్పంచు ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్న పంచాయతీలకు రూ. 10 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ. 15 లక్షల ప్రోత్సహక బహుమతి ప్రకటించింది. ఈ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆశించిన సర్పంచులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లు దాటినా పంచాయతీలకు కేటాయించిన నజరానా అందకపోవడంతో ఏకగ్రీవ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నా అవి చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,187 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 135 పంచాయతీల్లో పాలక వర్గాలను ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఏకగ్రీవ పంచాయతీలు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నాయి.

ఒక్క పైసా రాలే..:అరుణమ్మ, ఎల్కాగూడ సర్పంచ్‌, చౌదరిగూడ మండలం 

ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించి రెండేళ్లు దాటింది. నేటివరకూ ఒక్క పైసా ఇవ్వలేదు. గ్రామాభివృద్ధికి చేతి నుంచి డబ్బులు ఖర్చుపెడుతున్నా. చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. నజరానా ఇవ్వాలని పలు మార్లు వినతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 

సర్కారువి బూటకపు మాటలే..:  - పోచమోని పార్వతమ్మ, సర్పంచ్‌ చింతకుంటపల్లి, కేశంపేట మండలం 

  సర్కారువి బూటకపు మాటలే. ఏక గ్రీవంగా ఎన్నికైతే నజరానా రూ. 10 లక్షలు ఇస్తామన్నారు. నేను గెలిచి రెండు సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు డబ్బులు మంజూరు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏకగ్రీవ పంచాయతీలకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలి. 

పోత్సాహకాలు మంజూరు చేయాలి: శ్రీధర్‌రెడ్డి, తిర్మాలాపూర్‌ సర్పంచ్‌, షాబాద్‌ మండలం

ఏకగ్రీవ డబ్బులతో గ్రామంలో ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలనుకున్నా. ఇదిగో నజరానా.. అదిగో నజరాన అంటూ ప్రభుత్వం ఊరిస్తోంది. ఇప్పటికే గ్రామంలో వివిధ పనులకు లక్షల రూపాయలు చేతి నుంచి ఖర్చు పెట్టా. వెంటనే ప్రభుత్వం ప్రకటించిన డబ్బులను విడుదల చేయాలి. 

Updated Date - 2021-05-11T04:44:47+05:30 IST