అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

Jun 16 2021 @ 23:42PM
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

  • కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి 

బొంరాస్‌పేట్‌ : అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్‌, విద్యుత్‌శాఖ, వైద్యం, విద్య, రవాణా, పౌరసరఫరాలు, ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ, మిషన్‌ భగీరథ, రోడ్లు, భవనాలు, శిశుసంక్షేమం, తదితర శాఖల అధికారులతో అంశాల వారీగా మాట్లాడారు. పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఏ కారణం చేతనైనా ఎండిపోతే వాటిని తొలగించి కొత్త మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. భగీరథ తాగునీరు సరఫరాలో ఎలాంటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం జరిగితే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాగా ప్రజాప్రతినిధులను గౌరవించని ఉద్యోగులు ఎందుకని, బొంరాస్‌పేట్‌ ఎంపీడీవోను సరెండర్‌ చేయాలంటూ సభ్యులు వైస్‌ ఎంపీపీ శేరినారాయణరెడ్డి సభా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

  • రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు

బొంరాస్‌పేట్‌ : రైతులు నకిలీ విత్తనాలనుకొని మోసపోవద్దని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో రైతులకు చిరుపొట్లాలు(పీఆర్‌జీ-75) రకం కంది, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటల సాగు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on: