ఫిలిఫ్పైన్స్‌..అల్ల నేరేడు..

ABN , First Publish Date - 2022-05-15T06:21:56+05:30 IST

చేతికందే ఎత్తులో మామిడికాయలు చూశాం.. నిమ్మకాయలు చూశాం.. మరి నేరేడు కాయలో కాస్త కష్టమే.. ఎందుకంటే చెట్టు నిటారుగా పెరుగుతోంది..

ఫిలిఫ్పైన్స్‌..అల్ల నేరేడు..
పిలిఫైన్స్‌ అల్లనేరేడు మొక్క

కడియం, మే 14 : చేతికందే ఎత్తులో మామిడికాయలు చూశాం.. నిమ్మకాయలు చూశాం.. మరి నేరేడు కాయలో కాస్త కష్టమే.. ఎందుకంటే చెట్టు నిటారుగా పెరుగుతోంది.. కాయలు చూస్తే కొమ్మల చివర గుత్తులు.. గుత్తులుగా ఉంటాయి.. అటువంటిది చెట్టు కాయలు చేతికందే ఎత్తులో కాసేస్తున్నాయి. ఈ చిత్రంలో ఇదేం చెట్టో గుర్తించారా.. నేరేడు చెట్టు ఒక చిన్న టబ్‌లో పెంచేశారు. ఈ చెట్టు ఇక్కడిది కాదండోయ్‌.. విదేశీజాతికి చెందిన సరికొత్త రకం బుర్రిలంకలో రైతు కుప్పాల దుర్గారావుకు చెందిన నర్సరీలో కొలువు తీరింది.  2018లో ’’ పిలిఫ్పైన్స్‌ ’’ నేరేడు మొక్కను పిలిప్పైన్స్‌ దేశం నుంచి తెచ్చి ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటిస్తూ మొక్కను పెంచుతూ వచ్చారు. ఈ మొక్కకు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నేరేడుగా నామకరణం చేశారు. ఈ నేరేడు చెట్టు కేవలం 7 నుంచి 8 అడుగుల ఎత్తు మాత్రమే ఎదుగుతుంది. మొక్కను పెంచిన తరువాత రెండేళ్లకు ఫలాలు వస్తాయి. ఏడాదికోకసారి మాత్రమే ఫలాలు ఇస్తుంది. ఫిలిప్పైన్స్‌ నేరేడు తీయగా ఉంటుంది. కేజీకి 40 కాయలు వరకు తూగే పరిమాణంలో ఉంటూ నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. నర్సరీలో పిలిప్పైన్స్‌ నేరేడు ఐదేళ్ల మొక్క.. ప్రస్తుతం 5 నుంచి 6 కిలోల కాపునిస్తుందని రైతు తెలిపారు.ఈ మొక్క నాటి నేరేడు ఫలాలు రావడానికి 180 రోజుల కాలం పడుతుంది. డిసెంబర్‌ నెల నుంచి ప్రారంభమై (పువ్వు, మొగ్గ, కాయ ) దశల్లో మారుతూ  మే నెల నాటికి  ఫలాలు వస్తాయని రైతు కుప్పాల దుర్గారావు పిలిప్పైన్స్‌ నేరేడు గురించి తెలిపారు. నీరు తక్కువగా ఉండే ప్రాంతంతో పాటు చౌడుభూములు, ఎర్ర నేలలు, కంకర నేలల్లోనూ నేరేడు పంట వేసుకోవచ్చని తెలిపారు. 7 నుంచి 8 అడుగుల ఎత్తు మాత్రమే ఎదిగే ఈ నేరేడు మొక్క ను డాబాపైనా, అపార్ట్‌మెంట్లలోను (కొద్దిపాటి ఎండ తగిలే ప్రాంతం)లో కూడా పెంచుకోవచ్చన్నారు.  


Updated Date - 2022-05-15T06:21:56+05:30 IST