కొత్వాల్‌గూడకు కొత్త సమస్య

ABN , First Publish Date - 2021-10-13T04:52:08+05:30 IST

శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ గ్రామానికి కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో గ్రామస్థులు తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత కౌన్సిలర్లతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ను కలిసి సమస్యను విన్నవించుకున్నారు.

కొత్వాల్‌గూడకు కొత్త సమస్య

  • గ్రామంలోని భూమి ఎనిమీ ప్రాపర్టీగా తేలిందన్న కేంద్ర హోంశాఖ 
  • నోటీసులు జారీ చేయడంతో బోరుమన్న గ్రామం
  • మాజీ సర్పంచ్‌లు, తాజా కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే, 
  • అధికారుల వద్దకు గ్రామస్థుల పరుగులు

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ గ్రామానికి కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో గ్రామస్థులు తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత కౌన్సిలర్లతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ను కలిసి సమస్యను విన్నవించుకున్నారు. దీంతో  ఎమ్మెల్యే ఆర్డీవోకు సమస్యను వివరించారు. దసరా తర్వాతసమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పడంతో గ్రామస్తులు తేలికపడ్డారు. మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్‌లు, రైతులు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొత్వాల్‌గూడ గ్రామంలోని భూములు ఎనిమీ ప్రాపర్టీ అన్న విషయంపై కొన్ని సంవత్సరాలుగా వివాదం సాగుతోంది. ఈ సమస్యను గతంలో ఆంధ్రజ్యోతి’ ఆ ఊరును అమ్ముకుంటాం.. అనుమతి ఇవ్వండి’ అన్న శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం చూపింది. అయితే ఈ గ్రామంలోని భూములు ఎనిమీ ప్రాపర్టీ అని తేలిందని.. భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఈ నెల 30వ తేదీ లోగా తమ భూములకు సంబంధించిన వివరాలు ఆధారాలతో నిరూపించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆధీనంలోని మంత్రిత్వశాఖ రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. 

అయితే, ఈ విషయం మీడియాకు తెలిస్తే వివాదం అవుతుందని కొందరు అధికారులు గ్రామస్థులను భయపెట్టడంతో ఈ విషయం బయటకు రాలేదు. అయుతే, తమ భూము లు ఉంటాయో.. పోతాయోనన్న భయంలో కొందరు గ్రామస్థులున్నారు. దీంతో వారు తమ సమస్యను స్థానిక మాజీ సర్పంచ్‌లు శ్రీనివాసగౌడ్‌, కృష్ణయ్యలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు విన్నవించారు. ఆయ న వెంటనే ఆర్టీవో చంద్రకళతో మాట్లాడి కొత్వాల్‌గూడ వివాదాన్ని పరిష్కారం చేయాలని కోరారు. దసరా సెలవులు అయిపోగానే ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ఆర్డీవో చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.అయినా, స్థానికులు మాత్రం ఇంకా భయపడుతూనే ఉన్నారు.

నోటీసుల జారీతో అలజడి

కేంద్ర ప్రభుత్వ అధికారి సోమవారం కొత్వాల్‌గూడకు వచ్చి గ్రామ రైతులకు నోటీసులు ఇచ్చా రు. ఈ భూములు ఎనిమీ ప్రాపర్టీవి అని చెప్పడంతో గ్రామంలో అలజడి మొదలైంది. దీంతో ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించాం. సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.

- శ్రీనివా్‌సగౌడ్‌, కొత్వాల్‌గూడ మాజీ సర్పంచ్‌

పొలాలు లాక్కుంటే ఊరుకోం

ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు అవి ఎనిమీ ప్రాపర్టీవి అని వాటిని లాక్కుంటే ఊరుకోం. వాటికోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతాం. 

- కృష్ణయ్య, కొత్వాల్‌గూడ మాజీ సర్పంచ్‌

భూములు లాక్కుంటారని భయమవుతుంది

కొత్వాల్‌గూడకు ఏదో అవుతుందని.. ఇక్కడి రైతుల భూము లు ఎవరో లాక్కుంటారని ప్రచా రం సాగుతోంది. దీంతో మాకు భయంగా ఉంది. మా పొలాల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం.

-ఈశ్వర్‌, రైతు, కొత్వాల్‌గూడ

ఆత్మహత్య చేసుకుంటాం

కొత్వాల్‌గూడలో తాము ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూములు విడిచిపొమ్మంటే ఎలా వెళతాం. వాటిని పోగొట్టుకోవాల్సి వస్తే పక్కనే ఉన్న హిమాయత్‌   సాగర్‌ (సౌడమ్మ చెర్వు)లో దూకి ఆత్మహత్య చేసుకుంటాం. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి. 

- లక్ష్మి, గృహిణి

Updated Date - 2021-10-13T04:52:08+05:30 IST