న్యూ ఇయర్ వేడుకలు

ABN , First Publish Date - 2021-01-02T07:27:54+05:30 IST

నూతన ఆంగ్ల సంవత్సరం తొలిరోజున జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి.

న్యూ ఇయర్ వేడుకలు
శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

కిటకిటలాడిన ఆలయాలు, పర్యాటక కేంద్రాలు

కొవిడ్‌ ప్రభావాన్ని అధిగమించిన జనం


తిరుపతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గతేడాది మార్చిలో మొదలై అన్ని రంగాలనూ తీవ్రంగా దెబ్బతీసిన తీసిన కొవిడ్‌ ప్రభావాన్ని జిల్లా ప్రజానీకం తొలిసారిగా అధిగమించింది. నూతన ఆంగ్ల సంవత్సరం తొలిరోజున జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఆలయాలు, పర్యాటక కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా నూతన సంవత్సరం మొదటి రోజున సుమారు పాతిక వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్దసంఖ్యలో రాజకీయ నాయకులు, అధికారులు దర్శనానికి రావడంతో భక్తులు క్యూలైన్‌లో ఎక్కువసేపు నిరీక్షించాల్సి వచ్చి ఇబ్బంది పడ్డారు. తిరుపతిలోని కపిలతీర్థం, కోదండ రామాలయం, శ్రీనివాస మంగాపురం, వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం ఉదయం నుంచీ సాయంత్రం వరకూ భక్తుల రద్దీని చవి చూసింది. కాణిపాకంలో వేకువజామునుంచీ సాయంత్రం 6 గంటలు దాటాక కూడా భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. తవణంపల్లె మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో రద్దీ లేకపోయినా రోజంతా భక్తుల రాకపోకలతో సందడిగా మారింది. ఇక, బోయకొండ గంగమ్మ దేవస్థానానికీ భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. పుంగనూరు పట్టణంలోని ప్రముఖ గుడులన్నీ భక్తులతో సందడిగా మారాయి. నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయం, పల్లికొండేశ్వరాలయం, నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, మదనపల్లె పట్టణంలోని ప్రధాన ఆలయాలైన ప్రసన్నవెంకట్రమణ స్వామి ఆలయం, మడికయ్యల శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తంబళ్లపల్లె మండలంలోని మల్లయ్యకొండ, కోసువారిపల్లెలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, బంగారుపాళ్యం మండలం మొగిలిలోని మొగిలీశ్వరాలయం, వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామాలయం, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కలకడ సిద్ధేశ్వరాలయాలకు కూడా పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి తమ ఇష్టదైవాలను దర్శించుకున్నారు. మరోవైపు తలకోని సిద్ధేశ్వరాలయంతో పాటు తలకోన, ఉబ్బలమడుగు జలపాతాలు, హార్సిలీ హిల్స్‌, చంద్రగిరి కోట వంటి పర్యాటక ప్రాంతాలూ సందర్శకులతో కళకళలాడాయి. యువకులు బృందాలుగా తరలి రాగా పలువురు కుటుంబాలతో వచ్చి నూతన సంవత్సరం తొలిరోజు సరదాగా గడిపారు. ప్రధాన ఆలయాల్లో మాస్కు నిబంధనలు పాటించగా, మిగిలిన ఆలయాల్లో సరిగా పాటించలేదు. 







Updated Date - 2021-01-02T07:27:54+05:30 IST