నిండా మునిగాం.... ఆదుకోండి

ABN , First Publish Date - 2021-11-28T07:11:10+05:30 IST

జిల్లాలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు శనివారం సుడిగాలి పర్యటన చేశాయి.

నిండా మునిగాం.... ఆదుకోండి
పుంగనూరు మండలం చదళ్ల వద్ద నీటమునిగిన వరి పంటను పరిశీలిస్తున్న కేంద్రబృందం

కేంద్ర బృందానికి వరద బాధితుల విన్నపం


తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు శనివారం సుడిగాలి పర్యటన చేశాయి. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్‌,శ్రీకాళహస్తి,రామచంద్రాపురం మండలాల్లో ఓ టీము,గంగవరం, పెద్దపంజాణి,  సోమల, పుంగనూరు  మండలాల్లో మరో టీము పర్యటించాయి.వరద నష్టాలను  పరిశీలించిన అధికారులు బాధితులతో నేరుగా మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను చూశారు. వరి, వేరుశనగ పంటలతో పాటు ఉద్యానవన పంటలైన టమోటా, బీన్స్‌, క్యాబేజి, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌, అరటి పంటలకు జరిగిన నష్టాన్ని, ముంపునకు గురైన ఇళ్లు, కాలువల పరిస్థితిని రైతులు వారికి వివరించారు.నిండా మునిగిపోయామని...పెద్దమనసుతో ఆదుకోవాలని అభ్యర్థించారు.నష్టపోయిన  పంటలకు, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లించాలని కమిటీ సభ్యులకు బాధితులు  విజ్ఞప్తిచేశారు.జిల్లాలో 12,744హెక్టార్లలో కోతకు అందివచ్చిన వరిపంట నాశనమైందని, 2855 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటిపాలయ్యాయని అధికారులు చెప్పారు. ప్రాథమికంగా జిల్లాలో రూ.1600కోట్ల వరద నష్టం జరిగిందని రెండు రోజులు ముందు అంచనా వేసినా రోజురోజుకూ నష్టం పెరుగుతోందన్నారు.అనంతరం తిరుపతిలోని గ్రాండ్‌ రిడ్జ్‌ హోటల్లో అధికారులతో కేంద్రబృందం సమీక్షించింది. తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం సత్వరం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి రాష్ట్రప్రభుత్వం తరపున అభ్యర్థించారు.ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటించేందుకు కేంద్రబృందం వెళ్లనుంది. 

తిరుపతిలోని ఎస్పీడీసీఎల్‌ రోడ్డును కేంద్రబృందం పరిశీలించాక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా వరద ముంపునకు గురైన ప్రాంతాల గురించి వివరిం చారు.ఎమ్మార్‌పల్లి సర్కిల్లో కలెక్టర్‌ హరినారాయణన్‌, మేయర్‌ శిరీష 20వ డివిజన్‌ సచివాలయంలో ముంపు పరిస్థితులను వివరించారు. గొల్లవానిగుంట, కృష్ణారెడ్డి నగర్‌, పూలవానిగుంట, కొరమేనుగుంట ప్రాంతాల్లో ముంపునకు గురైన గృహాలను, రోడ్లను పరిశీలించాక కమిషనర్‌ గిరీష  ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా నష్టాలను వివరించారు.కరకంబాడి రోడ్డులోని సుభాష్‌నగర్‌ను, అమెరికన్‌ బార్‌ ఎదురుగా దెబ్బతిన్న డ్రైనేజి కాలువను, శ్రీరామ్‌నగర్‌లో గృహాల, కాలువల పరిస్థితిని ఎమ్మెల్యే వివరించారు. అనంతరం ఆటోనగర్‌ను పరిశీలించారు. 

రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఆర్సీపురం మండలంలోని రాయలచెరువును కేంద్ర బృందం పరిశీలించింది.కట్ట కింద లీకేజీ వద్ద జరుగుతున్న మరమ్మతులను గమనించింది.ఈ విషయం తెలిసి వందలాదిమంది బాధితులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరినారాయణన్‌,ఎమ్మెల్యే చెవిరెడ్డి వారికి అక్కడి పరిస్థితిని వివరించారు. అనంతరం రాయలచెరువు తూములలో నీటమునిగిన బాదూరు రోడ్డును కేంద్రబృందం పరిశీలించింది. 

పుంగనూరు మండలం చదల్లలో నీట మునిగిన వరిపంటలను, టమోటా పంటను కేంద్రబృందం పరిశీలించింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భారీవర్షాలతో చేతికి అందాల్సిన టమోటా, వరి, కాలీప్లవర్‌ పంటలు పొలాల్లోనే కుళ్లిపోగా చెట్లు చచ్చిపోయాయని వివరించారు. 

సోమల మండలం సూరయ్యగారిపల్లె- సదుం మార్గంలో వర్షాలతో దెబ్బతిన్న టమోటా, వరిపంటలను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు.ఇరికిపెంట సమీపంలోని చెన్నపట్నం చెరువు, దెబ్బతిన్న రోడ్లు, వరి, టమోటా, బొప్పాయి తోటలను తిలకించారు. ఇరికిపెంట-చెన్నపట్నం చెరువువద్ద దెబ్బతిన్న రోడ్డును, పరిశీలించారు.

   గంగవరం మండలం కనికల్లు చెరువు కట్టకింద  172 ఎకరాల్లో పంట నీటమునిగిన ప్రాంతాన్ని కేంద్రబృందం పరిశీలించింది.బాధిత రైతులు పెద్దసంఖ్యలో తమగోడు వెల్లబోసుకున్నారు. 

 చంద్రగిరి మండలం కాశిపెంట్ల పంచాయతీ మొరవపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంటను,నడింపల్లెకు వెళ్ళే మార్గంలో స్వర్ణముఖి నదిపై కొట్టుకుపోయిన వంతెనను  కేంద్ర బృందం పరిశీలించింది.శానంబట్లకు వెళ్ళే మార్గంలో కోతకు గురైన రోడ్డును పరిశీలించాక పంట నష్టం వివరాలను ఎమ్మెల్యే చెవిరెడ్డి  వివరించారు. 

Updated Date - 2021-11-28T07:11:10+05:30 IST