సెకండ్‌ వేవ్‌లోనూ సేఫ్‌గా నిర్మల్‌నగర్‌

ABN , First Publish Date - 2021-05-11T05:49:10+05:30 IST

సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. మొదటి వేవ్‌ కంటే వేగంగా ఊరూరా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని నిర్మల్‌నగర్‌లో మాత్రం సెకండ్‌ వేవ్‌ మొదలైన నాటి నుంచి ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు.

సెకండ్‌ వేవ్‌లోనూ సేఫ్‌గా నిర్మల్‌నగర్‌

కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన గ్రామం

45 ఏళ్ల దాటిన వారందరికీ టీకా 


జగదేవపూర్‌, మే 10 : సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. మొదటి వేవ్‌ కంటే వేగంగా ఊరూరా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని నిర్మల్‌నగర్‌లో మాత్రం సెకండ్‌ వేవ్‌ మొదలైన నాటి నుంచి ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. మండలంలోని అలిరాజీపేట మదిర గ్రామంగా ఉన్న నిర్మల్‌నగర్‌ కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. గ్రామంలో 120 కుటుంబాలు, 460 జనాభా ఉన్నారు. చిన్న గ్రామం కావడంతో సర్పంచ్‌ శ్యామలరాజు,  పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ముందస్తుగానే పకడ్బందీ చర్యలను చేపట్టారు. కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలను గ్రామస్థులంతా తూ.చ. తప్పకుండా పాటించడంతో నేటికి గ్రామంలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అంతేకాకుండా గ్రామంలోని 45 ఏళ్లు దాటిన 130 మంది టీకా వేయించుకుని మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. బయటకు వెళితే మాస్కులు ధరించి, భౌతికదూరాన్ని పాటిస్తున్నారు.


జాగ్రత్తలు పాటిస్తున్నాం 

కరోనా నియంత్రణకు మొదటి నుంచి జాగ్రత్తలు పాటిస్తున్నాం. ముఖ్యంగా మాస్క్‌ ధరించి శానిటైజర్‌ను వాడుతున్నాం. ఇతర గ్రామాల వారు మా గ్రామానికి రావడాన్ని తగ్గించాం. మేమూ వేరే గ్రామాలకు వెళ్లడం లేదు. వ్యాక్సిన్‌ను కూడా ప్రారంభంలోనే వేయించాం. 

- పద్మారావు, ఉపసర్పంచ్‌ 


కరోనా నివారణలో బస్వాపూర్‌ భేష్‌

 - సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిని అభినందించిన మంత్రి హరీశ్‌రావు 

జగదేవ్‌పూర్‌, మే 10: ‘కరోనా కష్ట కాలంలో ఆ గ్రామం భేష్‌.. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం సూపర్‌’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జగదేవపూర్‌ మండల పరిధిలోని బస్వాపూర్‌ గ్రామాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభినందించారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేకుండా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి పకడ్బందీ చర్యలను చేపట్టి, నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నివారణకు గ్రామ సర్పంచ్‌ మమతాఇంద్రసేనారెడ్డి, స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ చేస్తున్న ఈ కృషి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంత్రి హరీశ్‌రావు వారిని అభినందించారు. 

Updated Date - 2021-05-11T05:49:10+05:30 IST