‘ప్రైవేటు’ దోపిడీపై.. చర్యలేవీ?

ABN , First Publish Date - 2021-05-12T05:03:24+05:30 IST

‘ప్రైవేటు’ దోపిడీపై.. చర్యలేవీ?

‘ప్రైవేటు’ దోపిడీపై.. చర్యలేవీ?

- కరోనా చికిత్స పేరుతో రూ.లక్షల్లో వసూళ్లు

- ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు

- ఆస్పత్రులపై చర్యలకు అధికారుల వెనుకంజ

- కీలక నేతల ఒత్తిడే కారణం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా బాధితులను అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు... మందుల దుకాణాల నిర్వాహకులపై చర్యలు కానరావడం లేదు. ఈ దోపిడీ వెనుక కొంతమంది అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా బాధితులకు చికిత్స కోసం జిల్లాలో 11 ఆస్పత్రులకు అధికారులు అనుమతి ఇచ్చారు. మొదట్లో  కఠిన నిబంధనలు అమలు చేసినా, రెండో దశలో బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు, అనుబంధంగా ఉండే మందుల దుకాణాల్లో దోపిడీకి తెర లేచింది. జిల్లాలో అనుమతి లేకుండా అనేక ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాధితులకు చికిత్స పేరిట రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. కేవలం శ్రీకాకుళంలోనే మరో 20 ఆసుపత్రుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉదాహరణకు శ్రీకాకుళం అంబేద్కర్‌ సెంటర్‌లో ఒక ఆసుపత్రికి ఎటువంటి అనుమతి లేకపోయినా కరోనా బాధితులను ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకుంటున్నారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఒక మహిళకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురైంది. దీంతో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ వేయాలని, అవి కలెక్టర్‌ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆ ఇంజెక్షన్‌ దొరక్క, ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బంధువులు లబోదిబోమంటున్నారు.


అంతా సిండికేటు

జిల్లావ్యాప్తంగా రోజూ వేలాది సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంచి వైద్యులు.. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సిండికేటుగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బాధితులు ముందుగా సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చిన మందులకు వ్యాధి నయం కాకపోతే చివరికి శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితులను దోచుకుంటున్నారు. ఇటీవల శ్రీకాకుళం, పలాస కాశీబుగ్గ, టెక్కలి ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు, వ్యక్తులు స్థానికంగా వైద్యం పొందినా, ప్రయోజనం లేకపోయింది. దీంతో సంచి వైద్యుల సూచన మేరకు విశాఖలో మల్టీనేషన్‌ ఆసుపత్రుల్లో చేరి రూ.లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. ఇలా గ్రామీణ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రైవేటు వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి దోచుకుంటున్నారు. 


విజిలెన్స్‌ తనిఖీలు ఆ రోజుతో సరి...

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీ, కరోనా వైద్యంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది. విజిలెన్స్‌ బృందం కేవలం శ్రీకాకుళంలోని ఒకటి, రెండు ఆసుపత్రుల్లో ఇటీవల తనిఖీలు చేసి మమ అనిపించేశారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అనుమతి లేకుండా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నట్టు గుర్తించారు. కానీ, ఆ ఆస్పత్రిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరో ఆసుపత్రిలో ఒక ముఖ్య నేత కుటుంబానికి ఏకంగా ఒక ఫ్లోర్‌లో ఆరు బెడ్లు కేటాయించి చికిత్సలు అందిస్తున్నా, కనీసం చర్యలు లేవు. ఒక్క ఆస్పత్రిపై అపరాధ రుసుం విధించిన దాఖలాలు లేవు. శ్రీకాకుళంలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో డబ్బు చెల్లించినా, కనీస స్థాయిలో పట్టించుకునే నాథుడు లేడని ఒక డిప్యూటీ తహసీల్దార్‌.. ఇటీవల సెల్ఫీ వీడియో ద్వారా తన గోడు వెళ్లబుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆస్పత్రిపై కూడా ఇంతవరకూ ఎటువంటి చర్యలు లేవు.  ఆ ఆసుపత్రి యాజమాన్యానికి  ఒక అధికార పార్టీ నాయకుడి దన్ను ఉండడంతో అధికారులు మిన్నకుండి పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కరోనా బాధితులు కోరుతున్నారు. 


మందులోళ్ల మాయ...

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఏడాది కాలంగా మందుల దుకాణదారులకు కాసుల పండ పండుతోంది. జిల్లాలో సుమారు 850 మెడికల్‌ షాపులకు అనుమతి ఉండగా, వీటితో పాటు మరికొన్ని అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ల సమయంలోనూ అత్యవసరం నేపథ్యంలో మందుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలామంది ముందుగా సంచి వైద్యులను, ఆపై మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా మందుల దుకాణాల నిర్వాహకులు అందినంత దోచేస్తున్నారు. గత ఏడాది కంటే అన్నిరకాల విటమిన్స్‌ ట్యాబ్‌లెట్స్‌ స్ర్టిప్‌పై సగటున రూ.50 ధర అదనంగా పెంచి విక్రయిస్తున్నారు.  గత ఏడాది పల్స్‌ఆక్సీమీటరు కేవలం రూ.1200 లోపే ఉండగా.. ప్రస్తుతం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పెంచేశారు.  యాంటీబయాటిక్‌ మాత్రలపైనా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా ధరలు పెంచేస్తున్నా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక వేళ తనిఖీలు చేసినా.. అవి మొక్కుబడిగానే సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా ఉధృతి వేళ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించి.. మెడికల్‌ దుకాణాల్లో ధరలు నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో మందుల దుకాణాల యాజమాన్య సంఘాల సభ్యులతో సమావేశమై.. మందులపై డిస్కౌంట్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

  

Updated Date - 2021-05-12T05:03:24+05:30 IST