ఆటలు లేవు.. శిక్షణ లేదు..!

ABN , First Publish Date - 2021-02-26T05:27:34+05:30 IST

మినీ స్టేడియాల నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. నిధులున్నా.. ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. శిక్షకుల నియామకం కూడా చేపట్టడం లేదు. దీంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు.

ఆటలు లేవు.. శిక్షణ  లేదు..!
పునాది దశలోనే ఉన్న ఇచ్ఛాపురంలో మిని స్డేడియం పనులు

అసంపూర్తిగా మినీ స్టేడియాల నిర్మాణం

నిధులున్నా సాగని పనులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

మినీ స్టేడియాల నిర్మాణ పనులు జాప్యమవుతున్నాయి. నిధులున్నా.. ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. శిక్షకుల నియామకం కూడా చేపట్టడం లేదు. దీంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు. మినీ స్టేడియాల నిర్మాణం కోసం జిల్లాకు 2012-13లో రూ.31 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో టెక్కలి, సీతంపేట, పాతపట్నం, రణస్థలం, ఆమదాలవలస ప్రాంతాల్లో రూ.2కోట్లు చొప్పున  కేటాయించి... మినీ స్టేడియాల నిర్మాణం మొదలుపెట్టారు. శ్రీకాకుళంలోని పాత్రునివలసలో 33 ఎకరాల్లో మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నిర్మాణానికి  రూ.1.50 కోట్లతో ప్రహరీ పూర్తిచేశారు. వాటిలో రూ.6కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో పనులు చేపడుతున్నారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు కేటాయించగా.. రూ.8కోట్ల మేర పనులు చేపట్టారు. మిగిలిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 

- 2015- 16లో జిల్లాకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో రూ.2కోట్ల చొప్పున వెచ్చించి ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, రాజాంలలో మినీ స్టేడియం నిర్మాణాలు ప్రారంభించారు. ఇచ్ఛాపురంలో రూ.14 లక్షలకు సంబంధించి పనులు మాత్రమే జరిగాయి. వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో అందజేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.  పలాసలో మినీ స్టేడియం కోసం రూ.24 లక్షలు వెచ్చించి..  పనులు నిలిపివేశారు. నరసన్నపేటలో రూ.60 లక్షలు, రాజాంలో రూ.కోటి మేరకు పనులు చేపట్టి.. వదిలేశారు. నిధులున్నా నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ స్టేడియాల నిర్మాణాలు నిలిచిపోవడంతో శిక్షకులను నియమించడం లేదు. దీంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  మిని స్టేడియాల నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.  


అందుబాటులోకి తెస్తాం 

కరోనా నిబంధ నల సడలింపుతో కొంతమేర ప్రారంభమైన స్టేడియాలలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మిని స్టేడియాల పనులు త్వరగా పూర్తి చేస్తాం.  సరైన శిక్షకులను నియమించి మినీస్టేడియాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. 

 - బి.శ్రీనివాస కుమార్‌, జిల్లా క్రీడల అధికారి, శ్రీకాకుళం.


Updated Date - 2021-02-26T05:27:34+05:30 IST