అ‘విశ్రాంత’ ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2021-01-08T05:50:49+05:30 IST

రిటైరైనా.. తన స్థానంలో మరో ఉపాధ్యాయుడు రాకపోవడంతో పాఠాలు కంటిన్యూ చేస్తున్నారీయన.గంగవరం మండలం కీలపట్ల జడ్పీ హైస్కూల్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గజేంద్ర

అ‘విశ్రాంత’ ఉపాధ్యాయుడు

చిత్తూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రిటైరైనా.. తన స్థానంలో మరో ఉపాధ్యాయుడు రాకపోవడంతో పాఠాలు కంటిన్యూ చేస్తున్నారీయన.గంగవరం మండలం కీలపట్ల జడ్పీ హైస్కూల్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గజేంద్ర  గతేడాది నవంబరులో రిటైరయ్యారు. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో సోషల్‌ టీచర్‌కు తప్పనిసరి బదిలీ ఉండడం, ఆ ఖాళీని అధికారులు పొరపాటుగా బ్లాక్‌ చేయడంతో బదిలీ కౌన్సిలింగ్‌ తర్వాత ఇక్కడ సోషల్‌ టీచర్‌ ఉండని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తను ఇంతవరకూ పనిచేసిన పాఠశాలలోని 300మంది విద్యార్థులు నష్టపోకూడదని గజేంద్ర భావించారు.37 ఏళ్ల సర్వీసులో ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఉత్తమ రీసోర్స్‌ పర్సన్‌గా, కళాకారుడిగా మన్ననలు పొందిన గజేంద్ర ఈ విద్యాసంవత్సరం సిలబస్‌ పూర్తి చేసే వరకు ఉచితంగానే పాఠశాలలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. గుడుపల్లె, బైరెడ్డిపల్లె, పలమనేరు, పెద్దపంజాణి, గంగవరం మండలాల్లో పనిచేసిన గజేంద్ర ఆయా పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు, విద్యా ప్రమాణాల పెంపునకు విశేష కృషి చేశారు.విద్యాశాఖ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ 2000వ సంవత్సరంలో ఉత్తమ మండల రీసోర్స్‌ పర్సన్‌గా ప్రశంసాపత్రం అందుకున్నారు. తోలుబొమ్మలాట, మాస్కుల తయారీ, వెదురుతో అలంకరణ సామగ్రి, డ్రాయింగ్స్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, వేలి ముద్రలతో బొమ్మలు తదితర వినూత్న ప్రక్రియలతో విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించడంలో ఈయన నేర్పరి. అనియత విద్యలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పాఠ్యపుస్తకాల తయారీలో కూడా పని చేశారు.


  ‘‘ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టడమే నా అదృష్టం.బోధనా పద్ధతుల్లో విద్యార్థులను ఆకట్టుకునే విభిన్న ప్రక్రియలను ఎంచుకున్నా.రిటైరైనప్పుడు విద్యార్థులతో అనుబంధం తెంచుకోవాలంటే ఎంతో బాధ కలిగింది. సబ్జెక్టు టీచర్‌ లేని కారణంగా మళ్లీ విద్యార్థుల మధ్య బోధనలో నిమగ్నం కావడం సంతృప్తినిస్తోంది.’’


Updated Date - 2021-01-08T05:50:49+05:30 IST