కార్యకర్తలు లేకుండానే మమ..

ABN , First Publish Date - 2022-06-30T07:14:14+05:30 IST

వైసీపీలో జగన్‌ ఇమేజ్‌కంటే నాయకులు ఎవరికి వారు తమ వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాట మొదలైంది. రాజమహేంద్రవరం ఆనంద్‌ రీజెన్సీ ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం అందుకు వేదికైంది.

కార్యకర్తలు  లేకుండానే మమ..
ప్లీనరీలో వేదికపై నేతలు మాత్రమే ఉండగా సభలో కార్యకర్తలు లేని దృశ్యం

వైసీపీ ప్లీనరీలో సొంత ఇమేజ్‌ కోసం పాకులాట

ఇక్కడా భరత్‌రామ్‌ వర్సెస్‌ జక్కంపూడి హోరు

తీర్మానాల సమయానికి వెళ్లిపోయిన కార్యకర్తలు 

రాజమహేంద్రవరం నగర వైసీపీ ప్లీనరీ తీరు ఇది

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 29: వైసీపీలో జగన్‌ ఇమేజ్‌కంటే నాయకులు ఎవరికి వారు తమ వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాట మొదలైంది. రాజమహేంద్రవరం ఆనంద్‌ రీజెన్సీ ఫంక్షన్‌ హాలులో బుధవారం జరిగిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం అందుకు వేదికైంది. ఎంపి భరత్‌రామ్‌ అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సమావేశానికి అతిఽథులుగా మంత్రులు వనిత, చెల్లుబోయిన వేణు, రాజ్యసభసభ్యుడు బోస్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజులు హాజరయ్యారు. ఎంపీ భరత్‌రామ్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం తన అడ్డా అని చెబుతూ తాను సీఎం జగన్‌తో మాట్లాడి రూ.125 కోట్లు తెచ్చానని చెప్పుకొచ్చారు. అటుపై ముఖ్యఅతిఽథులు మాట్లాడేటప్పుడు భరత్‌రామ్‌ నాయకత్వం వర్థిలాలి అం టూ పెద్దఎత్తున యువకులు నినాదాలు చేశారు. ఇక ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రవేశించిన సమయంలో రాజా వర్గీయులు జక్కంపూడి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. వాటర్‌ బాటిళ్లు విసురుకున్నారు. చివరకు ముఖ్య అతిఽథులు సైతం వారిని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలని మైక్‌లో పదే పదే ప్రకటించాల్సిన పరిస్థితి ప్లీనరీలో కనిపించింది. ఇలా ప్లీనరీలో పార్టీ గురించి కన్నా తమ సొంత ఎజెండాతోనే వక్తలు మాట్లాడారు. సభ ప్రారంభంలో హాలు నిండినా.. నేతల సొంత ఉపన్యాసాలు వినలేక కార్యకర్తలే జారుకున్నారు.



Updated Date - 2022-06-30T07:14:14+05:30 IST