ఒడిశా టు విశాఖ!

ABN , First Publish Date - 2020-11-21T05:13:47+05:30 IST

ప్రభుత్వం ఎన్ని విధానాలు అమలు చేస్తున్నా.. ఇసుకాసురుల అక్రమాలు ఆగడం లేదు. టీడీపీ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తాజాగా ఆంధ్రాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో ఇసుకాసురులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఒడిశాలో అనుమతుల పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టి.. అక్రమ రవాణా సాగిస్తున్నారు. విశాఖలో డిమాండ్‌ ఉండడంతో నేరుగా.. ఒడిశా నుంచి జిల్లా సరిహద్దులు మీదుగా అక్కడికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నేతల అండతో అక్రమ రవాణా సాగిస్తుండడంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.

ఒడిశా టు విశాఖ!
భామిని మండలం దిమిడిజోల నుంచి విశాఖకు సిద్ధమైన ఇసుక లారీలు

 అనుమతుల ముసుగులో ఇసుక అక్రమ రవాణా

 పాలకుల అండతో దర్జాగా దోపిడీ

 అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎన్ని విధానాలు అమలు చేస్తున్నా.. ఇసుకాసురుల అక్రమాలు ఆగడం లేదు. టీడీపీ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తాజాగా ఆంధ్రాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో ఇసుకాసురులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఒడిశాలో అనుమతుల పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టి.. అక్రమ రవాణా సాగిస్తున్నారు. విశాఖలో డిమాండ్‌ ఉండడంతో నేరుగా.. ఒడిశా నుంచి జిల్లా సరిహద్దులు మీదుగా అక్కడికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నేతల అండతో అక్రమ రవాణా సాగిస్తుండడంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. 

-----------

ఒడిశాలో అనుమతి పేరిట.. జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒడిశా నుంచి విశాఖకు అక్రమంగా ఇసుక నిల్వలు  తరలిపోతున్నాయి. జిల్లాలో వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక నిల్వలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో ఇసుక తవ్వకాలకు తగినన్ని వనరులు లేవు. ఇదే అదునుగా  ఇసుక మాఫియా విశాఖపట్నం అవసరాల పేరుతో సిక్కోలులో ప్రత్యేకంగా క్వారీలను కేటాయించేలా ప్రభుత్వ పెద్దల సహకారంతో పావులు కదిపింది. దీనికి అనుమతులు ఇచ్చినా... ఆన్‌లైన్‌ విధానంలో బల్క్‌ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో ఇసుకాసురులు జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇసుక నిల్వలపై కన్నేశారు. భామిని మండలానికి ఆనుకుని ఉన్న దిమ్మిడిజోల, బాలేరు గ్రామాల మధ్య బూదర బెండ్రి పరిసరాల్లో వంశధార నదిలో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నా.. అక్కడ అవసరాలకు వినియోగించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వందలాది లారీల్లో ఇసుకను విశాఖకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒడిశాలో ఆరు టైర్ల లారీ ఇసుకను రూ.8వేల నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీనికి రవాణా ఛార్జీలతో కలిపి రెండు రెట్లు అదనపు ధరకు విశాఖలో విక్రయిస్తున్నారు. విశాఖలో ఆరు టైర్ల లారీలో 4 నుంచి 5  టన్నుల ఇసుకను రూ.40 వేలు నుంచి, రూ.60 వేల వరకు  విక్రయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి చెందిన నిర్మాణ సంస్థకు పెద్ద సంఖ్యలో ఇసుక తరలిస్తున్నట్లు తెలిసింది. 


అక్రమ మార్గాలెన్నో..

ప్రతిరోజు భామిని మండలం పాలాడ, తాలాడ, నేరడి పరిసరాల నుంచి సుమారు 50 వరకు లారీలు ఇసుక లోడులతో వివిధ మార్గాల ద్వారా విశాఖ వెళ్తున్నాయి. భామిని మీదుగా పాలకొండ, రేగిడి మండలం మీదుగా విశాఖ తరలిపోతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మీదుగా మరికొన్ని లారీలు విశాఖ తరలిపోతున్నాయి. ఒక రెవెన్యూ అధికారితో పాటు జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నేత అండతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, మీడియా, రెవెన్యూ అధికారులు... ఇలా అన్ని వర్గాలకు ఇసుక మాఫియా తగిన రీతిలో ముడుపులు చెల్లించి.. ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేసిన సందర్భంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో మాఫియా తమకు ఒడిశాలో ఇసుక తవ్వకాలు, విశాఖ తరలింపునకు అనుమతులు ఉన్నట్లు నమ్మబలుకుతున్నారు. తనిఖీ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణాకు సై అనడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

 


Updated Date - 2020-11-21T05:13:47+05:30 IST