ప్రతిపాదనలతోనే సరి..!

ABN , First Publish Date - 2021-05-04T05:15:39+05:30 IST

ప్రతిపాదనలతోనే సరి..!

ప్రతిపాదనలతోనే సరి..!
పెద్దతండా-రాంనుంతల రోడ్డులో వాగు దాటుతున్న గ్రామస్థులు (ఫైౖల్‌)

  • వాగులపై వంతెనల నిర్మాణం ఎప్పుడో..?
  • రోడ్ల మధ్య రాకపోకలకు ఇబ్బందులు
  • వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడి వాహనాలు అక్కడే..!
  • ఏళ్ల కాలంగా స్థానికుల విన్నపాలు
  • అమలుకు నోచుకోని నేతల హామీలు

ఆమనగల్ల్లు : రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌, ఆమనగల్లు మండలాల పరిధిలోని గ్రామాల రోడ్ల మధ్యలో వాగులపై వంతెనలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా వంతెనల నిర్మాణం గురించి ప్రజలు ప్రభుత్వానికి విన్నవించుకున్నా స్పందన లేదు. దీంతో వర్షాకాలంలో తరచూ ఆయా రోడ్లలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెనలు లేని కారణంగా బస్సులు, వాహనాలు నడవకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆమనగల్లు, కడ్తాల మండల పరిధిలోని పలు వాగులపై వంతెనల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నిర్మాణాల విషయంలో నేతల హామీలు నీటి మూటలుగా మిగిలాయి. ఆమనగల్లు మండలంలో అనేక చోట్ల వాగులపై వంతెనలు లేక ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. రాంనుంతల-కోనాపూర్‌, మేడిగడ్డ-శంకర్‌ కొండ రోడ్లను ఇటీవల బీటీగా మార్చారు. కానీ ఆయా రోడ్ల మధ్యన వాగుల వద్ద వంతెనలు నిర్మించలేదు. మేడిగడ్డ-శంకర్‌ కొండ వాగుపై వంతెన నిర్మాణానికి పీఎంజీఎ్‌సవై ద్వారా ఇటీవల నిధులు మంజూరైనట్లు అధికారులు పేర్కొన్నారు. పనులు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. మంగళపల్లి-చెన్నారం, కడ్తాల మండలం మైసిగండి-ఎక్వాయిపల్లి, ముద్విన్‌-ఆకుతోటపల్లి రోడ్లలో వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాల ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవిస్తున్నా చొరవ చూపడం లేదు. ముద్విన్‌, ఆకుతోటపల్లి రోడ్డు మధ్యలో వంతెన పునరుద్ధరణ కూడా నేతల హామీలకే పరిమితమైంది. రాంనుంతల వాగు వరకు ఇటీవల బీటీ రోడ్డు నిర్మించినా వాగుపై వంతెన నిర్మాణం చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొనిఆయా వాగులపై వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

రాంనుంతల వాగుపై వంతెన నిర్మించాలి

ఆమనగల్లు మండలంలోని రాంనుంతల-పెద్దతండా మధ్య  వాగుపై వంతెన నిర్మించి రాకపోకలు సాగేలా ప్రజాప్రతినిధులు,అధికారులు చొరవ తీసుకోవాలి. వాగులపై వంతెనలు లేక రాకపోకలకు తరుచూ ఇబ్బంది పడాల్సివస్తోంది. ఇటీవల బీటీ రోడ్డు నిర్మించినా వంతెన నిర్మించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.

                - శ్రీరాములు, మాజీ సర్పంచ్‌, రాంనుంతల  

ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి

మేడిగడ్డ-శంకర్‌కొండ వాగుపై వంతెన నిర్మాణానికి ఇటీవల రూ.3.10 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా రాంనుంతల-పెద్దతండా మధ్య వాగుపై వంతెన లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే. ఇటీవల ప్రభుత్వం బీటీ రోడ్డు నిర్మించింది. వాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు విన్నవించగా నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.

          - అనురాధాపత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు

Updated Date - 2021-05-04T05:15:39+05:30 IST