తప్పుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2021-03-03T06:51:15+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి తొలిరోజు 233మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

తప్పుకోవాల్సిందే!
తిరుపతిలో 45వ డివిజన్‌లో సచివాలయం వద్దకు నామినేషన్‌ వేసేందుకు వచ్చి వైసీపీ మనుషులను చూసి భయంగానే ముందుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి చంద్ర మోహన్‌







మున్సిపల్‌‌ ఎన్నికల్లో కొనసాగుతున్న అరాచకపర్వం

 

తొలిరోజే 233 నామినేషన్ల ఉపసంహరణ


9 చోట్ల రీనామినేషన్‌ అవకాశమున్నా మూడుచోట్లే వినియోగం

తిరుపతి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి తొలిరోజు 233మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చిలో నామినేషన్ల పరిశీలన ముగిసేటప్పటికి జిల్లాలోని రెండు నగర పాలక సంస్థలు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 248 స్థానాలకు 1530 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వీటిలో మంగళవారం 233 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 1297మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం సాయంత్రానికి ఎంతమంది పోటీలో మిగులుతారో, ఎందరు వెనక్కు తగ్గుతారో స్పష్టం కానుంది. కాగా తొలిరోజు నామినేషన్ల ఉపసంహరణ ఫలితంగా చిత్తూరు నగరంలో 6 డివిజన్లు, మదనపల్లె మున్సిపాలిటీలో ఆరు వార్డులు, పలమనేరు మున్సిపాలిటీలో ఐదు వార్డులు, తిరుపతి నగరంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం కానున్నాయి. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీలో వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల తరహాలోనే అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో మాత్రం తొలిరోజు నామినేషన్ల ఉపసంహరణ జరిగినా ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకపోవడం విశేషం. ఇంకోవైపు తిరుపతిలో ఆరుచోట్ల, పుంగనూరులో మూడు చోట్లా వెరసి తొమ్మిది స్థానాల్లో రీ నామినేషన్‌కు ఎన్నికల సంఘం అవకాశమివ్వగా కేవలం మూడు చోట్ల మాత్రమే అభ్యర్థులు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు.  


చిత్తూరులో వైసీపీకి ఆరు డివిజన్లు ఏకగ్రీవం

నామినేషన్ల ఉపసంహరణ ఫలితంగా చిత్తూరులో ఆరు డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 50 డివిజన్లు వుండగా అందులో సింగిల్‌ నామినేషన్‌ కారణంగా స్ర్కూట్నీ నాటికే 46వ డివిజన్‌ వైసీపీకి ఏకగ్రీవమైంది. తాజాగా మంగళవారం 90 నామినేషన్ల ఉపసంహరణ జరగగా దానివల్ల 7, 17, 24, 35, 38, 40 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వెనుక కొంతవరకూ ప్రలోభాలు కారణం కాగా ప్రధానంగా బెదిరింపులే పనిచేసినట్టు సమాచారం. 


మదనపల్లెలోనూ ఆరు వార్డుల్లో ఏకగ్రీవం

మదనపల్లెలో మొత్తం 35 వార్డులకు గానూ స్ర్కూట్నీ సమయానికే 2 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.మంగళవారం 29 నామినేషన్లు విత్‌ డ్రా కావడంతో మరో ఆరు వార్డులు అధికార పార్టీ అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి.కొంతమేరకు టీడీపీ అభ్యర్థులు ప్రలోభాలకు గురైనట్టు ప్రచారం జరుగుతున్నా అభ్యర్థులకు ఆర్థిక వనరులు లేకపోవడం, నేతల మద్దతు కరువవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు 10వ వార్డు అభ్యర్థిని లక్ష్మీదేవి కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం తెలుగుమహిళ అధ్యక్షురాలు కూడా. ఆమె నామినేషన్‌ పత్రాల్లో సంతకం లేదని అధికారులు తిరస్కరించారు. తన సంతకం వున్న పేజీని తొలగించారని ఆరోపిస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. వార్డులో ప్రజలతో సత్సంబంధాలున్నా స్థానికంగా నేతల మద్దతు లేదని ఆమె వాపోతోంది. గతంలో 16వ వార్డుకు మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన సాకే లక్ష్మీదేవి ఇపుడు 15వ వార్డుకు టీడీపీ అభ్యర్థి. బరిలో వున్నా పట్టించుకునే దిక్కు లేదని సమాచారం. మాట్లాడదామంటూనే నేతలు రోజులు గడిపేస్తున్నారనేది ఆమె ఆరోపణ. పార్టీకి కంచుకోటల్లాంటి 1, 33, 34, 35 వార్డుల్లో ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఒకటి రెండు చోట్ల బలమైన, సీనియర్‌ నేతలు పోటీ నుంచీ తప్పుకునేశారు. ఇపుడు ఉపసంహరణ వంతు వచ్చింది. రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన సిద్ధప్ప సీనియర్‌ నేత. కోడలు గతంలో కౌన్సిలర్‌. ఇపుడు పోటీలో వున్నారు. ఆమెను వైసీపీలోకి చేర్చుకుని ఏకగ్రీవం చేసేలా మంతనాలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచీ అడ్డుకునే ప్రయత్నాల్లేవు.


పలమనేరులో ఐదు వార్డులు వైసీపీ పరం

పలమనేరులో మంగళవారం ఐదు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచీ తప్పుకోవడంతో ఆ స్థానాలు వైసీపీ పరమయ్యాయి. మొత్తం 26 వార్డులుండగా నామినేషన్ల పరిశీలన ముగిసేటప్పటికే పది వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.మంగళవారం మరో ఐదు వార్డులు ఆ పార్టీ పరమయ్యాయి. మిగిలిన 11 చోట్ల అభ్యర్థులు పోటీలో వున్నారు.ఉపసంహరణ గడువు ముగిస్తే గానీ మిగిలినవాటిలో ఎన్ని చోట్ల పోటీ వుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ అధికార పార్టీ నుంచీ టీడీపీ అభ్యర్థులకు ప్రలోభాలేవీ ఎదురు కాలేదని సమాచారం. అయితే ఆర్థిక వనరుల లోటు, నేతల మద్దతు లేకపోవడంతోనే అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడలేక తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


తిరుపతి కథే వేరు!

తిరుపతిలో 50 డివిజన్లు వుండగా స్ర్కూట్నీ నాటికే ఆరు డివిజన్లలో సింగిల్‌ నామినేషన్ల కారణంగా వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవమైన పరిస్థితి. వీటిలో ఇపుడు 21, 45డివిజన్లలో రీ నామినేషన్‌ అవకాశంతో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వైసీపీ ఏకగ్రీవాల సంఖ్య ఆరు నుంచీ నాలుగుకు తగ్గింది. కాగా మంగళవారం 60 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. వీటి వల్ల మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి. అంటే మొత్తం ఏడు డివిజన్లు వైసీపీకి పోటీ లేకుండా దక్కనున్నాయి. తాజాగా ఏకగ్రీవమైన మూడు డివిజన్లలోనూ టీడీపీ అభ్యర్థులు అధికార పక్షం బెదిరింపులతోనే పోటీ నుంచీ తప్పుకున్నట్టు సమాచారం. ఉదాహరణకు 11వ డివిజన్‌ అభ్యర్థికి కుటుంబీకుల మద్యం వ్యాపారం సజావుగా నడవాలంటే పోటీ నుంచీ తప్పుకోవాలన్న హెచ్చరికలు జారీ కావడంతో గత్యంతరం లేక తప్పుకున్నట్టు చెబుతున్నారు. ఇక 14వ డివిజన్‌లో అభ్యర్థి కాంట్రాక్టరని, ఇదివరకే చేసిన పనులకు సంబంధించి రూ. 2 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో విధిలేక రాజీ పడినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో రీ నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించగా 10వ డివిజన్‌లో బీజేపీ, మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు వినియోగించుకోవాల్సి వుంది. అయితే వాటిలో 2, 21, 45 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయగా 8, 41 డివిజన్లలో టీడీపీ, 10వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు.


పుంగనూరులో ఏకగ్రీవానికి వైసీపీ యత్నాలు

పుంగనూరు మున్సిపాలిటీలో అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక్కడ మొత్తం 31 వార్డులుండగా స్ర్కూట్నీ సమయానికే 16 వార్డులు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 వార్డులకు అభ్యర్థులు పోటీలో వున్నారు. వాటిలో టీడీపీ అభ్యర్థులు పోటీ వున్నది 9 చోట్లే. అందులోనూ మంగళవారం 8 చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేశారు. బీజేపీ ఒకచోట, ఎస్‌డీపీఐ ఒకచోట తప్పుకున్నాయి. టీడీపీ అభ్యర్థి పోటీ వున్న 28వ వార్డులో అభ్యర్థి చంద్రకళ బెంగళూరులో వున్నట్టు సమాచారం. దీంతో ఆమెతో విత్‌డ్రా చేయించేందుకు వైసీపీ నేతల బృందం అక్కడకు వెళ్ళినట్టు చెబుతున్నారు.ఇదివరకూ పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు లేకుండా మొత్తం స్థానాలు ఏకగ్రీవమయ్యే పరిస్థితి నెలకొంటోంది. టీడీపీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది వైసీపీ నేతల బెదిరింపులకు, పోలీసు కేసుల భయంతోనే తప్పుకున్నట్టు సమాచారం. వీరికి పార్టీ నేతల ప్రత్యక్ష మద్దతు, సహకారం లోపించింది. ఆర్థికంగానూ వనరులు లేకపోవడం, ఇతరత్రా మద్దతు కరువవడంతో పోటీలో నిలిచే పరిస్థితి లేకపోతోందని తెలుస్తోంది. మరోవైపు 9, 14, 28 వార్డుల్లో రీ నామినేషన్‌కు ఎస్‌ఈసీ అవకాశం ఇచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. 9వ వార్డు అభ్యర్థి మున్నీ తన కుమార్తె అనారోగ్యంతో వుందని నెల్లూరుకు వెళ్ళిపోగా, 14వ వార్డు అభ్యర్థి గీతమ్మ పోలీసు కేసుల భయంతో రాజకీయాలే వద్దంటూ కర్ణాటకలోని ముళబాగల్‌ వెళ్ళిపోయినట్టు సమాచారం. 28వ వార్డులోనూ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయలేదు.



Updated Date - 2021-03-03T06:51:15+05:30 IST