మనను కరోనా నుంచి రక్షిస్తున్నదీ అదే

Published: Fri, 10 Apr 2020 10:48:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మనను కరోనా నుంచి రక్షిస్తున్నదీ అదే

మన ఏరియా సేఫ్!

మలేరియా ప్రభావిత దేశాలకు కరోనా ముప్పు తక్కువే

మలేరియా తరహాలోనే కరోనా దాడి

హిమోగ్లోబిన్‌ నుంచి ఐరన్‌ను వేరు చేసే వ్యాధి

ఐరన్‌ లేక ఆక్సిజన్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం

అందుకే  మలేరియా మందులు పనిచేస్తున్నాయి

చైనా శాస్త్రజ్ఞుల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

ఆసియా, ఆఫ్రికా ప్రజల్లో మలేరియా నిరోధకత


అమెరికాను, అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలను, చిగురుటాకుల్లా వణికిస్తున్న కొవిడ్‌-19.. మనదేశానికి మాత్రం ఆ స్థాయి పెనుముప్పుగా పరిణమించట్లేదు! కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ‘ఇదీ కారణం’ అంటూ  పలు ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. మలేరియా ప్రభావం ఎక్కువగా ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంటోందన్నది వాటిలో ముఖ్యమైనది. మలేరియా కేసులు ఎక్కువగా ఉండే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం అని ఈ ప్రతిపాదన చేస్తున్నవారు చెబుతున్నారు.


ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలు.. అంటే, భూమధ్య రేఖకు పైన కర్కాటక రేఖ నుంచి కింద మకర రేఖ దాకా ఉన్న దేశాలన్నీ మలేరియా ప్రభావిత దేశాలు. ఆ దేశాల్లో కొన్ని వందల ఏళ్లుగా మలేరియా ఉంది. దీంతో, ఆయా దేశాల ప్రజల జన్యువుల్లో దానికి సంబంధించిన ఉత్పరివర్తనాలు (జెనెటిక్‌ మ్యుటేషన్‌) జరిగి మలేరియా నిరోధకత పెరిగింది. అదే నిరోధకత కరోనా నుంచి కూడా వారిని కాపాడుతోందన్నది ఈ ప్రతిపాదన చేస్తున్నవారి విశ్లేషణ. అదే.. కర్కాటక రేఖకు పైన, మకర రేఖకు కింద ఉండే దేశాల్లో మలేరియా సమస్య లేదు. కాబట్టి, మలేరియా నిరోధకత వారిలో లేదని వారు చెబుతున్నారు. అందుకే.. అమెరికన్లు, యూరోపియన్లలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని విశ్లేషిస్తున్నారు. వారి ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆసక్తికరమైన పరిశోధన ఒకటి చైనాలో జరిగింది.


ఇందులో లేత పసుపు రంగు ఉన్న దేశాల్లో.. లక్ష జనాభాకు పది కన్నా తక్కువ మలేరియా కేసులు నమోదవు తాయి. ముదురు ఎరుపు రంగు ఉన్న దేశాల్లో లక్షకు 25 వేల మంది కన్నా ఎక్కువగా మలేరియా బారిన పడుతు న్నారు. భారత్‌లో లక్షకు 100 నుంచి 1000 మలేరియా కేసులు నమోదవుతా యని డబ్ల్యూహెచ్‌వో అంచనా.


కరోనా మన శరీరంలోకి ప్రవేశించాక ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, ఇది శ్వాసకోశ వ్యాధి అని శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణులు భావిస్తున్నారు. కానీ, అది ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే కీలక వాహకమైన హిమోగ్లోబిన్‌ (ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రొటీన్‌ మాలిక్యూల్‌)పై దాడి చేస్తుందని, ఆక్సిజన్‌ సరఫరాకు ఆటంకం కలిగిస్తుందని తమ పరిశోధనలో తేలినట్లు.. చైనాలోని సిచువాన్‌ యూనివర్సిటీ, యిబిన్‌ యూనివర్సిటీలకు చెందిన వెన్‌ ఝాంగ్‌ లియు, హువాలాన్‌ లి అనే ఇద్దరు పరిశోధకులు ప్రకటించారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. కరోనా వైర్‌సలోని ఓఆర్‌ఎఫ్‌ 8, సర్ఫేస్‌ గ్లైకో ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌పై ఉండే హీమ్స్‌కు అతుక్కుంటాయి.


హీమ్స్‌ అంటే.. ఐరన్‌ అయాన్‌ ఉండే పొర్ఫిరిన్స్‌. కొవిడ్‌-19 మనశరీరంలోకి ప్రవేశించాక ఆ వైర్‌సపై ఉండే సర్ఫేస్‌ గ్లైకో ప్రొటీన్‌ ఈ ఐరన్‌ అయాన్‌ను హీమ్స్‌ నుంచి తొలగిస్తుంది. ఐరన్‌ అయాన్‌ లేని హిమోగ్లోబిన్‌.. లోపల మందు లేని డొల్ల టాబ్లెట్‌లాంటిది. సరుకు పెట్టుకునే క్యాబిన్‌ లేని రవాణా లారీ లాంటిది. దాని వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. వైరస్‌ సోకినవారిలో ఇలా ఐరన్‌ అయాన్‌ లేని ప్రొటీన్‌ మాలిక్యూల్స్‌ (హిమోగ్లోబిన్‌) ఊరకనే శరీరమంతటా తిరుగుతూ ఉంటాయి. వాస్తవానికి వాటి పని.. ఊపిరితిత్తుల నుంచి శరీరభాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం. ఐరన్‌ అయాన్‌ లేని కారణంగా అవి ఆ పని చేయలేవు.


దీంతో.. వైరస్‌ సోకినవారిలో ఆక్సిజన్‌ స్థాయు లు తగ్గిపోతుంటాయి. శరీరానికి తగినంత ఆక్సిజన్‌ లభించక బాధితులు ఎగశ్వాసతో ఇబ్బంది పడతారు. వెంటనే వైద్యులు వారికి వెంటిలేటర్‌ పెడతారు. కానీ, సమస్య ఊపిరితిత్తుల్లో కాదని.. ఎర్రరక్త కణాలు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయకపోవడమేనని చైనా పరిశోధకులు చెబుతున్నారు. సమస్య ఒకటైతే చికిత్స వేరేదానికి ఇవ్వడం వల్లనే వెంటిలేటర్‌పై ఉన్న రోగులు చనిపోతున్నారన్నది వారి వాదన. అంతేకాదు, తగినంత ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడంతో మూత్రపిండాలు ఎరిత్రోపొయిటీన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. దీని పని ఏంటంటే.. ‘తగినన్ని ఎర్ర రక్త కణాలను పుట్టించు’ అని బోన్‌మ్యారో (మూలుగ)కు చెప్పడమే. ఆ హార్మోన్‌ సందేశం మేరకు బోన్‌ మ్యారో బోలెడన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కరోనాకు చికిత్స పొందుతున్నవారిలో హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరగడానికి కారణం ఇదేనని వారు చెబుతున్నారు.


మరోవైపు.. హిమోగ్లోబిన్‌ నుంచి విడివడ్డ ఐరన్‌ అయాన్‌ విషంలాంటిదే. అది శరీరంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌కు కారణమవుతుంది. అంటే.. శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌ సంఖ్యను పెంచేస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్‌ ఎందుకు హానికరమైనవంటే.. వీటిలో ఒక ఎలకా్ట్రన్‌కు జత ఉండదు. ఆ జత కోసం ఇవి శరీరంలో తిరుగుతూ ఏ అవయవంలోని కణంనుంచి దొరికితే ఆ కణంనుంచి ఎలకా్ట్రన్‌ను సంగ్రహిస్తాయి. తనకు కావాల్సిన జతను సమకూర్చుకునేందుకు ఇవి గుండె, క్లోమం సహా ఏ అవయవాన్నీ వదలవు.


అలా ఒక ఫ్రీరాడికల్‌ తనవద్ద లేని ఎలకా్ట్రన్‌కు జోడీని సంగ్రహించాక.. దాన్ని పోగొట్టుకున్న కణం ఫ్రీరాడికల్‌గా మారి జోడీని వెతుక్కుంటుంది. ఇది చెయిన్‌ రియాక్షన్‌లాగా మారి ఫ్రీరాడికల్స్‌ సంఖ్య పెరిగిపోతుంది. ఇవి డీఎన్‌ఏ స్ట్రక్చర్‌నూ మార్చేస్తాయి. అది మరింత ప్రమాదకరం. అంటే కరోనా వైరస్‌ చేస్తున్న ఒక్క పని.. హిమోగ్లోబిన్‌ నుంచి ఐరన్‌ అయాన్‌ను తొలగించ డంవల్ల లోపల ఇంత హాని జరుగుతుందన్నమాట. ఇలాంటివారికి క్లోరోక్విన్‌ను వాడితే.. అది వైర్‌సలోని ఓఆర్‌ఎఫ్‌8, సర్ఫేస్‌ గ్లైకో ప్రొటీన్‌ను హీమ్స్‌కు అతుక్కోకుండా అడ్డుకుంటుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం కూడా హిమోగ్లోబిన్‌ను సరిగ్గా పనిచేయకుండా నిరోధిస్తుంది. నిజానికి అది జీవి. కరోనా వైర్‌సకు జీవం ఉండ దు. కానీ, రెండూ ఒకేలాగా పనిచేస్తున్నాయి. అందుకే మలేరి యా మందు.. కరోనా సోకిన వారికీ పనిచేస్తోందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మలేరియా ఎక్కువగా ఉండే దేశాల్లో వారికి ఇప్పటికే నిరోధకత ఉంటుంది కాబట్టి కరోనా ఉధృతీ తక్కువగా ఉంటోందని వారు విశ్లేషిస్తున్నారు.     -సెంట్రల్‌ డెస్క్‌


ఆ దేశాల్లో కరోనా ఉధృతి తక్కువ


- వాసిరెడ్డి అమర్‌నాథ్‌, స్లేట్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు


మలేరియా ప్రభావిత దేశా ల్లో కరోనా ఉధృతి తక్కువగా ఉందని స్లేట్‌ స్కూల్స్‌ వ్యవస్థాపకుడు వాసిరెడ్డి అమర్‌నాథ్‌ కొన్ని వారాల క్రితమే ఒక ప్రతిపాదన చేశారు. సివిల్స్‌లో మెడికల్‌ ఆంత్రోపాలజీ ఒక సబ్జెక్టుగా చదివిన అమర్‌నాథ్‌.. తనకున్న ఆసక్తితో ఈ వైరస్‌ ప్రభావం వివిధ దేశాలపై ఎలా ఉందో పరిశీలించారు. పలు దేశాల్లో ఉన్న తన బంధువులు, స్నేహితుల నుంచి సేకరించిన సమాచారం, ఇంటర్‌నెట్‌లో లభ్యమవుతున్న సమాచారాన్ని విశ్లేషించి ఈ ప్రతిపాదన చేశారు. తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తన ప్రతిపాదనను బలపరిచే పరిశోధన రావడం పట్ల ఆయ న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత చర్చ జరగాలని, లాక్‌డౌన్‌పై నిర్ణయాలు తీసుకునేప్పుడు దీనినీ పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.